ఆత్మహత్యలపై ఆత్మకథ
* కరెంటు కోత నుంచి గుండె కోత దాకా...
* హృదయాలను కదిలించే కథలు
* రైతు వ్యథలపై డాక్టర్ లచ్చయ్య కలంపోరు
కామారెడ్డి: ఆయన కలం.. సామాజిక సమస్యలపై అక్షర సమరం చేస్తోంది. సమాజ శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరు సల్పుతోంది. ప్రజల ఆవేదనలు, ఆందోళనలు, ఆక్రందనలు.. రచనలుగా, విమర్శలుగా, కాలమ్స్ రూపంలో పోరాడుతోంది.
ఆయన మనసు ఆ కలానికి తెలుసు. అందుకే ఆయన రాసిన కథనాలు, కథలు హృదయాలను కదిలించేవిగా.. ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఏళ్ల తరబడి గాండ్ల లచ్చయ్య ఎన్నో కథనాలను రాశారు. సరిగ్గా ముప్పై ఎనిమిదేళ్ల నాడు బెల్లం వండుతున్న రైతులు ఎదుర్కొన్న కరెంటు కష్టాలపై ‘కోత’ కథ రాశారు. ఆ కథ అప్పట్లోనే పత్రికల్లో అచ్చయ్యింది. ఆ కథ ఆధారంగా తమిళంలో ఓ సినిమా కూడా వచ్చింది.
ఇప్పుడు కూడా అప్పటి పరిస్థితిలకు భిన్నంగా లేవని అందుకు ఓ రైతు ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ‘ఓ ఆత్మహత్య ఆత్మకథ’ రాశారు. ఈ రెండు కథలను ‘కరెంటు కోత నుంచి..రైతు గుండె కోత దాకా...’ అన్న పేరుతో బుక్లెట్ రూపొందించారు. ఇటీవలే ఈ కథనాల సంపుటిని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
కథగా రైతన్న గుండె‘కోత’
కామారెడ్డికి చెందిన డైట్ రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ లచ్చయ్య 1976లో రాసిన ‘కోత’ కథలో చలి విసురుతున్నా రాత్రిళ్లో సైతం చెరుకు గానుగాడించి పాలను తీసి రాత్రంతా పాలను ఉడికించి బెల్లం తయారు చేసే రైతు కుటుంబం వ్యథలను కళ్లకు కట్టారు. వరుసగా మూడురోజుల పాటు కరెంటు కోతలతో క్రషింగు కోసం నరికిన చెరుకు ఎండిపోతుందని ఆందోళన చెందుతున్న గంగన్న అనే రైతు వ్యథకు అక్షరరూపం ఇచ్చారు.
మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు అనే రైతు ఈ మధ్యనే తన పంట చేనులోనే ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నర్సింహులు ఆత్మహత్యపై పత్రికల్లో వచ్చిన వార్తలను చదివిన డాక్టర్ లచ్చయ్య చలించిపోయారు. నర్సింహులు ఆత్మహత్యకు కారణాలేమిటన్నదానిపై లోతుగా ఆలోచించారు. బలవన్మరణానికి పాల్పడిన నర్సింహులు కుటుంబాన్ని, గ్రామస్తులను కలిసి వివరాలు తెలుసుకుని, నర్సింహులు చావుపై ‘బలంత లేదు..బతుకు లేదు..ఉరితాడే నేస్తమాయే’ అంటూ ఆత్మహత్యపై ఆత్మకథ రాశారు.
బతుకులెట్ల మారినయో..
నర్సింహులు ఆత్మఘోషకు అక్షరరూపం ఇవ్వడమే కాదు.. ప్రపంచీకరణ ప్రభావం ప్రజల బతుకులను ఎట్లా దెబ్బతీసిందో తన కథనంలో లచ్చ య్య వివరించారు. కులవృత్తి చేసుకుని బతికిన రోజుల్లో ఆ రైతు కుటుం బం ఏ కష్టం లేకుండా బతికేది. అటు కుల వృత్తి, ఇటు వ్యవసాయం ద్వారా అందరూ పని చేసుకుంటూ హాయిగా బతికేవారు. శేనుకాడ బోరు తవ్వించే ప్రయత్నంలో చేసిన అప్పు వడ్డీలు పెరిగిపోయి నర్సింహులు కుటుంబం అప్పులపాలై, ఆ తరువాత గల్ఫ్ వలస, అక్కడా మోసం ఇంటికాడ ఏ ఆధారం లేదు.
అయినా ఏదో ఆశ చావని నర్సింహులు మరో బోరు తవ్వించి అందులో వచ్చిన కొద్దిపాటి నీళ్లతోని ఎవుసం మొదలుపెట్టిండు. ఓ దినం పాము కరిసి దవఖానపాలైన నర్సింహులుకు ఆస్పత్రి ఖర్చు తడిసిమోపెడై. భూమి మీద దీస్కున్న బాకీ మాఫీ అయితదని తెలిసి జెరంత భారం తగ్గుతదని ఆశతోని బ్యాంకుకు బోయిన నర్సింహులు తన పేరు లేదని తెలిసి పుట్టెడు దు:ఖంతోని శేనుకాడికి బోయి ఉరిబోసుకుని సచ్చిన వైనంపై ఆత్మహత్య ఆత్మకథగా రాశారు.
రైతు కుటుంబానికి ఆసరాగా..
తాను రాసిన కథలను ‘కరెంటు కోత నుంచి..రైతు గుండె కోత దాకా..’ అన్న శీర్షికన బుక్లెట్ వేశారు లచ్చయ్య. దాని ఖరీదు ఐదు రూపాయలుగా నిర్ణయించారు. వాటిని అమ్మగా వచ్చే డబ్బును రైతు కుటుంబానికి ఆసరాగా అందించాలనుకుంటున్నారు. ఇలా రైతన్నల గోసను అక్షరీకరించడమే కాకుండా.. తనవంతుగా రైతుకుటుంబానికి ఆసరా కావాలనుకుంటున్న డాక్టర్ జి.లచ్చయ్యను అభినందిద్దాం.