కరువు జిల్లాగా జెడ్పీలో తీర్మానం చేస్తాం
త్రిపురారం : వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు జిల్లాగా జెడ్పీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ వెల్లడించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మీరామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన మొదటి సర్వసభ్య సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని అధికారులు ఇప్పటి నుంచే యాక్షన్‌ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్యకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరువు తీవ్రం కావడంతో ప్రస్తుత ఖరీఫ్‌లో వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయన్నారు. ఒక పక్క విద్యుత్ సమస్య మరో పక్క తీవ్ర వర్షాభావంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడవ కాలువకు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. లిఫ్ట్‌లకు 16 గంటల పాటు విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారులు, ప్రజా ప్రతి నిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా లను ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మీరామచంద్రయ్య, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధన్సింగ్ నాయక్, మండల ప్రజా పరిషత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అనుముల ప్రేమలత, ఎంపీడీఓ శ్రీరామకవచం రమేష్, ఆర్అండ్బీ డీఈ రఘవీర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎమ్మార్పీకి నీటి నివిడుదల చేయాలి
పెద్ద అడిశర్లపల్లి : వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతల నేపథ్యంలో ఏఎమ్మార్పీకి ప్రభుత్వం వెంటనే నీటివిడుదల చేసి రైతులను ఆదుకోవాలని న ల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన జెడ్పీచైర్మన్ బాలునాయక్‌తో కలిసి మండలంలోని ఏకేబీఆర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వర్షాధార పంటలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ప్రాజెక్టు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని అన్నారు.