duranto express
-
ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు అడ్డుగా బొలెరో.. ఢీ కొట్టిన రైలు
సాక్షి, ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. జిల్లా పరిధిలోని భీమడోలు వద్ద పట్టాలపై అడ్డంగా ఉన్న ఓ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో వాహనం తుక్కుతుక్కు కాగా, రైల్ ఇంజిన్.. ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో ప్రయాణికులు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏం జరిగిందంటే.. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రాక సందర్భంగా భీమడోలు జంక్షన్ వద్ద గేట్ వేశారు. అయితే.. బొలెరోలో వచ్చిన కొందరు గేట్‌ను ఢీ కొట్టి మరీ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో రైలు దగ్గరగా రావడంతో.. బొలెరోను అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక రైలు ఢీ కొట్టడంతో వాహనం ధ్వంసమైంది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో పలువురు ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. ఇక ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టి.. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు
న్యూఢిల్లీ: శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణీకులకు అందించే టీ, టిఫిన్, భోజనం ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మూడు రైళ్లలో మీల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి టికెట్ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. పెరిగిన కేటరింగ్ చార్జీలు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మూడు రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి. సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.70 నుంచి రూ.105కి. లంచ్, డిన్నర్ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి. -
దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించినప్పటి నుంచి ఈ పేరంటే అటు దక్షిణ మధ్య రైల్వేకు, ఇటు తూర్పు కోస్తా రైల్వేకు మింగుడు పడటం లేదు. అందుకే ఈ స్టేషన్ ప్రతిష్టని దిగజార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏ స్పెషల్ ట్రైన్ వేసినా విశాఖ స్టేషన్ ముఖం కూడా చూడనివ్వకుండా బైపాస్‌లో పంపించేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు వచ్చే దురంతో ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను కూడా మాయం చేసేసి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు దారి మళ్లించెయ్యడంతో ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో యుద్ధం చేస్తున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్... తక్కువ స్టేషన్లలో హాల్టులతో త్వరగా గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రారంభించిన రైలు. అన్నీ ఏసీ బోగీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాగించేలా ఈ రైలు ఉంటుంది. ఈ ట్రైన్లు ప్రధాన నగరాల మధ్య మాత్రమే పరుగులు పెడుతుంటాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య (ట్రైన్ నం.22203/22204) 2012 జూలైలో వారానికి మూడు రోజులపాటు నడిచేలా రైలుని ప్రారంభించారు. అయితే 1994 నాటి ఐసీఎఫ్ కోచ్‌లకు మరమ్మతులు, ఆధునికీకరిస్తూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చి ఇచ్చారు. అనంతరం క్రమంగా సమస్యలు మొదలయ్యాయి. పాత కోచ్‌లు కావడంతో ఏసీ నుంచి లీకేజీలు రావడం, బెర్తులు వంగిపోవడం మొదలైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2017లో దురంతోకి కొత్త రేక్ మంజూరు చేస్తామంటూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎట్టకేలకు నెల రోజుల క్రితం ఒక రేక్ (14 బోగీలు)ని దక్షిణ మధ్య రైల్వేకి కేటాయించారు. ట్విటర్లో ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు 12 కోచ్‌లు పక్కదారి... ఈ రేక్ని చెన్నైలోని పెరంబూర్ ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. దీన్ని కేవలం సికింద్రాబాద్ – విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ కోసం కేటాయించాలంటూ బోగీలపై ట్రైన్ నబర్ కూడా ముద్రించారు. అయితే సౌత్ సెట్రల్ రైల్వే అధికారులు దురంతో కోసం ఇచ్చిన బోగీలను దారి మళ్లించారు. హైదరాబాద్ – చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి అప్పనంగా అప్పగించేశారు. దురంతోకి మొత్తం 14 కోచ్‌లు కేటాయిచగా అందులో హైదరాబాద్ – చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు 6 కోచ్‌లు, చెన్నై – హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి మరో 6 కోచ్‌లు పెట్టారు. ఇలా దురంతోకి వచ్చిన కోచ్‌లను పక్కదారి పట్టించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దక్షిణ మధ్య రైల్వే, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్విటర్లలో ఫిర్యాదుల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సత్వరమే స్పందించి దురంతోకి రావాల్సిన రేక్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాల్తేరు వైఫల్యమే కారణమంటూ ఆరోపణలు కోచ్‌లు దారి మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదులపై దక్షిణ మధ్య రైల్వే కుంటి సాకులు చెబుతోంది. వాల్తేరు రైల్వే డివిజన్లో సరైన నిర్వహణ ఉండటం లేదనీ.. ఫలితంగా కొత్త కోచ్‌లు ఏర్పాటు చేసినా త్వరగా పాడైపోతున్నాయంటూ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో పక్కన పెడితే.. ఒక ట్రైన్ కోసం కేటాయించిన బోగీలను మరో ట్రైన్‌కు కేటాయించడాన్ని వాల్తేరు అధికారులు సైతం తప్పుపడుతున్నారు. మరోవైపు విశాఖ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ జోన్లు విశాఖపట్నంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఏ ట్రైన్నీ విశాఖకు కేటాయించకుండా బైపాస్‌లో పంపించి డీగ్రేడ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.ప్రయాణికుల్లోనూ ఇదే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. పాతికేళ్ల క్రితం ఏసీ బోగీలను వేగంగా వెళ్లే రైలుకి కేటాయిస్తే, జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఏసీ ప్రయాణం కంటే అదనపు ఛార్జీని దురంతో పేరుతో వసూలు చేసి ఇలా డొక్కు కోచ్‌లతోనే ఎన్నాళ్లు నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేటాయించిన కోచ్‌లతోనే దురంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైళ్లలో ఫ్లెక్సీ–ఫేర్‌కు సవరణలు
న్యూఢిల్లీ: ఖరీదైన రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 2016లో ప్రవేశపెట్టిన ఫ్లెక్సీ–ఫేర్ విధానంలో రైల్వే మార్పులు చేయడంతో కొన్ని రైళ్లలో చార్జీలు తగ్గనున్నాయి. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని 15 రైళ్లలో పూర్తిగా, మరో 32 రైళ్లలో ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్ నెలల్లో మాత్రమే రైల్వే శాఖ రద్దు చేసింది. ఆ మూడు నెలల్లో ఈ 32 రైళ్లలో రద్దీ తక్కువగా ఉంటున్నందునే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫ్లెక్సీ–ఫేర్ విధానం అమలయ్యే మిగతా రైళ్లలోనూ గరిష్ట చార్జీని ప్రస్తుతం ఉన్న 1.5 రెట్ల నుంచి 1.4 రెట్లకు తగ్గించింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ ఫ్లెక్సీ–ఫేర్ విధానం కారణంగా ప్రతి పది శాతం సీట్లు బుక్ అయ్యే కొద్దీ చార్జీ 10 పెరుగుతూ పోతుంది. అలా సాధారణ చార్జీతో పోలిస్తే గరిష్టంగా 1.5 రెట్ల వరకు చార్జీలను పెంచేవారు. తాజా నిర్ణయంతో చార్జీలు 1.4 రెట్ల వరకే పెరుగుతాయి. ఫ్లెక్సీ–ఫేర్ విధానం వల్ల రైల్వేకు ఆదాయం పెరిగింది కానీ ప్రయాణికుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిందనీ ఈ ఏడాది జూలైలోనే రైల్వేపై కాగ్ మొట్టికాయలు వేశారు. దీంతో ఫ్లెక్సీ–ఫేర్‌లో తాజా మార్పులు జరిగాయి. ఈ మార్పుల కారణంగా చార్జీలు తగ్గుతున్నాయి కాబట్టి మరింత ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కడం ద్వారా అధిక ఆదాయాన్ని సాధిస్తామని రైల్వే మంత్రి గోయల్ చెప్పారు. ఫ్లెక్సీ–ఫేర్ విధానం పూర్తిగా రద్దయిన వాటిలో చెన్నై–మదురై దురంతో రైలు ఉండగా.. ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్ నెలల్లో మాత్రమే ఈ విధానం రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్–పుణె శతాబ్ది, సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ శతాబ్ది, సికింద్రాబాద్–ముంబై దురంతో, చెన్నై సెంట్రల్–కోయంబత్తూర్ శతాబ్ది తదితర రైళ్లున్నాయి. -
‘దురంతో’కు తప్పిన ప్రమాదం
ఆమదాలవలస: శాంత్రగచ్చి– చెన్నై దురంతో ఎక్స్‌ప్రెస్‌కు బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో బుధవారం రైల్వే ట్రాక్ విరిగింది. అధికారులు సకాలంలో స్పందించి మరమ్మతులుS చేపట్టడంతో దురంతోకి ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..ఉదయం 6.45 గంటలకు శాంత్రగచ్చి–చెన్నై (దురంతో ఎక్స్‌ప్రెస్) ప్లాట్‌ఫాం దాటిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ ఉన్న ప్రయాణికులు, అధికారులు పరిశీలించగా పట్టా విరిగి ఉండడాన్ని గమనించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై పట్టాకు మరమ్మతులు చేపట్టారు. -
తిలారులో నిలిచిన ధురంతో ఎక్స్‌ప్రెస్
ఐదున్నర గంటల పాటు నిలిపివేత ప్రయాణికులకు తప్పని అవస్థలు తిలారు ఆర్ఎస్(జలుమూరు): యశ్వంత్‌పూర్ నుంచి ఔరా వెళ్లాల్సిన ధురంతో ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు ఐదున్నర గంటల పాటు తిలారు రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. తిలారు స్టేషన్ మాస్టర్ పాడి తెలిపిన సమాచారం మేరకు... ఉదయం ఆరు గంటల సమయంలో టెక్కలిపాడు–బసివాడ రైల్వేక్రాసింగ్ గేటు వద్ద గేదె అడ్డంగా రావడంతో రైలుకు ఎయిర్ లాక్ అయ్యింది. బండి ముందుకు కదలలేదు. ఉదయం 7.30 గంటల వరకు అక్కడే నిలిపివేశారు. డ్రైవర్ తాత్కాలికంగా బాగుచేసి మెల్లగా తిలారు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 10.30 గంటల వరకూ స్టేషన్లోనే ఉండిపోయింది. చివరకు రైల్వే మెకానిక్‌లు వచ్చి బాగుచేయడంతో రైలు ముందుకు కదిలింది. సాంకేతిక అంతరాయంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మాస్టర్ పాడి తెలిపారు. -
రైల్లో కిలోన్నర బంగారం చోరీ!
ఖరీదైన రైలు.. అందులోనూ ఖరీదైన బోగీ.. ఎలాంటి సమస్యా ఉండబోదని దాదాపు కిలోన్నర బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా దొంగలు కొట్టేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు దురంతో ఎక్స్‌ప్రెస్ ఫస్ట్‌క్లాస్ బోగీలో వస్తున్న ప్రయాణికురాలి నుంచి 1.49 కిలోల బంగారం ఉన్న బ్యాగును దొంగలు కొట్టేశారు. 50 ఏళ్ల వయసున్న నాగశేషు వేణు అనే మహిళ బంగారం ఉన్న బ్యాగును తన తలగడ కింద పెట్టుకుని నిద్రపోయారు. కానీ వరంగల్ స్టేషన్‌కు చేరుకునే సమయానికి మెలకువ వచ్చి చూసుకుని, బ్యాగు పోయిన విషయం తెలిసింది. దాంతో వెంటనే ఆమె టీటీఈకి చెప్పారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఫిర్యాదు నమోదు చేశారు. ఈ రైలు విశాఖ తర్వాత కేవలం విజయవాడలోనే ఆగుతుంది. బహుశా అక్కడే బ్యాగు ఎవరో కొట్టేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.