ఎన్నికల వేళ ‘ఈమెయిళ్ల’ రచ్చ
- హిల్లరీ ఈమెయిళ్లపై మళ్లీ ఎఫ్‌బీఐ దర్యాప్తు
- ఎఫ్‌బీఐ నిర్ణయంపై డెమోక్రాట్ల అనుమానాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మిగిలింది 9 రోజులే. ఇప్పటి వరకూ రేసులో దూసుకుపోతున్న డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇటువంటి కీలక తరుణంలో ఎదురుదెబ్బ తగిలింది. హిల్లరీ ఈమెయిళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునరుద్ధరించాలని తాజాగా ఎఫ్‌బీఐ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. హిల్లరీ 2009-2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ, వ్యక్తిగత ఈమెయిళ్లను పంపేందుకు ప్రైవేట్ సర్వర్‌ను వినియోగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తును పునరుద్ధరిస్తున్నామంటూ ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమే టాప్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఆ లేఖ అంశం రిపబ్లికన్ నాయకుడు మీడియాకు విడుదల చేసే వరకూ వైట్‌హౌస్‌కు, హోంశాఖకు తెలియదు.
ఎఫ్‌బీఐ నిర్ణయం డెమోక్రటిక్ పార్టీని షాక్‌కు గురిచేసింది. అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న తరుణంలో ఎఫ్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై హిల్లరీ స్పందిస్తూ.. ఈమెయిళ్లకు సంబంధించి ఎఫ్‌బీఐ జూలైలో వచ్చిన నిర్ణయానికి తాజా దర్యాప్తులోనూ పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చన్నారు. దేశంలో ఓటింగ్ జరుగుతోందని, ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాలంటే అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఆమె ఎఫ్‌బీఐని కోరారు.. సర్వేలన్నింటిలోనూ తానే ముందున్నానని, ఈ వ్యవహారం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదనిచెప్పారు.
వాటర్‌గేట్ స్కామ్కంటే పెద్దది: ట్రంప్
ఈమెయిళ్ల వ్యవహారంపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇది వాటర్‌గేట్ కుంభకోణానికంటే పెద్దదని ఆరోపించారు.
భారతీయ అమెరికన్ల ఓట్లు హిల్లరీకే: సర్వే
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డెమోక్రాట్ల అభ్యర్థి ిహ ల్లరీ క్లింటన్‌వైపు భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో మొగ్గుచూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆమె అధ్యక్షురాలు కావాలని, భారత్-అమెరికా సంబంధాలు ఆమె నాయకత్వంలో మరింత బలపడతాయని వారు భావిస్తున్నట్లు ఇండ్‌యూఎస్ బిజినెస్ జర్నల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం. ఎన్నికలు ఇప్పుడే జరిగితే భారతీయ అమెరికన్లలో 79.43 శాతం మంది హిల్లరీకి, 14.89 శాతం మంది రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌కు ఓటేస్తారు.
హిల్లరీ ఈమెయిల్ హ్యాకింగ్ ఇలా ...
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచార నిర్వాహకుడు జాన్ పొడెస్టాకు చెందిన 50 వేల ఈ మెయిల్లు ఎలా హ్యాకింగ్ కు గురయ్యాయో తెలిసింది. ఇంతకాలం దీనికి రష్యా ప్రభుత్వం కారణమని భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముందు మార్చి 19న పొడెస్టాకు హ్యాకర్లు గూగుల్ నుంచి ఓ మెయిల్ పంపారు. అందులో.. ఉక్రెయిన్‌లో ఎవరో పొడెస్టా జీమెయిల్ పాస్‌వర్డ్‌ను కొట్టేశారని, లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని ఉంది. పాస్‌వర్డ్‌ను మార్చుకొమ్మని ఓ వెబ్‌సైట్‌ను కూడా సూచించారు. పొడెస్టా కింది ఉద్యోగి ఈమెయిల్‌ను క్లింటన్ ప్రచార ఆపరేషన్స్ హెల్ప్ డెస్క్‌కు పంపించారు. దానికి అక్కడి ఉద్యోగి చార్లెస్ డేలావాన్ ‘ఇది సక్రమ మెయిలే.
జాన్ తన పాస్‌వర్డ్‌ను తక్షణమే మార్చుకోవాలి’ అని 25 నిమిషాల తరువాత బదులిచ్చారు. పొడెస్టా పాస్‌వర్డ్‌ను మార్చకోవాలన్న లింకు వాస్తవానికి నెదర్లాండ్స్‌లోని కంప్యూటర్ను సూచించింది. దాని వెబ్ అడ్రస్ న్యూజిలాండ్‌లోని టోక్లీయా అనే ప్రాంతం పేరు మీద ఉంది. పొడవైన ఆన్లైన్ చిరునామాలను సూక్ష్మరూపంలో వ్యక్తం చేసే ఓ సర్వీసు ద్వారా హ్యాకర్లు ఈ లింకు నిజస్వరూపాన్ని దాచిపెట్టారు. ‘పొడెస్టా పాస్‌వర్డ్‌ను కొట్టేశారని’ చెప్పిన ఉక్రెయిన్ హ్యాకర్ ఇంటర్నెట్ అడ్రస్‌ను కూడా హ్యాకర్లు ఈమెయిల్లో పొందుపరిచారు. ఆ అడ్రస్ ఉక్రెయిన్‌లోని ఓ మొబైల్ కమ్యూనికేషన్ ప్రొవైడర్దని తెలిసింది. ఆ తరువాత పొడెస్టా ఎలా స్పందించారో తెలియదు కానీ ఐదు నెలల తరువాత హ్యాకర్లు అతని ఖాతాల నుంచి వేల కొలది ఈమెయిళ్లను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు.