నకిలీ వీసా, విమాన టికెట్ల ముఠాపై కేసు నమోదు
భీమారం(వరంగల్ జిల్లా): నకిలీ వీసా, విమాన టికెట్లు సృష్టించిన ఓ ముఠాపై మంగళవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు..నగర పరిధిలోని పలివేల్పులకు చెందిన కె.సచిన్‌గౌడ్, సురేష్‌గౌడ్ ఏడాదిన్నర క్రితం స్థానికంగా ఓ బ్రోకర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కెనడాతో పాటు ఇతర ప్రాంతాలకు పంపిస్తామని కరపత్రాలతో ప్రచారం చేయడమే కాకుండా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈక్రమంలో వారికి నయీంనగర్ ప్రాంతానికి చెందిన పి.సుమన్, ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యారు. కెనడాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల గురించి వారు తెలుసుకున్నారు.
తమను కూడా కెనడాకు పంపించాలని కోరగా... వారు ఒక్కొక్కరికి రూ.6.50లక్షలు చెల్లించమని చెప్పారు. అందుకు ఉద్యోగం, వీసా... విమాన టికెట్లు ఇప్పించే బాధ్యత పూర్తిగా తమదేనన్నారు.డబ్బులు తీసుకున్న తర్వాత వీసా, విమాన టికెట్ల కోసం కాలయాపన చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. బాధితుల నుంచి తప్పించుకోవడం కోసం సచిన్, సురేష్‌గౌడ్‌లు కొత్త ఎత్తు వేశారు. నకిలీ వీసా, విమాన టికెట్లు సృష్టించారు. టికెట్లు, వీసాపై అనుమానంతో బాధితులు వాటిపై విచారించారు. ఇచ్చిన వీసా, టిక్కెట్లు నకిలీవిగా తేలడంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అలీ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు.