Don Seenu
-
‘డాన్ శీను’మళ్లీ చిక్కాడు!
⇒కొన్నేళ్ల క్రితం చిరంజీవి ఇంట్లో చోరీకి యత్నం ⇒ఇప్పటి వరకు 21 కేసుల్లో నిందితుడు ⇒తాజాగా ముషీరాబాద్‌లో రెండో చోరీలు సిటీబ్యూరో: దాదాపు పదకొండేళ్ల క్రితం సినీ నటుడు చిరంజీవి ఇంట్లో చోరీకి యత్నించిన ఘరానా దొంగ కోన శ్రీను అలియాస్ డాన్ శ్రీను మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు ఇళ్లో్లల్లో దొంగనాలకు సంబంధించిన కేసుల్లో ఇతడిని అరెస్టు చేసినట్లు మధ్య మండల డీసీపీ డి.జోయల్ డెవిస్ సోమవారం వెల్లడించారు. ఇతడి నుంచి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గెడ్డనపల్లికి చెందిన కోన శ్రీను 17 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని పీ అండ్ టీ కాలనీలో ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడిన ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చోరీల బాటపట్టాడు. మెగాస్టార్ ఇంటి గోడ దూకి... అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న డాన్ శ్రీనుకు కొన్ని కేసుల్లో న్యాయస్థానం దోషిగా నిర్థారించి జైలు శిక్ష కూడా విధించింది. 2006లో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని సినీ నటుడు చిరంజీవి ఇంట్లో గోడ దూకి లోపలకు ప్రవేశించగా, పెంపుడు కుక్కలు వెంటపడటంతో సెక్యూరిటీ గార్డులు పట్టుకోవడానికి యత్నించారు. దీంతో వారిపై దాడి చేసి పారిపోయేందుకు విఫలయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. గడిచిన 17 ఏళ్లల్లో సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, గోపాలపురం పోలీసుస్టేషన్ల పరిధిలో 21 నేరా లు చేశాడు. ఇళ్ళల్లో చోరీలతో పాటు వాహనచోరీలు సైతం చేసిన ఇతగాడికి కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలు చేయడం ఇతడి నైజం. చోరీ ‘లగేజీ’తో ఆటోలో.. డాన్ శ్రీను గత నెల 23న ముషీరాబాద్ ఠాణా పరిధిలోని భోలక్‌పూర్ పద్మశాలి కాలనీలో పంజా విసిరాడు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి దయానంద్ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్న ఇతను పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. 40 అంగుళాల ఎల్ఈడీ టీవీతో పాటు ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, మూడున్నర కేజీల వెండి తదితరాలు ఎత్తుకెళ్లాడు. వీటిని సూట్‌కేసులు, బెడ్‌షీట్స్‌లో నేర్పుగా పార్శిల్ చేసుకున్న శ్రీను వాటిని తరలించడానికి ఆటో వినియోగించాడు. ఇల్లు ఖాళీ చేస్తున్నానంటూ ఆటో డ్రైవర్‌కు చెందిన శ్రీను రూ.800 కిరాయి చెల్లించి మరీ వాటిని పీ అండ్ టీ కాలనీలోని తన ఇంటికి చేర్చాడు. సొత్తు రికవరీ... అదే ఠాణా పరిధిలోని మరో ఇంట్లోనూ చేతివాటం చూపించిన శ్రీను అక్కడ నుంచి ఓ సెల్‌ఫోన్ చోరీ చేశాడు. దయానంద్ ఇంట్లో చోరీ కేసును ఇన్స్పెక్టర్ ఎస్.రామ్చంద్రారెడ్డి నేతృత్వంలో డీఐ డి.సంతోష్‌కుమార్, డీఎస్సై బాల్‌రాజ్ దర్యాప్తు చేశారు. సోమవారం ఉదయం డాన్ శ్రీనును పట్టుకున్న అధికారులు అతడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. ఇతడి వద్ద మరో 13 సెల్ఫోన్లు రికవరీ అయినా.. వీటికి సంబంధించి ఎక్కడా కేసులు నమోదు కాలేదు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెలవుల కోసం ఎక్కడికైనా వెళ్తున్నట్లైతే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ జోయల్ డెవిస్ కోరారు. -
డాన్ శీను కథ
హ్యూమర్ ఫ్లస్ సినిమాలు చూసి చూసి శీను డాన్ శీను కావాలనుకున్నాడు. లివింగ్ స్కిల్స్ ఎక్స్పర్ట్ దగ్గరికెళ్ళి సలహా అడిగాడు. ‘‘జీవితంలో గెలుపు ముఖ్యం కానీ ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు. ఇంకొకడి లివింగ్‌ని కిల్ చేసయినా మనం స్కిల్స్ నేర్చుకోవాలి. జీవితమంతా కష్టపడి పది లక్షలు సంపాదించినవాడి దగ్గర కష్టపడకుండా పది నిముషాల్లో ఆ డబ్బు లాక్కోవాలి. డాన్ అంటే అదే’’ అన్నాడు ఎక్స్పర్ట్. ‘‘డాన్ కావాలంటే ఏం చేయాలి?’’ ‘‘దానికి బూన్ గైడ్లు ఎక్కడా అమ్మరు. వెళ్ళి ఏదయినా విప్లవ గ్రూప్‌లో చేరు. సమాజానికి డాన్లను అందించే పనిలో వాళ్లు ముందంజలో వున్నారు’’ ‘‘నాకు బ్లడ్ గ్రూప్ తెలుసుకానీ విప్లవ గ్రూప్‌లు తెలియదే’’ అన్నాడు శీను అమాయకంగా. ‘‘మార్క్సిజం కంటే గ్రూపిజమే బలమైంది. గ్రూపుల్లో సబ్ గ్రూప్‌లు, సబ్ గ్రూపుల్లో సబ్‌సబ్ గ్రూపులుంటాయి. వెళ్లి ఎక్కడో ఒక గ్రూపులో చేరు’’. ‘‘కానీ వాళ్ళెక్కడుంటారు?’’ ‘‘ఏదో ఒక అడవిలోకి వెళ్లు. విప్లవం తుపాకీ గుండులోంచి వస్తుందా తూటాలోంచి వస్తుందా అని ఎక్కడయితే సైద్ధాంతిక చర్చ జరుగుతూ వుంటుందో అక్కడ ఆగు. అదే నీకు కావాల్సిన గ్రూప్.’’ ‘‘అయినా తూటాలోంచి పొగ కదా వస్తుంది, విప్లవం కూడా వస్తుందా?’’ ‘‘అది నీకు తెలుసు, కానీ వాళ్ళకు తెలియదు’’. శీను అడవిలో వెళుతూ వుంటే మొక్కలు పెంచేవాళ్లు కనిపించారు. గ్రూపుల గురించి వాళ్లని అడిగాడు. ‘‘ఇంకొంచెం దూరమెళ్ళండి. పాటలు పాడుకుంటూ ఎవరైతే అన్నం వండుకుంటూ వుంటారో వాళ్లే మీక్కావలసినవాళ్ళు’’ అని చెప్పారు. ‘‘అంటే రహస్య జీవనం ఉండదా?’’ అని అడిగాడు శీను. ‘‘ఇప్పుడు ప్రతివాడి జీవితం రహస్యమే. ప్రత్యేకంగా రహస్య జీవనం అక్కరలేదు’’. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి శీనుకు పెద్దపెద్ద వాదనలు వినిపించాయి. వేలు గొప్పదా? ట్రిగ్గర్ గొప్పదా అని తీవ్రవాద పదజాల భావప్రకంపనల యుద్ధం నడుస్తోంది. వాదం సంవాదమై రెండు పక్షాలుగా చీలి కాల్చుకోవడం మొదలెట్టారు. ఈ క్రాస్ ఫైరింగ్‌కి దొరక్కుండా శీను తప్పించుకుని ఒక వర్గం వద్దకు చేరి ‘‘తుపాకీ గుండుకి, బోడిగుండుకి తేడా తెలియదు మీకు’’ అని మందలించాడు. ‘‘నువ్వెవరు?’’ అనుమానంగా అడిగాడో గడ్డపాయన. ‘‘నేను మీలో చేరుదామనుకుంటున్నా’’ ‘‘కోవర్టువా!?’’ ‘‘కాదు ఇంట్రావర్ట్‌ని’’ ‘‘అయితే చేరిపో’’. శీను నాలుగు రోజులపాటు అడవిలో తిరిగాడు. ఐదోరోజు మనసులో మాట బయటపెట్టాడు. ‘‘యాక్చువల్‌గా నేను డాన్ కావాలనుకుని మీలో చేరాను’’ అని చెప్పాడు. ‘‘నువ్వు కరెక్ట్ అడ్రస్‌కే వచ్చావు. కానీ మేం ఓనమాలు మాత్రమే నేర్పుతాం. మిగిలిన వాక్య నిర్మాణాన్ని పోలీసులు చూసుకుంటారు.’’ ‘‘కవితాత్మకంగా చెబితే నాకర్థం కాదు.’’ ‘‘తుపాకీని పట్టుకోవడమే మేం నేర్పిస్తాం. దాన్ని ఎలా వాడాలో పోలీసులు నేర్పిస్తారు.’’ శీను నేరుగా పోలీసుల దగ్గరికెళ్ళి విషయం చెప్పాడు. ‘‘నువ్వు ఏదో ప్లేస్‌లో వుండి, తుపాకీని అటు ఇటు తిప్పుతూ కూచో. మిగతా విషయాలు మేమే చూసుకుంటాం’’ అని చెప్పాడో అధికారి. డాక్టర్ల దగ్గరికి పేషంట్లు, లాయర్ల దగ్గరికి క్లయింట్లను పంపడానికి మిడిల్మెన్ వున్నట్టు, డాన్ దగ్గరికి బాధితుల్ని పంపే బాధ్యతని ఆ అధికారి తీసుకున్నాడు. శీను గన్ని అటు ఇటూ తిప్పుతూ వుంటే డబ్బులొచ్చేవి. దాంతో తానే ఒక సూర్యుడని నమ్మకం కలిగింది శీనుకి. సూర్యుడికి మిణుగురులు అవసరమా అని ఆలోచించి సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ‘‘చూడు బాబూ, డాన్లకి పోలీసులు తెలిసినా, తెలియకపోయినా పోలీసులకి తెలియని డాన్లు వుండరు. నువ్వు సీసాలో భూతం లాంటివాడివి. నిన్ను బయటికి ఎప్పుడు తీయాలో, ఎప్పుడు తోక కోసి లోపలికి పంపాలో మాకు బాగా తెలుసు’’ అని చెప్పి చేయాల్సింది చేశారు. డాన్ శీను గురించి నాలుగు రోజులు మీడియాలో కథలు వచ్చాయి. తరువాత అందరూ పుష్కరాలపై పడ్డారు. కొత్త భూతం ఎక్కడో ఒకచోట ప్రాణం పోసుకుంటూ వుంటుంది. చిరాకు పుట్టినపుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. - జి.ఆర్.మహర్షి