ఇసుక అక్రమ రవాణా మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు తనపై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నం చేశారని, తాజా దాడి మూడోదని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి యూనస్‌ఖాన్ చెప్పారు.
అయినా ఇసుక మాఫియాపై పోరాడతా: హిమాచల్ ఐఏఎస్ యూనస్
సిమ్లా: ఇసుక అక్రమ రవాణా మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు తనపై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నం చేశారని, తాజా దాడి మూడోదని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి యూనస్‌ఖాన్ చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా నలాగఢ్ ప్రాంత సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యూనస్‌ఖాన్‌పై అక్కడి ఇసుక మాఫియా బుధవారం హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘గత ఆరు నెలల్లో భారీగా ఇసుక అక్రమ రవాణాదారులను పట్టుకుని, ఏకంగా రూ. కోటి జరిమానా విధించాం. 350 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. అయితే.. నన్ను కొద్దిరోజుల్లోనే అక్కడి నుంచి బదిలీ చేయించడానికి యత్నిం చారు. ఆ తర్వాత జూన్ చివరలో ఒకసారి, జూలైలో మరోసారి నన్ను చంపేందుకు ప్రయత్నించారు’’ అని యూనస్ పేర్కొన్నారు. ఈ దాడులకు భయపడబోనని, పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఇదే తరహాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేత సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్, యూనస్‌ఖాన్ ఒకే ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు కావడం గమనార్హం.