డ్యూటీ డ్రాబ్యాక్ అవకతవకలపై కొరడా!
కంపెనీలపై చర్యలకు ఈడీ, డీఆర్ఐలకు సిట్ ఆదేశం
న్యూఢిల్లీ: ఎగుమతులు జరపకుండా డ్యూటీ డ్రాబ్యాక్ (చెల్లించిన సుంకాలు తిరిగి పొందడం) క్లెయిమ్స్‌కు పాల్పడిన కంపెనీలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆదేశించింది. 2016 మార్చి 1వ తేదీకి ముందు ఈ తరహా అవకతవకలకు పాల్పడిన 216 కంపెనీలు, అలాగే అటు తర్వాత ఇందుకు సంబంధించి 572 కంపెనీలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని ఈడీని సిట్ ఆదేశించింది. దాదాపు రూ.100 కోట్ల మేర సరకు ఎగుమతి జరక్కుండానే డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఆర్బీఐకి సూచనలు...: ఇలాంటి అవకతవకలకు చోటు లేకుండా తగిన వ్యవస్థాగత యంత్రాంగాన్ని, ఐటీ వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలని ఆర్బీఐకి సిట్ సూచించింది. ఎగుమతుల డేటాను నెలవారీగా ఈడీ, డీఆర్ఐలతో పంచుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఎగుమతి తేదీ నుంచి ఏడాదిలోపు తమ ఎగుమతుల ద్వారా లభించిన విదేశీ మారకద్రవ్యం మొత్తాన్ని దేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత ఎగుమతిదారుకు డ్యూటీ డ్రాబ్యాక్ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ జరక్కుండానే డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి.