కొల్లూరులో సమైక్య శంఖారావం
కొల్లూరు, న్యూస్‌లైన్: తమ అధినేత రాష్ట్ర విభజనకు అనుకూలమా లేక వ్యతిరేకమా స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబునాయుడిపై ఎందుకు వత్తిడి తీసుకురావడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజాగర్జన పేరుతో చంద్రబాబు యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని, ప్రజలు గర్జిస్తే ఆయన దిక్కులేకుండా పోతారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యక్షతన ఆదివారం రాత్రి మండలం కేంద్రం కొల్లూరులోని బస్టాండ్ సెంటరులో నిర్వహించిన సమైక్యశంఖారావం బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
సమైక్యం అనే మాట చంద్రబాబు నోట ఎందుకు రాదన్న విషయాన్ని సీమాంధ్ర ప్రాంత టీడీపీ నాయకులే ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీ నాయకులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.
నిధులెక్కడి నుంచి వస్తాయి..
పార్టీ విజయవాడ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు నిధులు లేవని చెబుతున్న అధికార పక్ష నాయకులు, రాష్ట్రం విడిపోతే వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జనంతో మమేకం అవగల నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అని, దీన్ని ఓర్చుకోలేకే చంద్రబాబు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా అని చెప్పుకొంటున్న చంద్రబాబు దీక్షల పేరిట ఎవరి కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు.
జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రధానమనే ఆలోచనతో జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని చెప్పారు. తెలంగాణలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తున్నారని, మరోవైపు టీడీపీ అధ్యక్షుడు మాత్రం తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేయిస్తున్నారని విమర్శించారు. సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుటుంబాలు ఉమ్మడిగా ఉండాలనేది తెలుగువారి సంస్కృతి అన్నారు. అలాంటిది రాష్ట్ర విభనకు ఇతర పార్టీలు ఎలా సహకారం అందిస్తున్నాయని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ఒప్పుకోకపోయినా, ఆమె కోడలు సోనియా అందుకు పూనుకోవడం దారుణమన్నారు.
తరలివచ్చిన నాయకులు
సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, వాణిజ్య విభాగం రాష్ర్ట కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్టీయూసీ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జానీభాషా, బీసీసెల్ కన్వీనర్ దేవళ్ళ రేవతి, జిల్లా మహిళ కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బండారు సాయిబాబు, హనుమంత్‌నాయక్, మైనారిటీ కన్వీనర్ మహబూబ్, తాడికొండ నియోజకవర్గ కన్వీనర్ కె.సురేష్‌కుమార్, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ గుదిబండి చినవెంకటరెడ్డి, కృష్ణా జిల్లా నాయకుడు సింహాద్రి రమేష్ ప్రసంగించారు.
చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల కన్వీనర్లు ఉయ్యూరు అప్పిరెడ్డి, చందోలు డేవిడ్ విజయ్‌కుమార్, రాపర్ల నరేంద్ర, తూము నాగేశ్వరరావు, పడమట వెంకటేశ్వరరావు, కొల్లూరు గ్రామ కన్వీనర్ బిట్రగుంట సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ సభ్యులు అంగిరేకుల ఆదిశేషు, పిడపర్తి క్రిష్ట్రోఫర్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ చిలకా ప్రకాష్, యువజన విభాగ కన్వీనర్ కూచిపూడి మోషే, సీనియర్ నాయకులు నర్రా అప్పారావు, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.