doners
-
ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అంతులేని కష్టాలు
అమ్మ అనురాగం, నాన్న మమకారం దూరమయ్యాయి. జీవనాధారం లేదు.. జీవితాలకు వెలుగూ లేదు. నా అన్న వాళ్లు లేరు. కష్టమొచ్చినా కన్నీరు రాల్చడం తప్ప..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బతుకు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నారు. దయనీయ జీవితాలకు దర్పణంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు. గుమ్మఘట్ట (అనంతపురము): మండలంలోని గొల్లపల్లి ఎస్సీ కాలనీలో పీజీ హంపన్న, సాకమ్మ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి శశికళ, తిప్పక్క, రాధ, లక్ష్మి, శైలజ సంతానం. పెద్దమ్మాయి శశికళకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లి సాకమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. పెద్దమ్మాయి సాయంతో మిగిలిన నలుగురు ఆడపిల్లల ఆలనాపాలనను తండ్రి చూసుకుంటూ వచ్చాడు. కూతుళ్లు మంచి ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించాడు. పెద్దమ్మాయి (ఐదో తరగతి) మినహా మిగిలిన నలుగురూ చదువులో ముందుకెళ్లారు. రెండో అమ్మాయి తిప్పక్క బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేసింది. మూడో అమ్మాయి రాధ డిప్లొమా కోర్సులో చేరి డ్రాపౌట్ అయ్యింది. నాల్గో అమ్మాయి లక్ష్మి ఇంటర్ పూర్తి చేసింది. ఐదో అమ్మాయి శైలజ డిగ్రీ ఫస్టియర్ చదివి ఆపేసింది. కాగా వీరి జీవితంలో మరొకసారి కుదుపు వచ్చింది. తండ్రి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక్కరైనా బాగా చదవాలని... తండ్రి అనారోగ్యం నేపథ్యంలో నలుగురు అక్కాచెల్లెళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. తిప్పక్క బీటెక్ కోర్సు పూర్తి చేసేలా, అందుకు అవసరమైన ఖర్చుల కోసం కూలి బాట పట్టారు. ఇంతలోనే ఈ ఏడాది మే నెలలో తండ్రికి తీవ్ర జ్వరం, జలుబు, చలి లాంటి లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఇన్నాళ్లూ అండగా నిలిచిన తండ్రి కూడా దూరం కావడంతో అమ్మాయిలకు కష్టాలు రెట్టింపయ్యాయి. చౌకదుకాణం ద్వారా వచ్చే రేషన్ సరుకులతో పాటు కూలి పనుల ద్వారా వచ్చే సంపాదనతో బతుకు నెట్టుకొస్తున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునే వారు.. పేరు : పి.జి.జి.తిప్పక్క అకౌంట్ నంబర్ : 520101212861618 యూనియన్ బ్యాంకు, రాయదుర్గం బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0900362 ఉద్యోగం ఇప్పించండి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి ఇంటికే పరిమితమయ్యాను. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారు. అమ్మానాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మా యోగక్షేమాలు చూసుకునేవారు ఎవరూ లేరు. ఏ కష్టం వచ్చినా మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ బతుకుతున్నాం. దయార్ద్ర హృదయులు స్పందిస్తే మా బతుకులు బాగుపడతాయి. - తిప్పక్క విధిలేక కూలి పనులకు.. బ్రహ్మసముద్రం గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశా. అనంతపురంలో డిప్లొమా కోర్సులో చేరా. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశా. సర్టిఫికెట్లు ఇవ్వమంటే డబ్బు చెల్లించలేదని కళాశాల వారు నిరాకరించారు. వాటిని అక్కడే వదిలేసి విధిలేక కూలి పనులకు వెళ్తున్నా. - రాధ, డిప్లొమా విద్యార్థిని -
World Blood Donor Day: కరోనాలోనూ బాధితులకు ఊపిరిపోస్తున్న దాతలు
