Duplicate pass book
-
ఏసీబీ వలలో వీఆర్వో
పెద్దారవీడు : డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి రూ.6 వేలు తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ సంఘటన పెద్దారవీడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం సాయంత్రం జరిగింది. ఏసీబీ డీఎస్పీ మూర్తి కథనం ప్రకారం.. తోకపల్లెకు చెందిన రైతు కనకం పెద్ద కోటయ్య పాస్ పుస్తకం ఇటీవల పోయింది. డూప్లికేట్ పాస్ పుస్తకం కోసం వీఆర్వో బి.అచ్చయ్యను ఆయన కుమారుడు సుబ్బారావు సంప్రదించాడు. పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఎఫ్ఆర్ఐ కాపీతో పాటు వీఆర్వో రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.2 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.6 వేలు ఇస్తేనే డూప్లికేట్ పాస్ పుస్తకం ఇస్తానని చెప్పటంతో సుబ్బారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అందులో భాగంగా సుబ్బారావు డబ్బులు తీసుకుని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. డబ్బుతో సమీపంలోని పాత తహశీల్దార్ కార్యాలయానికి రావాలని సుబ్బారావుకు వీఆర్వో అచ్చయ్య సూచించాడు. అక్కడికి వెళ్లగానే రూ.6 వేల నగదు తీసుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి అచ్చయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోను అరె స్టు చేసి ఒంగోలు తరలించినట్లు డీఎస్పీ మూర్తి తెలిపారు. ఆయనతో పాటు సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, కోటేశ్వరరావు ఉన్నారు. 8 నెలల నుంచి తిరుగుతున్నా : సుబ్బారావు నా పాస్ పుస్తకం పోయి 8 నెలలైంది. అప్పటి నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. సిబ్బంది అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు. వీఆర్వోతో మాట్లాడుకుంటే పని అయిపోతుందని కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఆయన రూ.9 వేలు అడగటంతో రూ.8 వేలకు ఒప్పందం చేసుకుని మొదటి విడతగా రూ.2 వేలు ఇచ్చా. మిగిలిన రూ.6 వేలు ఇస్తేనే డూప్లికేట్ పాస్‌పుస్తకం మంజూరు చేస్తానని వీఆర్వో చెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. -
కేరాఫ్ కోడూరు!
=జోరుగా నకిలీ అడంగల్ కాపీల అమ్మకాలు =ఒక్కో పాస్‌పుస్తకం రూ.4 వేల నుంచి రూ.5 వేలకు విక్రయం =వాటి ఆధారంగా బ్యాంకుల్లో భారీగా రుణాలు =ఓ బ్యాంకు నుంచి ఏకంగా రూ.30 లక్షల రుణం పొందిన వైనం చల్లపల్లి, న్యూస్‌లైన్ : పొలం ఉండీ పాస్ పుస్తకం కావాలంటే ఎంత లేదన్నా రెండు నెలల సమయం కావాలి.. అలాంటిది సెంటు భూమి లేకపోయినా ఫర్వాలేదు పైసలిస్తేచాలు రెండు రోజుల్లో పాస్‌పుస్తకాలు మీ చేతిలో ఉండాలంటే కోడూరు వెళ్లండి.. నకిలీ పాస్‌పుస్తకాలు పుట్టించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాకు కోడూరు కేంద్రంగా పనిచేస్తుండటమే దీనికి కారణం. రైతుల సర్వే నంబర్లు సేకరించి... కొంతమంది రైతుల సర్వే నంబర్లను సేకరించి వాటి ద్వారా కోరుకున్న ప్రాంతంలో ఎంత కావాలంటే అంత పొలానికి నకిలీ పాస్‌పుస్తకాలను ఇక్కడ విక్రయిస్తున్నట్టు సమాచారం. మీసేవా కేంద్రాలకు, తహశీల్దార్ కార్యాలయానికి సంబంధం లేకుండా ఈ ముఠా నకిలీ పుస్తకాలను రూపొందించి విక్రయిస్తున్నట్టు తెలిసింది. పంట పొలాలు లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందాలనుకునేవారి ఆశను ఈ ముఠా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. పాస్ పుస్తకం కావాలంటే గతంలో ఆ ప్రాంతంలో సేకరించిన సర్వే నంబర్లు కొన్నింటితో ఈ పుస్తకాలు తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కో పాస్ పుస్తకాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు నకిలీ అడంగల్ కాపీలను ఈ ముఠా విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో అడంగల్‌కు రూ.400 నుంచి రూ.500 తీసుకుంటున్నట్టు సమాచారం. వీటితో పలు బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. రూ.30 లక్షల అక్రమ రుణాలు... కోడూరులోని ఓ బ్యాంకులో ఓ రైతు రుణం పొందేందుకు వెళ్లగా ఈ అక్రమ పాస్బుక్ల బాగోతం బయటపడినట్టు తెలిసింది. అప్పటికే ఆ సర్వే నంబర్‌తో మరొకరు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు పొందారనే విషయం తెలియడంతో ఆ రైతు విస్తుపోయారు. ఈ విధంగా సదరు బ్యాంకు నుంచి రూ.30 లక్షల వరకు అక్రమంగా రుణాలు పొందినట్టు తెలిసింది. సిబ్బంది కూడా కమీషన్లకు కక్కుర్తిపడి వారికి సహకరిస్తున్నట్టు సమాచారం. విషయం వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు సోమవారం రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల్లోనూ... కోడూరుతో పాటు మొవ్వ, పామర్రు మండలాల్లోని పలు బ్యాంకుల్లోనూ ఈ ప్రాంత వాసులు అక్రమ రుణాలు పొందినట్టు సమాచారం. గత ఏడాది ఇలా అక్రమ పాస్బుక్ల ద్వారా రుణాలు పొందిన విషయం బయటకు రాగా ఇప్పటి వరకు వారి నుంచి రుణాలు రికవరీ చేసిన దాఖలాలు లేవు. సామాన్య రైతులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష ప్రశ్నలు సంధించే బ్యాంకు అధికారులు నకిలీ పుస్తకాలకు ఎలా రుణాలిస్తున్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వారంటున్నారు.