Durga sakthi nagpal
-
ఐఏఎస్ అధికారిణి దుర్గానాగ్‌పాల్ మీద సస్పెన్షన్ ఎత్తివేత?
లక్నో: ఐఏఎస్ అధికారి దుర్గాశ క్తి నాగ్‌పాల్ మీద అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శలు ప్రభుత్వాన్ని కుదిపినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఇసుక మాఫియా ఒత్తిడులకు తలొగ్గి గౌతమ్‌బుద్ధానగర్ జిల్లా ఐఏఎస్ అధికారి దుర్గాశక్తినాగ్పాల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు యూపీ ప్రభుత్వ చర్యను గర్హించారు. దశదిశల సాగిన దాడితో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరయింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఐఏఎస్ అధికార్ల సంఘం ఒత్తిళ్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను సస్పెండ్ చేయడం వలన అధికారులకు ఇప్పటికే ఓ బలమైన హెచ్చరిక సందేశాన్ని జారీ చేసినట్లయిందని అఖిలేష్ సంతృప్తిపడుతున్నట్లు కనిపిస్తోంది. కాగా ఓ సీనియర్ సమాజ్‌వాది పార్టీ నేత మాత్రం ఎంతగా ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గేది లేదనే నిర్ణయంతో ముఖ్యమంత్రి ఉన్నాడని తెలిపారు. దుర్గా నాగ్‌పాల్ ఇప్పటికే ప్రభుత్వ అభియోగానికి సంజాయిషీ సమాధానం పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సంజాయిషీ పత్రంలో తాను అమాయకురాలినని నాగ్‌పాల్ పేర్కొన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సమాధానం పరిశీలిస్తామని నోట్ రాసిన ఈ అధికారి అంతకుమించి ఏ విషయం మాట్లాడడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగ్‌పాల్ పంపించిన ఐదు పేజీ సమాధానంలో తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ప్రభుత్వ అభియోగాల్లో పసలేదని, అందులో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పునరాలోచనలో పడడానికి ఇది కూడా ఒక కారణమయి ఉంటుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. స్థానిక గూఢచార వర్గాల సమాచారంతో పాటు గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్ సేకరించిన సమాచారం ప్రకారం, కదల్పూర్లో జరిగిన మసీద్ గోడ కూల్చివేత సమయంలో దుర్గా నాగ్‌పాల్ లేరని స్పష్టం చేసినట్లు తెలిసింది. మసీద్ గోడ కూల్చివేత సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మతసామరస్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉండేదని ముఖ్యమంత్రి తన చర్యను సమర్థించుకోజూశారని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దుర్గానాగ్పాల్కు జీబీనగర్ మేజిస్ట్రేట్ ఇప్పటికే క్లీన్ చీట్ ఇచ్చారు. అక్రమంగా నిర్మించిన మసీదు గోడను గ్రామస్థులే కూల్చివేశారని జిల్లా మేజిస్ట్రేట్ తన నివేదికలో పేర్కొన్నారు. -
రెండు సార్లు చంపాలని చూశారు : ఐఏఎస్ యూనస్
అయినా ఇసుక మాఫియాపై పోరాడతా: హిమాచల్ ఐఏఎస్ యూనస్ సిమ్లా: ఇసుక అక్రమ రవాణా మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు తనపై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నం చేశారని, తాజా దాడి మూడోదని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి యూనస్‌ఖాన్ చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా నలాగఢ్ ప్రాంత సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యూనస్ఖాన్పై అక్కడి ఇసుక మాఫియా బుధవారం హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘గత ఆరు నెలల్లో భారీగా ఇసుక అక్రమ రవాణాదారులను పట్టుకుని, ఏకంగా రూ. కోటి జరిమానా విధించాం. 350 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. అయితే.. నన్ను కొద్దిరోజుల్లోనే అక్కడి నుంచి బదిలీ చేయించడానికి యత్నిం చారు. ఆ తర్వాత జూన్ చివరలో ఒకసారి, జూలైలో మరోసారి నన్ను చంపేందుకు ప్రయత్నించారు’’ అని యూనస్ పేర్కొన్నారు. ఈ దాడులకు భయపడబోనని, పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఇదే తరహాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేత సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్, యూనస్‌ఖాన్ ఒకే ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు కావడం గమనార్హం. -
దుర్గాశక్తి సస్పెన్షన్‌పై 12న విచారణ
న్యూఢిల్లీ: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి సస్పెన్షన్‌కు గురైన ఉత్తరప్రదేశ్ యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానాన్ని చేరుకుంది. ఆమెపై చేపట్టిన అన్ని చర్యలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యం(పిల్)పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ఈనెల 12న విచారణ నిర్వహించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. దుర్గాశక్తికి వ్యతిరేకంగా యూపీ సర్కారు చేపట్టిన చర్యలు దురుద్దేశంతో కూడుకున్నవని, అవి చెల్లవని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని కించపరచటమేనన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మతపరమైన భవనాల నిర్మాణాన్ని నిరోధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించినందుకు దుర్గాశక్తి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, అత్యున్నత న్యాయస్థానం ఆమెను కాపాడాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. మీడియాది అత్యుత్సాహం: ఆజంఖాన్ దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని యూపీ మంత్రి ఆజంఖాన్ మండిపడ్డారు. నాగ్‌పాల్‌ను దుర్గామాతలా ప్రచారంచేస్తూ ఎక్కువ చేసి చూపుతోందని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు లేకుండానే రాష్ట్రాన్ని నడుపుతామంటూ కొందరు అధికార ఎస్పీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆజంఖాన్ సమర్థించారు. దేశంలోని 125 కోట్ల జనాభాకు కేవలం వెయ్యి నుంచి రెండు వేల మంది ఐఏఎస్ అధికారులున్నారని...వారి బదులు ఇతరులు దేశా న్ని నడపలేరా? అని ప్రశ్నించారు. బ్రిటీష్‌కాలం నాటి సివిల్ సర్వీసు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్య లు తీసుకుంటామని మరోమంత్రి శివ్‌పాల్‌సింగ్ యాదవ్ హెచ్చరించారు. మరోవైపు దుర్గాశక్తి సస్పెన్షన్ వేటును వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐపీఎస్ అధికారుల సం ఘం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాసింది. -
ఖేమ్కాను పట్టించుకోలేదేం?
న్యూఢిల్లీ/జైపూర్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంలో సోనియా జోక్యం చేసుకొని లేఖ రాయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సోనియా లేఖ రాసిన అనంతరం దుర్గాశక్తి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారును కోరింది. అయితే, ఈ వ్యవహారంపై ప్రధానికి సోనియా మాటమాత్రంగా చెబితే సరిపోయేదని, లేఖ రాయాల్సిన అవసరం లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టంచేయగా, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అశోక్ ఖేమ్కా బదిలీ విషయంలో ఆమె ఎందుకు కల్పించుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) విరుచుకుపడుతున్నాయి. తాజాగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేయడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తాయి. రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీల్లోని అక్రమాలు బయటపెట్టిన పాపానికి హర్యానాలో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ పైనా ఆమె ఇదే విధంగా ప్రధానికి లేఖ రాసి ఉండాల్సిందని ఎస్పీ వ్యాఖ్యానించింది. ఖేమ్కా వ్యవహారంలో సోనియా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. అయితే ఖేమ్కా, దుర్గాశక్తిల అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. వాద్రా భూవివాదం సివిల్ వ్యవహారమని, ఖేమ్కాను అక్కడి ప్రభుత్వం మిగిలిన అధికారులతో పాటు బదిలీ చేసిందని చెప్పారు. దుర్గాశక్తి సస్పెన్షన్‌కు మతపరమైన ఉద్రిక్తతలను కారణంగా చూపుతూ సమాజ్‌వాదీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఎంపీ జితిన్ ప్రసాద విమర్శించారు. దుర్గాశక్తి సస్పెన్షన్‌కు ఇసుక మాఫియా ఒత్తిళ్లే కారణమని అన్నారు. దుర్గాశక్తికి అధికారుల బాసట: దుర్గాశక్తి నాగపాల్‌కు మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ సహా పలువురు రిటైర్డ్, సీనియర్ అధికారులు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. తన వాదనను వినిపించుకునే అవకాశమైనా ఇవ్వకుండానే ఆమెను సస్పెండ్ చేయడాన్ని వినోద్ రాయ్ తప్పుపట్టారు. ఆమె సస్పెన్షన్‌ను మాజీ సీవీసీ ఎన్.విఠల్ రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. వాద్రా భూముల వ్యవహారంలో బదిలీ అయిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా కూడా దుర్గాశక్తికి మద్దతు పలికారు. చాలా కొద్దిమంది యువ ఐఏఎస్ అధికారులు మాత్రమే ఇసుక మాఫియాతో తలపడే సాహసం చేస్తారని, దుర్గాశక్తి తన విధి నిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించారని కితాబునిచ్చారు. దుర్గాశక్తి నాగపాల్‌ను యూపీ సర్కారు అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని తీర్మానించింది. రాజస్థాన్‌లో ఎస్పీ బదిలీ.. రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన రెండు రోజులకే జైసల్మేర్ ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేసింది. పోఖ్రాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సలేహ్ మహమ్మద్ తండ్రి గజీ ఫకీర్ (78) సహా పలువురిపై స్మగ్లింగ్ సహా పలు ఆరోపణలున్నాయి. జైసల్మేర్ ఎస్పీ పంకజ్ చౌదరి రెండు రోజుల కిందట గజీ ఫకీర్, ఇతరులపై హిస్టరీ షీట్లను తెరిచారు. దీంతో రాజస్థాన్ సర్కారు ఆయన్ని ఆదివారం అజ్మీర్ జిల్లాలోని కృష్ణగఢ్ పోలీసు శిక్షణ కేంద్రం కమాండెంట్‌గా బదిలీ చేసింది. ఎస్పీని బదిలీ చేయడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. జైసల్మేర్ జిల్లాలో బంద్ పాటిం చారు. ఫకీర్పై 1965లో తొలిసారిగా హిస్టరీ షీట్ తెరిచారని, 1984లో ఆ ఫైలు గల్లంతైందని చౌదరి తెలిపారు. 1990లో తిరిగి ఆయనపై హిస్టరీ షీట్ తెరవగా, 2011 మేలో మూసేశారని చెప్పారు. తాను మళ్లీ ఆయనపై హిస్టరీ షీట్‌ను తెరవడానికి, తన బదిలీకి సంబంధం ఉంటే ఉండవచ్చని అన్నారు.