'గోమాతా కీ జై’ అంటే డబ్బులే డబ్బులు
చండీగఢ్: ‘గో రక్షితే రక్షితహ:’ నినాదం కాస్త హర్యానాలో ‘గో దక్షితే భక్షితహ:’గా మారిపోయింది. హర్యానాలో భారతీయ జనతా పార్టీ పాలకపక్షం తీసుకొచ్చిన గోవధ నిషేధ చట్టం ఆ పార్టీ గూండాలకు కల్పతరువుగా మారింది. రాష్ట్రంలోని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రోడ్డు పక్కల డాబాలలో, దుకాణాల్లో ‘గో రక్షణ నిధి’ పేరిట వేలాది విరాళాల డబ్బాలు పుట్టుకొచ్చాయి.
ఒక్కొక్క డాబాలలో ఆరేడు డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి. వీటిల్లో దాతలు వేసిన విరాళాలు నెలకు లక్షల్లోని ఉంటున్నాయని డాబాల యజమానులు తెలియజేస్తున్నారు. ఈ విరాళాల సొమ్ములో నయాపైసా కూడా గో సంరక్షణ శాలలకు వెళ్లడం లేదని, గో సంరక్షణ శాలల నిర్వాహకులే తెలియజేస్తున్నారు. అధికార పార్టీ పేరు చెప్పి కొంత మంది గూండాలు ఇలాంటి దందాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఆరు నెలల క్రితం రాష్ట్రంలోని బేజీపీ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి బడుగు రైతుల బక్కచిక్కిన ఆవులు అమ్ముడు పోవడం లేదు. నేటి కరువు పరిస్థితుల్లో వాటిని పోషించలేక గో సంరక్షణ శాలలకు వాటిని తరలిస్తున్నారు. అక్కడి నిర్వాహకులకు కూడా గోవుల సంరక్షణ భారం కావడంతో రైతుల ఆవులు స్వీకరించేందుకు వారూ నిరాకరిస్తున్నారు. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి గో సంరక్షణ శాలలను నిర్వహించడం తమకు తలకుమించిన భారం అవుతోందని మహేంద్ర గఢ్ జిల్లా, కనీనాలోని శ్రీకష్ణ గోశాల మేనేజర్ యద్విందర్ సింగ్ మీడియాకు తెలిపారు. గూండాలు, దందాకోరుల పోటీ వల్ల తమకు విరాళాలు కూడా బాగా తగ్గిపోయాయని ఆయన చెప్పారు.
మొదట్లో బస్టాండ్లలో, దాబాలలో ఒక్కొక్క విరాళాల డబ్బాలనే ఏర్పాటు చేశామని, ఇప్పుడు తమకు పోటీగా అనేక డబ్బాలు పుట్టుకొచ్చాయని ఆయన తెలిపారు. తమ విరాళాల డబ్బాలను మాత్రం మేనేజింగ్ కమిటీకి చెందిన కనీసం ముగ్గురు సభ్యుల ముందు తెరచి సొమ్మును లెక్కిస్తామని, తాము ఖర్చుపెట్టే ప్రతిపైసాకు లెక్క ఉంటుందని సింగ్ చెప్పారు. గోవధ నిషేధ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వద్దన్నా వినకుండా రైతులు బలవంతంగా తమ ఆవులను తీసుకొచ్చి వదిలేసి పోతున్నారని, తమపై భారం బాగా పెరిగిందని ఆయన అన్నారు. రోడ్డు పక్క డాబాలలో తాము ఏర్పాటు చేసిన విరాళాల డబ్బాలను కూడా కొంత మంది గో సంరక్షణ శాల సభ్యులమంటూ ఎత్తుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులు, ఎక్కువగా అధికార బీజేపీకి చెందిన వారే వచ్చి తన డాబాలో విరాళాల డబ్బాలు పెట్టి పోతున్నారని, ఇన్ని డబ్బాలు ఎందుకంటే బెదిరిస్తారని ఢిల్లీ–చండీగఢ్ జాతీయ రహదారిలో ఉన్న ‘రాయల్ ముర్తాల్ దాబా’ యజమాని నరేంద్ర భరద్వాజ్ తెలిపారు. ఆయన కౌంటర్ మీద మూడు విరాళాల డబ్బాలు ఉన్నాయి. గతంలో ఏడు డబ్బాలు ఉండేవని, ఆ డబ్బాల విషయంలో వారి మధ్య గొడవలు కూడా జరిగేవని, భౌతికంగా కొట్టుకునేవారని ఆయన చెప్పారు. చివరకు వారే ఒక ఒప్పందానికి వచ్చి నాలుగు డబ్బాలు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. పైగా డబ్బాలు ఖాళీ చేసేటప్పుడు కౌంటర్ నుంచి కొంత విరాళం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తారని, యాభై రూపాయలు ఇస్తే వంద ఇమ్మని, ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇమ్మని దబాయించి తీసుకెళతారని ఆయన ఆరోపించారు.
గతంలో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామంటూ బలవంతంగా చందాలు వసూలు చేసిన వారే ఇప్పుడు గో సంరక్షణ పేరుతో వసూళ్లకు దిగారని జాజ్జర్ జిల్లా ఢిగాల్ గ్రామం మాజీ సర్పంచ్ భాగ్వీర్ అహ్లావత్ తెలిపారు. తలకు కాషాయ రిబ్బన్లు కట్టుకొని వచ్చి దబాయించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పలు పట్టణాల్లో ఇప్పుడు ఇలాంటి సిండికేట్లు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొంత మంది ఇంటింటికి వచ్చి కూడా గో సంరక్షణ పేరతో చందాలిమ్మని బెదిరిస్తున్నారని స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు.