E-ticketing
-
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
-
వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
న్యూఢిల్లీ: వాట్సాప్ నంబర్‌తో కావాల్సిన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసే సౌకర్యం రైలు ప్రయాణీకులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బోట్ ప్రయాణికులకు మీల్స్‌ను బుక్ చేస్తుంది. ఈ కేటరింగ్ సేవల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.in తోపాటు ఈ–కేటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపింది. ఇ–టికెట్ బుక్ చేసుకుని, ఇ–కేటరింగ్ సేవలకు ఆప్షన్ ఇచ్చిన ప్రయాణికులకు వాట్సాప్ నంబర్ నుంచి మెసేజీ వెళ్తుంది. దాని ద్వారా ఆ మార్గంలోని స్టేషన్లలో నచ్చిన రెస్టారెంట్లలో మీల్స్ బుక్ చేసుకోవచ్చు. -
ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం
IRCTC Tatkal Tickets.. సాక్షి, అమరావతి: ఈ–టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్‌ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీనిపై సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో కలసి రూపొందించిన నివేదికను రైల్వే శాఖకు ఐఆర్సీటీసీ సమర్పించింది. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఐఆర్సీటీసీ పోర్టల్‌లో సమూల సంస్కరణలు తీసుకువస్తూ.. అప్‌గ్రేడ్ చేయనున్నారు. దారి మళ్లుతున్న 35 శాతం తత్కాల్ టికెట్లు.. రైల్వే శాఖ ఈ–టికెటింగ్ విధానంలో ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్లను కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఫేక్ ఐడీలతో అక్రమంగా బల్క్ బుకింగ్ చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ నియమించిన గ్రాంట్ థాంటన్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది. తత్కాల్ కోటాలోని దాదాపు 35 శాతం టికెట్లు ఇలా దారిమళ్లుతున్నట్టు తేలింది. దీంతో బల్క్ బుకింగ్‌ల దందాకు అడ్డుకట్ట వేయాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఈ–టికెటింగ్ పోర్టల్‌లో సంస్కరణలు తీసుకువచ్చి అప్‌గ్రేడ్ చేయనుంది. అలాగే ఈ–టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐఆర్సీటీసీ పోర్టల్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2021 డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం 80.5 శాతం రైల్వే టికెట్లు ఈ–టికెటింగ్ విధానంలోనే బుక్ చేస్తున్నారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్లలోని కౌంటర్ల వద్ద కంటే ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా మూడు రెట్లు అధికంగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో ఇప్పటివరకు 10 కోట్ల మంది నమోదు చేసుకోగా.. వారిలో 7.50 కోట్ల మంది ఈ–టికెట్ల కొనుగోలులో క్రియాశీలకంగా ఉంటున్నారు. 2014లో అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ పోర్టల్‌కు సగటున నిమిషానికి 28 వేల లావాదేవీలు సాగించే సామర్థ్యముంది. కానీ గత ఎనిమిదేళ్లలో డిమాండ్ అమాంతం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సేవలు అందించేందుకు పోర్టల్ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే పోర్టల్‌సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. నిమిషానికి 40 వేల వరకు లావాదేవీలు సాగించే సామర్థ్యంతో పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్ కల్లా అప్‌గ్రేడ్ చేసిన పోర్టల్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా చదవండి: AP: హెచ్ఆర్సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం -
‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు
న్యూఢిల్లీ: రైల్వేలో భారీ ఈ –టికెట్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు దీన్ని ఛేదించిన రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘దొడ్డిదారిన ఈ టికెట్ల విక్రయం జరుగుతున్నట్లుగా అనుమానం రావడంతో గత ఏడాది ‘ఆపరేషన్ థండర్‌స్టార్మ్’పేరుతో దర్యాప్తు ప్రారంభించాం. ఈ సందర్భంగా గులాం ముస్తాఫా(28) పేరు బయటకు వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇతడు 2015 నుంచి ఈ దందా నడుపుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఇతడిని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నాం. ఇతని వద్ద ఐఆర్సీటీసీకి చెందిన 563 మంది గుర్తింపుకార్డులు లభించాయి. వీటి ద్వారా ఇతడు టికెట్లను బుక్ చేసేవాడు. వచ్చిన డబ్బును బ్యాంకు అకౌంట్లకు మళ్లించేవాడు. ఇందుకు సంబంధించి ఇతని వద్ద 3,000 అకౌంట్ల వివరాలు లభించాయి. దీంతోపాటు ఇతని వద్ద రెండు ల్యాప్‌టాప్‌లలో ఏఎన్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దీంతో సాధారణ యూజర్ల కంటే వేగంగా టికెట్లను బుక్ చేయవచ్చు. వచ్చిన డబ్బును డార్క్‌నెట్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మారుస్తాడు. ఆ కరెన్సీని మనీ ల్యాండరింగ్‌కు, ఉగ్రసంస్థలకు సాయం అందించేందుకు వాడుతున్నట్లు మా అనుమానం’ అని డీజీ వెల్లడించారు. ‘పాక్‌కు చెందిన తబ్లిక్–ఇ–జమాత్ అనే ఉగ్రసంస్థతోనూ, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్, ఇంకా గల్ఫ్ దేశాల వారితో ఇతనికి సంబంధాలున్నట్లు ల్యాప్‌టాప్‌ల్లో సమాచారంతో తేలింది. అతని వద్ద నకిలీ పాన్, ఆధార్ కార్డులను తయారు చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఇతని గ్రూప్ నుంచి డబ్బు అందుకునే సాఫ్ట్వేర్ కంపెనీ మనీల్యాండరింగ్ కు పాల్పడుతోంది. దీనిపై సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’అని డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ‘గురూజీ అనే పేరుగల సాంకేతిక నిపుణుడికి ముస్తాఫా ఇటీవల రూ.13 లక్షలు అందించాడు. తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ గురూజీ యుగోస్లావియా వీపీఎన్ వాడుతున్నాడు. ఈ ముఠా నడిపే అవయవ వ్యాపారం దందాలో భాగంగా వివిధ ఆస్పత్రులకు గురూజీ చికిత్సల పేరుతో బంగ్లాదేశ్ వాసులను పంపిస్తున్నాడు. ఈ రాకెట్ ద్వారా నెలకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నాం’అని వివరించారు. దుబాయ్‌లో సూత్రధారి ఈ టికెట్ రాకెట్‌కు మాస్టర్‌మైండ్ హమీద్ అష్రాఫ్. 2019 జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ స్కూల్ ఆవరణలో బాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి. ఈ ఘటనలో అరెస్టయిన ఇతడు బెయిల్‌పై బయటకు వచ్చి, నేపాల్ మీదుగా దుబాయ్‌కి పరారయ్యాడు. పది రోజులుగా ఇంటలి జెన్స్ బ్యూరో, స్పెషల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కర్ణాటక పోలీసులు ముస్తాఫాను విచారణ చేస్తున్నారు. ముస్తాఫా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. -
రైల్వే ఈ–టికెట్లపై సర్వీస్ బాదుడు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే ఈ –టికెట్లు మరింత భారం కానున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ –టికెట్లపై సర్వీస్ చార్జీల వసూలు తిరిగి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఒక్కో టికెట్‌పై నాన్ ఏసీ కైతే రూ.15, అదే ఏసీ తరగతులకైతే ఫస్ట్‌క్లాస్‌తో కలిపి రూ.30 చొప్పున అదనంగా వసూలు చేయనున్నట్లు ఐఆర్సీటీసీ ఆగస్టు 30వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్ చార్జీకి జీఎస్టీ అదనం కానుంది. ప్రజలను డిజిటల్ పేమెంట్స్ వైపు ప్రోత్సహించేందుకు మూడేళ్ల క్రితం కేంద్రం సర్వీస్ చార్జీలను రద్దు చేసింది. అంతకు పూర్వం, ఒక్కో టికెట్‌పై నాన్ ఏసీకైతే రూ.20, ఏసీ తరగతులకైతే రూ.40 చొప్పున సర్వీస్ చార్జీ ఉండేది. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జీలను పునరుద్ధరించేందుకు ఆగస్టు మొదటి వారంలో సమావేశమైన రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. సర్వీస్ చార్జీల రద్దు తాత్కాలికమేనని, రైల్వే శాఖ తిరిగి వీటిని ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఆర్థిక శాఖ అప్పట్లోనే చెప్పిందని కూడా రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, సర్వీస్ చార్జీల రద్దు కారణంగా 2016–17 సంవత్సరాల కాలంలో రైల్వే శాఖకు ఆన్లైన్ టికెట్లపై వచ్చే ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు తెలిపారు. -
రైల్వే కీలక నిర్ణయం
-
రైల్వే శాఖ కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: గ్రీన్ ఇనీషియేటివ్‌లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్‌కు సంబంధించిన చార్ట్‌ను ఇకపై రైల్వే కోచ్‌లపై అతికించడాన్ని నిలిపివేయనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ పద్ధతిని నిలిపివేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే, సీల్దా స్టేషన్లో గత మూడు నెలలుగా ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిని ఏ1, ఏ రైల్వేస్టేషన్లలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలలపాటు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ప్రపంచంలోని అతి పెద్ద నెట్వర్క్ భారతీయ రైల్వే పేపర్‌కోసం అవుతున్న డబ్బును ఆదా చేయాలని లక్ష్యంగాపెట్టుకుంది. ఇప్పటికే ఈ పద్ధతిని అమలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు అన్ని రైల్వేలలో ఆరు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రిజర్వేషన్ చార్ట్‌లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్లో మెరుగు పరుస్తామని రైల్వే శాఖ తెలిపింది. డిజిటలైజేషన్లో భాగంగా ఇ-టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగిత రహిత కార్యకలాపాలను ప్రోత్సహించాలనే యోచనలో భాగంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో సంవత్సరానికి 28టన్నుల పేపర్‌ను ఆదా చేయడంతో పాటు రూ.1.70లక్షల ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది. కాగా ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా, రైల్వేలు దాని స్టేషన్లను ఏ, ఏ1, బీ,సీ,డీ, ఈ, ఎఫ్ మొత్తం 7 కేటగిరీలుగా విభజించింది. ఇందులో 17 జోన్లు ఉన్నాయి. -
నాగార్జునకొండకు ఈ–టికెటింగ్ ప్రారంభం
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను సందర్శించే పర్యాటకులు ఈ– టిక్కెటింగ్ పొందేందుకు స్థానిక లాంచీస్టేషన్లో సోమవారం కౌంటర్‌ను హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ అనీల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని అన్ని మ్యూజియమ్స్ సందర్శించేందుకు ఈ కౌంటర్ ద్వారా సులభతరంగా వేగవంతంగా పర్యాటకులు టికెట్స్ పొందవచ్చన్నారు. స్థానిక లాంచీస్టేషన్ వద్ద సెల్‌ఫోన్ ద్వారా బార్కోడ్ స్కాన్ చేసిన తరువాత పర్యాటకుల కొండ ప్రవేశం జరుగుతుందని తెలిపారు. ఎనిమిది మంది సిబ్బందిని ఔట్æసోర్సింగ్ ద్వారా ఆన్లైన్ కౌంటర్ల నియమించామని చెప్పారు. నాగార్జునకొండ మ్యూజియంలో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయటం లేదని విలేకర్లు ప్రశ్నించగా కొండపైనున్న ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడుతుండటంతో విద్యుత్ సమస్య వస్తుందన్నారు. మరో ట్రాన్స్ఫార్మర్కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా కొండపైనున్న మ్యూజియంకు వెళ్లి పనులను పర్యవేక్షించాలన్నారు. దేశంలోని అన్ని మ్యూజియంలలో క్యూరేటర్ సమస్య ఉందని, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీనికి ముందు ఆయన కొండను, మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ దేవేంద్రనాథ్ బోయి, సర్వేయర్ ప్రశాంత్, సీఏ డాకారెడ్డి, అసిస్టెంట్ సీఏ వెంకటయ్య, మ్యూజియం ఇన్చార్జి బసవ గోపాలరత్నం, మ్యూజియం సిబ్బంది ఉన్నారు. -
సందర్శకుల సౌకర్యార్థం ఈ-టికెట్
న్యూఢిల్లీ : తాజ్‌మహల్, హుమాయన్ సమాధిని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఈ టికెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. పెలైట్ ప్రాజెక్టుకింద శుక్రవారం ఈ టికెట్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. పరిశుభ్రత ఉద్యమం, మెరుగైన ఆస్పత్రుల నిర్వహణ, పర్యాటక రంగ అభివృద్ధిని ప్రజలు కోరుకొంటున్నారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. భారత్‌కు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే హెల్ప్‌లైన్ నంబర్ రెండు భాషల్లో(హిందీ-ఇంగ్లిష్) 6 లైన్లు అందుబాటులో ఉంచామని అన్నారు. అంతర్జాతీయ భాషలైన జర్మనీ, రష్యా,ఫ్రెంచ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తాజ్‌మహల్, హుమాయన్ సమాధి సందర్శన టిక్కెట్లను 90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. సందర్శకులను మూడు కేటగిరీలు విభజించారు. విదేశీ పర్యాటకులు, సార్క్ సందర్శకులు, దేశీయ సందర్శకులుగా విభజించారు.అదేవిధంగా ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాల గురించి బ్రెయిలీ లిపిలో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.