సాక్షి, వేములవాడ(కరీంనగర్): కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రక్తదాతలు తమ కర్తవ్యాన్ని విస్మరించట్లేదు. ప్రాణాపాయస్థితిలో రక్తం కోసం కొట్టుమిట్టాడుతున్న వారికి ‘మేమున్నాం’ అంటూ రక్తదానం చేసి ఆపద్భాంధవులుగా నిలుస్తున్నారు. రక్తం పంచి ఆయుష్షు పెంచుతున్నారు. రక్తదాతలు తమ దయాగుణంతో ప్రతీ రోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ చిరంజీవులుగా ఉండేలా సహాయపడుతున్నారు. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. జూన్ 14న.. ‘రక్తదానం చేయండి.. ప్రపంచంలోని అందరి గుండెలు ఆగకుండా పరిగెత్తేలా చేయండి’ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినో త్సవం నిర్వహిస్తున్నారు. అయితే 2005 మే లోనే అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ర క్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగెటివ్ గ్రూపుల ను కార్ల్ లాండ్ స్టీవర్ గుర్తించారు. ఆ యన జన్మదినం జూన్ 14న ఉండడంతో అదే రోజున ప్రపంచ రక్తదాతల దినో త్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 1,200 మందితో.. రక్తం లేక ఎవరూ తనువు చాలించకూడదనే సేవాభావంతో రామగుండం యువ మిత్ర సేవా సమితి సంస్థ ఏర్పాటు చేశా. యువతకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, శిబిరాలు నిర్వహిస్తున్న. 1200 మందితో రక్తదానం చేయించా. నేను కూడా 18 సార్లు చేశా. ఐదు రోజుల క్రితం రక్తదానం చేసిన తర్వాత కోవిడ్ టీకా తీసుకున్నా. జీవితంలో రక్తదానం చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకున్నా. – ఈదునూరి శంకర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత, గోదావరిఖని 12 సార్లు శిబిరాలు .. స్వగ్రామం అల్గునూర్. అల్లుఅర్జున్ అభిమాన సంఘం జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్న. అత్యవసర సమయంలో రక్తదానం చేసి అనారోగ్యానికి గురైన వ్యక్తి ప్రాణాలు నిలబెడితే అతడి బంధువుల కళ్లలో కనిపించే కృతజ్ఞత భావం మరోసారి దానం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. ఇప్పటికీ 22 సార్లు రక్తదానం చేసిన. అల్లు అర్జున్ అభిమానులసాయంతో 12 సార్లు శిబిరాలు నిర్వహించి 600 యూనిట్ల రక్తాన్ని వివిధ కేంద్రాలకు అందజేశా. – తమ్మనవేని అంజియాదవ్, అల్గునూర్, కరీంనగర్ అపోహలు వీడండి రక్తదానం చేయడంలో అపోహలు వీడాలి. ప్రతీ వ్యక్తిలో కనీసం ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసిన తర్వాత రెండు రోజుల్లో ఆ వ్యక్తికి తిరిగి రక్తం సమకూరుతుంది. కరోనా నెగిటివ్ వచ్చిన వారు నాలుగు వారాల తర్వాత రక్తదానం చెయవచ్చు. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న కూడా నాలుగు వారాల వరకు రక్తదానం చేయకూడదు. అందుకే రక్తదానం చేసిన తర్వాతే కోవిడ్ టీకా తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, గోదావరిఖని 30 ఏళ్లు.. 56 సార్లు.. మాది వేములవాడ మండలం నూకలమర్రి. బీ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. 1990 నుంచి ఇప్పటి వరకు 56 సార్లు రక్తం ఇచ్చినా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా స్వయంగా వెళ్లి రక్తదానం చేస్తా. అత్యవసర సమయంలో బాధితులకు రక్తదానం చేయడం ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. – సోమినేని బాలు, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల ఇప్పటి వరకు 48 సార్లు.. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉంటా. అభిమాన నటుడు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. రక్తం అవసరమనే సమాచారం ఎవరిచ్చినా వెంటనే స్పందిస్తా. 1996 నుంచి ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశా. రక్తదానం చేసేందుకు పలువురిని ప్రోత్సహిస్తున్నా. – మిడిదొడ్డి నవీన్‌కుమార్, జ్యోతినగర్, కరీంనగర్ 2013 నుంచి.. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు బూర్గుపల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆపదలో ఉన్నవారికి బ్లడ్ డొనేట్ చేయాలని 2013లో నిర్ణయానికి వచ్చారు. బోయినపల్లికి చెందిన మొగులోజి శ్రీకాంత్, యాద ఆదిత్య, దుబ్బాక మహేశ్, బోయిని రవి, సంబ కిశోర్ చౌదరి శ్రీధర్, బూర్గుపల్లికి చెందిన పెరుక మహేశ్, శ్రీపతి సాగర్, రామంచ అశోక్, పెంచాల మహేశ్, రాజేంద్రప్రసాద్, తడగొండకు చెందిన ఎర్ర గిరిధర్ తదితరులు పలుసార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా> నిలుస్తున్నారు. ఇందులో పెరుక మహేశ్ 22సార్లు రక్తదానం చేశాడు. చదవండి: తల్లులకు టీకా.. చకచకా -
మేమున్నామని.. మీకేం కాదని..!
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. పేదలు, అనాథలు, యాచకులు, అభాగ్యులు, రోగులు ఆకలితో అలమటిస్తున్న వేళ.. మేమున్నామంటూ.. మీకేం కాదంటూ వారికి భరోసానిస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, వివిధ అసోసియేషన్లు, చారిటబుల్ ట్రస్టులు కూడా ముందుకొస్తున్నాయి. తమకు చేతనైనంత సహాయం చేస్తూ కష్టకాలంలో తమ పెద్ద మనసును చాటుకుంటున్నాయి. కొంతమంది ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని సరఫరా చేస్తుండగా, మరికొందరు ఇంటింటికీ తిరుగుతూ బియ్యం, కూరగాయలు, ఉల్లిపాయలు, వంట నూనె, తదితర నిత్యావసరాలను అందిçస్తూ కష్టకాలంలో తోటివారికి అండగా నిలుస్తున్నారు. – సాక్షి, నెట్వర్క్ చిన్న వయసు.. పెద్ద మనసు విజయనగరంలో అభ్యాగుల కడుపునింపుతోంది.. సిరి సహస్ర. వయసులో చిన్నదైనా పెద్ద మనసుతో రోజూ దాదాపు 300కుపైగా ఆహార ప్యాకెట్లను, శానిటైజర్లను, మాస్కులను అందిస్తోంది. కోవిడ్–19కు భయపడి బయటకు రావడానికే అందరూ భయపడుతుంటే సిరి సహస్ర మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి దగ్గరకు కూడా వెళ్లి ఆహారం అందజేస్తూ ప్రశంసలు పొందుతోంది. 800 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చెందిన అర్జున్‌బాబు శుక్రవారం 800 కుటుంబాలకు రూ.200 విలువ చేసే నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. తన తండ్రి పేరుతో ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున బియ్యం, వంట నూనె, గోధుమ పిండి, అర కిలో పంచదార, డెటాల్ సబ్బు, రెండు మాస్క్‌లను ఇంటింటికీ వెళ్లి అందించారు. ఇందుకోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. బాలయ్యా.. బతికిస్తున్నావయ్యా..! చిత్తూరు నగరం తూర్పు (తాలూకా) సీఐగా పనిచేస్తున్న బాలయ్య తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూ పోలీసు శాఖకు మంచిపేరు తీసుకొస్తున్నారు. అభాగ్యులు, అనాథలకు గత వారం రోజులుగా అన్నదానం చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం దాదాపు వెయ్యి మందికి సరిపడే భోజనాన్ని తన సొంత ఖర్చులతో తయారుచేయిస్తున్నారు. ఓ వాహనంలో భోజనాలు ఉంచుకుని నగరమంతా తిరుగుతూ ఆకలి తీరుస్తున్నారు. ధాన్యం విరాళమిచ్చిన రైతులు లాక్‌డౌన్‌తో ఉపాధి, కూలీ పనులు పొగొట్టుకున్న పేదలు, బడుగు వర్గాలను ఆదుకునేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల రైతులు ముందుకు వచ్చారు. 150 పుట్ల వరి ధాన్యాన్ని సేకరించి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి విరాళంగా అందజేశారు. వరి ధాన్యం, నగదు విరాళాల విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఆకలి తీరుస్తున్న ‘అమ్మ’ ట్రస్ట్ గుంటూరు నగరంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న కూలీలు, యాచకులకు, నగరపాలక సంస్థ నైట్ షెల్టర్స్‌లో ఉండే వారికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిత్యం రెండు పూటలా భోజనం అందిస్తోంది. అలాగే జలగం రామారావు ఉన్నత పాఠశాలలో ఉన్న 320 మంది నిరాశ్రయులకు శుక్రవారం మూడు పూటలా భోజనం అందజేశారు. అన్నార్తులకు అండగా.. కర్నూలు జిల్లా నంద్యాలలో కారు రవికుమార్, ఆరెల్ ఆంథోని, కుమార్, సర్వ్‌నీడీ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ జాన్, తదితరులు నిరాశ్రయులకు, అన్నార్తులకు అన్నదానం చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ పరీక్షల కోచింగ్ కోసం నంద్యాల వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన 400 మంది విద్యార్థులకు అల్పాహారంతోపాటు రెండుపూటలా అన్నదానం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. -
