న్యూఢిల్లీ/జైపూర్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంలో సోనియా జోక్యం చేసుకొని లేఖ రాయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సోనియా లేఖ రాసిన అనంతరం దుర్గాశక్తి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారును కోరింది. అయితే, ఈ వ్యవహారంపై ప్రధానికి సోనియా మాటమాత్రంగా చెబితే సరిపోయేదని, లేఖ రాయాల్సిన అవసరం లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టంచేయగా, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అశోక్ ఖేమ్కా బదిలీ విషయంలో ఆమె ఎందుకు కల్పించుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) విరుచుకుపడుతున్నాయి.
తాజాగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేయడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తాయి. రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీల్లోని అక్రమాలు బయటపెట్టిన పాపానికి హర్యానాలో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ పైనా ఆమె ఇదే విధంగా ప్రధానికి లేఖ రాసి ఉండాల్సిందని ఎస్పీ వ్యాఖ్యానించింది. ఖేమ్కా వ్యవహారంలో సోనియా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. అయితే ఖేమ్కా, దుర్గాశక్తిల అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. వాద్రా భూవివాదం సివిల్ వ్యవహారమని, ఖేమ్కాను అక్కడి ప్రభుత్వం మిగిలిన అధికారులతో పాటు బదిలీ చేసిందని చెప్పారు. దుర్గాశక్తి సస్పెన్షన్‌కు మతపరమైన ఉద్రిక్తతలను కారణంగా చూపుతూ సమాజ్‌వాదీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఎంపీ జితిన్ ప్రసాద విమర్శించారు. దుర్గాశక్తి సస్పెన్షన్‌కు ఇసుక మాఫియా ఒత్తిళ్లే కారణమని అన్నారు.
దుర్గాశక్తికి అధికారుల బాసట: దుర్గాశక్తి నాగపాల్‌కు మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ సహా పలువురు రిటైర్డ్, సీనియర్ అధికారులు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. తన వాదనను వినిపించుకునే అవకాశమైనా ఇవ్వకుండానే ఆమెను సస్పెండ్ చేయడాన్ని వినోద్ రాయ్ తప్పుపట్టారు. ఆమె సస్పెన్షన్‌ను మాజీ సీవీసీ ఎన్.విఠల్ రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. వాద్రా భూముల వ్యవహారంలో బదిలీ అయిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా కూడా దుర్గాశక్తికి మద్దతు పలికారు. చాలా కొద్దిమంది యువ ఐఏఎస్ అధికారులు మాత్రమే ఇసుక మాఫియాతో తలపడే సాహసం చేస్తారని, దుర్గాశక్తి తన విధి నిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించారని కితాబునిచ్చారు. దుర్గాశక్తి నాగపాల్‌ను యూపీ సర్కారు అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని తీర్మానించింది.
రాజస్థాన్‌లో ఎస్పీ బదిలీ..
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన రెండు రోజులకే జైసల్మేర్ ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేసింది. పోఖ్రాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సలేహ్ మహమ్మద్ తండ్రి గజీ ఫకీర్ (78) సహా పలువురిపై స్మగ్లింగ్ సహా పలు ఆరోపణలున్నాయి. జైసల్మేర్ ఎస్పీ పంకజ్ చౌదరి రెండు రోజుల కిందట గజీ ఫకీర్, ఇతరులపై హిస్టరీ షీట్లను తెరిచారు. దీంతో రాజస్థాన్ సర్కారు ఆయన్ని ఆదివారం అజ్మీర్ జిల్లాలోని కృష్ణగఢ్ పోలీసు శిక్షణ కేంద్రం కమాండెంట్‌గా బదిలీ చేసింది. ఎస్పీని బదిలీ చేయడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. జైసల్మేర్ జిల్లాలో బంద్ పాటిం చారు. ఫకీర్‌పై 1965లో తొలిసారిగా హిస్టరీ షీట్ తెరిచారని, 1984లో ఆ ఫైలు గల్లంతైందని చౌదరి తెలిపారు. 1990లో తిరిగి ఆయనపై హిస్టరీ షీట్ తెరవగా, 2011 మేలో మూసేశారని చెప్పారు. తాను మళ్లీ ఆయనపై హిస్టరీ షీట్‌ను తెరవడానికి, తన బదిలీకి సంబంధం ఉంటే ఉండవచ్చని అన్నారు.
ఖేమ్కాను పట్టించుకోలేదేం?
Published Mon, Aug 5 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement