Drama Sector
-
ఆల్–వుమెన్ ప్లే:జీవన నాటకం
జీవితమే ఒక నాటకరంగం... తాత్విక మాట. నాటకంలోకి జీవితాన్ని తీసుకురావడం... సృజనబాట. ఈ బాటలోనే తన నాటకాన్ని నడిపిస్తూ దేశ, విదేశ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది రమణ్‌జిత్ కౌర్.... చండీగఢ్‌లో పుట్టి పెరిగిన రమణ్జిత్కౌర్ పెళ్లి తరువాత కోల్‌కతాలో స్థిరపడింది. అక్కడి నాటకరంగంపై తనదైన ముద్ర వేసింది. జాతీయత, ప్రాంతీయత, కులం, వర్గం, జెండర్ అంశాల ఆధారంగా ఆమె రూపొందించిన ‘బియాండ్ బార్డర్స్’ నాటకం దేశవిదేశాల్లో ప్రదర్శితమై ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ నాటకంలో 29 మంది మహిళలు నటించడం ఒక విశేషం అయితే, ఇంగ్లీష్, హిందీతో పాటు పంజాబీ, బెంగాలి, మరాఠీ, గడ్వలి... భాషలను ఉపయోగించడం మరో విశేషం. సమకాలీన సమస్యలను నాటకానికి వస్తువుగా ఎంచుకోవడం ఒక ఎత్తయితే... వీడియో ఆర్ట్, ఇన్స్టాలేషన్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, సౌండ్ డిజైన్‌లాంటి సాంకేతిక అంశాలను కూడా సృజనాత్మకంగా ఉపయోగించడం మరో ఎత్తు. నాటకం నాడి తెలిసిన కౌర్‌కు సినిమాలపై కూడా మంచి అవగాహన ఉంది. దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన ఫైర్, హెవెన్ ఆన్ ఎర్త్ చిత్రాలలో నటించింది. ‘మ్యాంగో షేక్’లాంటి షార్ట్‌ఫిల్మ్స్ కూడా రూపొందించింది. ‘నాటకరంగం, సినిమా రంగానికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇలా జవాబు ఇస్తుంది... ‘పెద్ద తేడా ఏమీలేదు. భావవ్యక్తీకరణకు రెండూ ఒకేరకంగా ఉపయోగడపడతాయి. అయితే నాటకం ద్వారా తక్షణ స్పందన తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవైపు నటిస్తూనే మరోవైపు ప్రేక్షకుల కళ్లను చూస్తు కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు’ ‘థియేటర్ గేమ్స్’ రచయిత క్లైవ్ బర్కర్లాంటి దిగ్గజాల దగ్గర శిక్షణ తీసుకున్న కౌర్ తొలిసారిగా డూన్ స్కూల్ స్పెషల్ చిల్డ్రన్స్ కోసం వర్క్‌షాప్‌ని నిర్వహించింది. నాటకరంగంలో పిల్లలు చురుకైన పాత్ర నిర్వహించాలనేది తన కల. ‘ది క్రియేటివ్ ఆర్ట్’తో తన కలను నెరవేర్చుకుంది కౌర్. ఈ సంస్థ ద్వారా వేలాదిమంది విద్యార్థులు యాక్టింగ్, వాయిస్ ట్రైనింగ్, ఎక్స్ప్రెషన్, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్... మొదలైన వాటిలో శిక్షణ తీసుకున్నారు. కౌర్ దర్శకత్వం వహించిన తాజా నాటకం ‘ది ఈగల్ రైజెస్’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాటకంలో నటించిన వారందరూ మహిళలే. జీవితం అనేది యుద్ధం అనుకుంటే... అక్కడ మనకు అడుగడుగునా కావాల్సింది సానుకూల దృక్పథం. మన మీద మనకు ఉండే ఆత్మవిశ్వాసం. ఇవే మన వజ్రాయుధాలు’ అని చెబుతుంది ది ఈగల్ రైజెస్. ‘థియేటర్ అంటే ముఖానికి రంగులు పూసుకొని, డైలాగులు బట్టీ పట్టడం కాదు. మనలోని సృజనాత్మక ప్రపంచాన్ని ఆవిష్కరించే వేదిక. అందుకు సరైన శిక్షణ కావాలి. కొందరు ఏమీ తెలియకపోయినా ఇతరులకు నటనలో శిక్షణ ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. నాటకం అనేది ఉన్నచోటనే ఉండకూడదు. అది కాలంతో పాటు ప్రవహించాలి. సాంకేతికధోరణులను అందిపుచ్చుకోవాలి’ అని చెబుతున్న కౌర్, నటులకు ఫిజికల్ ఎనర్జీ, ఫిట్నెస్ ముఖ్యం అని నమ్ముతుంది. పిల్లలకు నాటకరంగలో శిక్షణ ఇవ్వాలనే తన కోరికను సాకారం చేసుకున్న కౌర్ ఆల్–వుమెన్ థియేటర్ కోర్స్‌కు రూపకల్పన చేస్తుంది. ఈ కోర్స్‌లో భాగంగా దేశ, విదేశ కళాకారులు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది. కౌర్ రెండో కల నిజం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. -
రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్
ఫ్లాష్‌బ్యాక్‌లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు. చిన్న నిరాశ! జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది. నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్‌లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే. సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్–వుమెన్ డ్రామా గ్రూప్ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్ చేస్తారు. కట్ చేస్తే....ఇది సోషల్ మీడియా కాలం. ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్ స్పేస్‌లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది. ‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ లక్ష్యం. -
డ్రామాకు కేరాఫ్ అ‘డ్రస్’
రాజాం సిటీ /రూరల్: సాంస్కృతిక నాగరికతలో అత్యంత ప్రాధాన్యం ఉన్న రంగస్థల కళకు కళాకారులు వన్నె తెస్తే.. వేదిక వెనుకనే ఉంటూ రూపకల్పన చేసే వారు ఎంతోమంది ఉంటారు. ఆహార్యం, వస్త్రధారణ విషయంలో కీలకభూమిక పోషించే రంగస్థల నటులు ధరించే వ్రస్తాలను నైపుణ్యంతో కుట్టడంలో దర్జీల పాత్ర ఎంతైనా ఉంది. ఈ అరుదైన వృత్తిని చేపట్టి గతంలో రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు వస్త్రాలను కుట్టి ఇచ్చిన దివంగత బాదిరెడ్డి పాపారావు తన వారసత్వాన్ని కుమారుడు బాదిరెడ్డి సీతారాంకు అప్పగించి కళారంగ అభిమానాన్ని చాటుకున్నారు. రాజాం మండలం కొండంపేటకు చెందిన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అంతరించిపోతున్న కళల్లో ప్రథమ స్థానంలో ఉన్న రంగస్థల కళాకారులకు దుస్తులను కుట్టే బాధ్యతను స్వీకరించి పలువురి మన్ననలు అందుకుంటున్నాడు. రంగస్థల దిగ్గజం, బళ్లారి రాఘవ అవార్డు గ్రహీత దివంగత అమరపు సత్యనారాయణ నుంచి లోలుగు ఆచారి, యడ్ల గోపాలం, డాక్టర్ మీగడ రామలింగస్వామి, మొలకారెడ్డి వంటి మహామహులకు సైతం దుస్తులు సమకూర్చిన పాపారావు 2018 పరమపదించారు. అత్యంత కఠినమైన ఈ విద్యను తన పెద్ద కుమారుడికి అప్పగించారు. అప్పటికే దర్జీ పనిలో ఉన్న సీతారాం తండ్రి అప్పగించిన బాధ్యతను కష్టనష్టాలకోర్చి నేటికీ కొనసాగిస్తున్నాడు. ఆదరణ కరువైనా.. నానాటికీ పౌరాణిక కళ అంతరించిపోతుండడంతో ఈ రంగంలోకి వచ్చేవారే కరువయ్యారు. దీంతో డ్రామాడ్రస్సులు కుట్టించేవారు లేక పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికితోడు రెండు నెలలకో, ఆరు మాసాలకో వచ్చే ఆర్డర్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో సాంప్రదాయ నృత్యాలు, బుర్రకథలు తదితర వస్త్రాలు అవసరమైనప్పుడు పని ఉంటుంది. ఒకసారి కుట్టిన వస్త్రం సుమారు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉపయోగించేలా ప్రత్యేక శైలిలో కుట్టి ఇస్తామని, దీనికి విపరీతమైన ఖర్చు ఉన్నప్పటికీ సాదకబాదకాలను భరించి కుట్టి ఇవ్వడంలో సంతృప్తి మిగులుతుందని ఆయన తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో.. డ్రామాడ్రస్సులు కుట్టడంలో ఎవరూ లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. డ్రామా డ్రస్సులతోపాటు పంచె చిలకట్టులు కూడా కుట్టడంతో హైదరాబాద్, బెంగళూరు, రాయలసీమ, వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు. ఓ డ్రామా పంచె కుట్టేందుకు రెండు రోజులు సమయం పడుతుందని సీతారాం తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు పంచెలు కుట్టినట్లు పేర్కొన్నారు. ప్రోత్సహించాలి.. నా చిన్నతనం నుంచి స్కూల్ ముగియగానే నాన్న వద్ద బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. డ్రామా డ్రస్సులు కుట్టే పని అరుదుగా లభిస్తుందని చెప్పడంతో మక్కువ పెంచుకున్నాను. ప్రస్తుతం దర్జీ వృత్తి కూడా రడీమేడ్ వ్రస్తాల రాకతో సంక్షోభంలో పడింది. అరుదైన డ్రామా డ్రస్సులు కుట్టే వృత్తిని గుర్తించి ప్రభుత్వం, దాతలు ప్రోత్సహిస్తే రంగస్థల కళకు పునరుజ్జీవం పోసేందుకు అవకాశం ఉంటుంది. – బాదిరెడ్డి సీతారాం -
కోల్బెల్ట్తో తెలంగాణ శకుంతలకు అనుబంధం
గోదావరిఖని: నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు వచ్చి తెలంగాణను ఇంటిపేరుగా మార్చుకున్న శకుంతల శనివారం హైదరాబాద్‌లో గుండెపోటుకు గురై మరణించారు. ఆమె విలన్‌గా... తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించారు. చాలా సందర్భాల్లో గోదావరిఖనికి వచ్చిన శకుంతల మరణాన్ని ఈ ప్రాంతంలో ఆమెతో అనుబంధం ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చెల్లెలు సాధన గోదావరిఖనిలో నివసిస్తున్నారు. ఆమె భర్త హరియాదవ్ సింగరేణి ఆర్జీ-1లోని 3వ గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చనిపోయారు. వీరి పిల్లలు గోదావరిఖనిలోనే నివాసముంటూ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా పోరు తెలంగాణ, నిర్భయ భారతం సినిమాల షూటింగ్ సందర్భంలో శంకుతల గోదావరిఖనిలోని వివిధ లోకేషన్లలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న యాపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో చిన్నారుల తన పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో ఆమెతో కలిసి సన్నిహితంగా మాట్లాడిన అభిమానులు శంకుతల మరణాన్న జీర్ణించుకోలేకపోతున్నారు.