దుర్గాశక్తి సస్పెన్షన్‌పై 12న విచారణ
న్యూఢిల్లీ: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి సస్పెన్షన్‌కు గురైన ఉత్తరప్రదేశ్ యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానాన్ని చేరుకుంది. ఆమెపై చేపట్టిన అన్ని చర్యలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యం(పిల్)పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ఈనెల 12న విచారణ నిర్వహించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. దుర్గాశక్తికి వ్యతిరేకంగా యూపీ సర్కారు చేపట్టిన చర్యలు దురుద్దేశంతో కూడుకున్నవని, అవి చెల్లవని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని కించపరచటమేనన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మతపరమైన భవనాల నిర్మాణాన్ని నిరోధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించినందుకు దుర్గాశక్తి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, అత్యున్నత న్యాయస్థానం ఆమెను కాపాడాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు.
మీడియాది అత్యుత్సాహం: ఆజంఖాన్
దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని యూపీ మంత్రి ఆజంఖాన్ మండిపడ్డారు. నాగ్‌పాల్‌ను దుర్గామాతలా ప్రచారంచేస్తూ ఎక్కువ చేసి చూపుతోందని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు లేకుండానే రాష్ట్రాన్ని నడుపుతామంటూ కొందరు అధికార ఎస్పీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆజంఖాన్ సమర్థించారు. దేశంలోని 125 కోట్ల జనాభాకు కేవలం వెయ్యి నుంచి రెండు వేల మంది ఐఏఎస్ అధికారులున్నారని...వారి బదులు ఇతరులు దేశా న్ని నడపలేరా? అని ప్రశ్నించారు. బ్రిటీష్‌కాలం నాటి సివిల్ సర్వీసు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్య లు తీసుకుంటామని మరోమంత్రి శివ్‌పాల్‌సింగ్ యాదవ్ హెచ్చరించారు. మరోవైపు దుర్గాశక్తి సస్పెన్షన్ వేటును వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐపీఎస్ అధికారుల సం ఘం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాసింది.