11 రోజుల్లో ఎన్నికలు.. హిల్లరీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ తన ఈ-మెయిళ్లపై ఇప్పటివరకూ జరిగిన విచారణలోని వాస్తవాలను బయటపెట్టాలని శుక్రవారం ఎఫ్ బీఐను కోరారు. ప్రస్తుతం దేశంలో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలని ఐయోవాలోని ఓ సమావేశంలో అన్నారు.
కొత్త ఈ-మెయిళ్లను కూడా పరిశీలిస్తున్నామని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ చెప్పిన కొద్ది సమయంలో హిల్లరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్తగా బయటకు వచ్చిన ఈ-మెయిళ్లు ఆంథోని వీనర్-వీనర్ కంపెనీకు చెందినవిగా ఎఫ్ బీఐ గుర్తించింది. ఈ కంపెనీ ఓనర్ గతంలో న్యూయార్క్ డెమొక్రటిక్ పార్టీ నేత. మైనర్ బాలికపై లైంగిక దాడులు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు.
దాదాపు ఏడాది కాలం పాటు హిల్లరీ ఈ-మెయిళ్లపై విచారణ చేసిన ఎఫ్ బీఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయశాఖ విచారణను నిలిపివేసింది. అయితే తాజాగా బయటపడిన ఈ-మెయిళ్ల కారణంగా మొత్తం కేసును ఎఫ్ బీఐ మళ్లీ తెరచింది. మరో 11 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఎఫ్ బీఐ హిల్లరీపై కేసును తెరవడంపై డెమొక్రటిక్ ల శిబిరంలో ఆందోళన నెలకొంది.
తొలుత కేసును మూసేసిన ఎఫ్ బీఐ మరలా తెరవడంపై డెమొక్రటిక్ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ బీఐ దురుద్దేశంతోనే కేసును తెరుస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, హిల్లరీ ఈ-మెయిళ్ల కేసును రీ ఓపెన్ చేయడాన్ని అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ స్వాగతించారు. చివరకు న్యాయం జరగబోతోందని వ్యాఖ్యానించారు.
న్యూ హంప్ షైర్ లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు 'ఆమెను జైల్లో వేయండి' అంటూ నినాదాలు చేశారు. తప్పును సరిదిద్దుకునేందుకు ముందుకు వచ్చిన న్యాయశాఖ, ఎఫ్ బీఐలపై తనకు గౌరవముందని ట్రంప్ అన్నారు.