పోలీసులను ఆశ్రయించిన వడ్డీ బాధితులు
వడ్డీ వ్యాపారులు తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ బాధితులు విశాఖ నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని నర్సింహనగర్కు చెందిన డీఎస్ఎన్ రెడ్డి అనే వ్యక్తి వడ్డీకి అప్పులు ఇస్తుంటాడు. అతడి వద్ద స్థానికులైన బండారు సూర్యారావు, పార్వతి దంపతులు మూడేళ్ల క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి ఐదు ప్రామిసరీ నోట్లు, ఐదు చెక్కులు తీసుకున్నారు. అప్పటి నుంచి నెలకు వెయ్యి చొప్పున వారు అతడికి వడ్డీ చెల్లిస్తున్నారు.
అయితే, ఆ వ్యాపారి ఇటీవల అసలు మొత్తం వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో బాధితులు తమ ఇంటిని విక్రయానికి పెట్టారు. అయితే, కొంటానంటూ ముందుకు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తి బోగస్ పత్రాలిచ్చారంటూ వారిని బెదిరిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాధిత దంపతులు బ్యాంకులో ఉన్న తమ నగలను మరో మహిళ ఆర్థిక సాయంతో విడిపించుకున్నారు.
కాగా.. సదరు మహిళ ఆ నగలను తన వద్దే ఉంచుకుని రేపుమాపు అంటూ తిప్పుకుంటోంది. దీంతో బాధిత దంపతులు బుధవారం సాయంత్రం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్ఎన్రెడ్డి, ప్రసాద్, మరో మహిళపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.