టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బిగ్ బొనాంజ
ముంబై : నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్ కు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోణి కొట్టింది. జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. నేడు విడుదల చేసిన ఈ క్యూ4 ఫలితాల్లో ఇన్ఫోసిస్ 2.8 శాతం పడిపోయి, రూ.3603 కోట్ల లాభాలను నమోదుచేసినట్టు ప్రకటించింది. గత క్వార్టర్ కంటే ఇది 2.8 శాతం తక్కువని వెల్లడైంది. లాభాలుపడిపోయినప్పటికీ ఇన్ఫీ తన షేర్ హోల్డర్స్ కు బిగ్ బొనాంజ ప్రకటించింది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఒక్కో షేరుకు 14.75 డివిడెండ్ ఇస్తున్నట్టు వెల్లడించింది. అదనంగా మరో 13వేల కోట్ల రూపాయలను షేరు బై బ్యాక్ లేదా డివిడెంట్ రూపంలో ఇవ్వనున్నట్టు షేరు హోల్డర్స్ కు తెలిపింది.
లాభాలతో పాటు కంపెనీ రెవెన్యూలను కోల్పోవాల్సి వచ్చింది. సీఎన్బీసీ-టీవీ18 అంచనా ప్రకారం రూ.3570 కోట్ల లాభానార్జిస్తుందని తెలిసింది. వారి అంచనాల కంటే కాస్త ఎక్కువగానే కంపెనీ లాభాలను నమోదుచేసింది. స్థిరమైన కరెన్సీ విలువల పరంగా రెవెన్యూ వద్ధి 6.5 శాతం నుంచి 8.5 శాతం వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ వద్ధి మాత్రం విశ్లేషకుల అంచనాలను తప్పాయి. ఈ ఫలితాల సందర్భంగా కంపెనీ కో-చైర్మన్ గా, స్వతంత్ర డైరెక్టర్ గా రవి వెంకటేశన్ ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ఫలితాల ప్రకటనాంతరం కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2.35 శాతం నష్టాల్లో 947.90 వద్ద కంపెనీ షేర్లు నడుస్తున్నాయి.