దాతల సహకారం అభినందనీయం
తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయమని తుంగతుర్తి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోగునూరి సుందర్ రావు అన్నారు. శుక్రవారం ఆ పాఠశాలలలో కళావేదిక నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ బీరపూల నారాయణ తన తండ్రి బీరపూల వెంకటేశం జ్ఞాపకార్థం కళావేదిక నిర్మించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయంమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ అమనగంటి నగేష్, వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సురేందర్ రావు, రవీందర్, సుచిత, బాలయ్య, జోసెఫ్, వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
దాతల సహకారం అభినందనీయం
నూతనకల్: ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తండు వెంకటనారాయణగౌడ్ అన్నారు. మంగళవారం తాళ్లసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అమెరికాకు చెందిన ప్రతినిధులు రూ.30వేల విలువైన ఫర్నీచర్, ఇంగ్లిష్ డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యాభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పాఠశాలకు సహకారం అందించి దాత్రుత్వాన్ని చాటుకున్న సంస్థ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యారంగంలో రాణించాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐ ప్రతినిధులు నాలుగు టేబుల్స్, 17బేంచీలు, ఇంగ్లిష్ డిక్షనరీలు, చెస్‌బోర్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్‌రెడ్డి, సిద్ధిఖ్పాష, వర్థెల్లి కృష్ణ, సంధ్యారాణి, మధుకర్, వెంకన్న, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణకు దాతలు చేయూతనందించాలి
హుజూర్నగర్ : హరితహారంలో భాగంగా నాటిన మెుక్కల సంరక్షణకై ట్రీగార్డుల ఏర్పాటుకు దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన హరితహారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అదే విధంగా పట్టణంలోని 19, 20 వార్డుల్లో నిర్వహించిన హరితహారంలో నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌లు, స్థానిక కౌన్సిలర్ బెల్లంకొండ లలిత, నందిగామ అనితలతో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి అబ్దుల్ అలీం, సిబ్బంది మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు తేజావత్ రవినాయక్, కంకణాల పుల్లయ్య, యల్లావుల సీత, రిటైర్డ్ హెచ్ఎం ఎంఎస్ఎన్.రాజు నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నందిగామ శంభయ్య, సైదులునాయక్, వసంతకుమార్, యోహాన్, శోభన్ బాబు, చంటి, గురునాథం, వైద్యసిబ్బంది జాన్‌బాషా, రాజేంద్రప్రసాద్, పార్వతి, రామకృష్ణ, ఉపేందర్, జ్యోతి, నర్సింహారావు, సంతోషి, సలోమి, లక్ష్మమ్మ, శ్రీను పాల్గొన్నారు.