
న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే ఈ –టికెట్లు మరింత భారం కానున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ –టికెట్లపై సర్వీస్ చార్జీల వసూలు తిరిగి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఒక్కో టికెట్‌పై నాన్ ఏసీ కైతే రూ.15, అదే ఏసీ తరగతులకైతే ఫస్ట్‌క్లాస్‌తో కలిపి రూ.30 చొప్పున అదనంగా వసూలు చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఆగస్టు 30వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్ చార్జీకి జీఎస్టీ అదనం కానుంది. ప్రజలను డిజిటల్ పేమెంట్స్ వైపు ప్రోత్సహించేందుకు మూడేళ్ల క్రితం కేంద్రం సర్వీస్ చార్జీలను రద్దు చేసింది.
అంతకు పూర్వం, ఒక్కో టికెట్‌పై నాన్ ఏసీకైతే రూ.20, ఏసీ తరగతులకైతే రూ.40 చొప్పున సర్వీస్ చార్జీ ఉండేది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జీలను పునరుద్ధరించేందుకు ఆగస్టు మొదటి వారంలో సమావేశమైన రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. సర్వీస్ చార్జీల రద్దు తాత్కాలికమేనని, రైల్వే శాఖ తిరిగి వీటిని ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఆర్థిక శాఖ అప్పట్లోనే చెప్పిందని కూడా రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, సర్వీస్ చార్జీల రద్దు కారణంగా 2016–17 సంవత్సరాల కాలంలో రైల్వే శాఖకు ఆన్‌లైన్ టికెట్లపై వచ్చే ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు తెలిపారు.