నాకు దారిచూపింది అంబేద్కరే..
కల్హేర్: నిరుపేద కుటుంబంలో జన్మించిన తనకు ఐపీఏస్ అధికారిగా పని చేయడానికి అంబేద్కర్ చూపిన బాటే కారణమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు పోవడంతో ఐపీఏస్ ఉద్యోగం చేస్తూ... రూ.1.50 లక్షల వేతనం పొందుతున్నట్టు తెలిపారు. శుక్రవారం ఆయన కల్హేర్ మండలం బీబీపేట, పోచాపూర్‌లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. బీబీపేటలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ కుల, మతాలకతీతంగా అంబేద్కర్ చూపిన బాటలో నడిస్తే అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చన్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజన్న, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, మనూర్ ఎంఈఓ నాగరం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, సర్పంచ్‌లు రాములు, సంతోషమ్మ, ఎంపీటీసీ కిష్టాగౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు గైని బాలయ్య, స్వేరోస్ ప్రతినిధి గుండు మోహన్, రాజు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
నల్లవాగు గురుకులం తనిఖీ..
మండలంలోని నల్లవాగు గురుకుల పాఠశాలను రాష్ర్ట కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో బోధనతీరు, భోజన వసతి, ఇతర అంశాలను ప్రిన్సిపాల్ మెవాబాయిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మిస్తోన్న భవనాల పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇంజినీరింగ్ విభాగం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.