earth quake waves
-
జమ్ము కశ్మీర్లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం
జమ్ము కశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9, 4.8గా నమోదైంది.జమ్ము కశ్మీర్లో సంభవించిన భూకంపాలకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే బారాముల్లాలో సంభవించిన భూకంపం నుండి ప్రాణాల్ని కాపాడుకునేందుకు భవనంపై నుండి దూకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం బారాముల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి వైద్య సేవలందిస్తున్నారు. VIDEO | Tremors of an earthquake with a magnitude of 4.8 felt in Jammu and Kashmir earlier today. Visuals from Baramulla.#earthquake pic.twitter.com/8zbcMySOC6— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
కాళ్ల కింద నేల కదులుతోంది
చిన్న వర్షం వస్తుంది, అంతలోనే ఎగువ నుంచి మన్ను ఉప్పెనలా ముంచుకొస్తుంది. అడ్డొచ్చిన ఇళ్లు, మనుషులను కబళిస్తుంది. ఒక్కోసారి వర్షం రాకుండానే ఈ ఉపద్రవాలు జరుగుతుంటాయి. మన్ను,బండరాళ్లు జారిపడి తరచూ కట్టడాలు, రహదారులు ధ్వంసం కావడం కొడగు, మల్నాడు జిల్లాల్లో మామూలు విషయంగా మారింది. వర్షాలు జోరందుకోవడంతో మళ్లీ మట్టి చరియల విపత్తు పొంచి ఉంది. హుబ్లీ: కాళ్ల కింది భూమి కదిలిపోతోంది. చిన్న వర్షం వచ్చినా, రాకపోయినా నేల కుదించుకుపోతూ ప్రాణ ఆస్తి నష్టాలకు గురిచేస్తోంది. దశాబ్దకాలంగా నైరుత్య కర్ణాటకలోని మల్నాడు జిల్లాల్లో మట్టి చరియలు జారిపడడం, ఇళ్లు, మనుషులను ముంచేస్తుండడం, ప్రత్యేకించి వర్షాకాలం వస్తుండగానే ఈ పెనుముప్పు ఆరంభమవుతోంది. దీంతో కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, హాసన్ జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఎత్తైన కొండలు, మట్టి దిబ్బల దిగువన వందలాది ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు మట్టి చరియలు జారిపడే బెడద క్షణక్షణం వెంటాడుతోంది. భూ ప్రకంపనలు సైతం ఓ మోస్తరు వర్షం తాకిడికి మట్టి పొరలు వదులై కింది ప్రాంతం వైపు జారుతూ అది పెద్ద విపత్తు అవుతున్నాయి. 2009లో వర్షాకాలంలో ఉత్తర కన్నడ జిల్లాలో ఒకేరోజు 20 చోట్ల మట్టిచరియలు కూలినట్లు నమోదైంది. 19 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. పులి మీద పుట్రలా కొడగు తదితర ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు మట్టి చరియలు కూలడానికి మరింత కారణమవుతున్నాయి. మానవుల చర్యలూ కారణమే పశ్చిమ కనుమల్లో భాగమైన కొడగు, చిక్కమగళూరు తదితర జిల్లాల్లో మట్టితో కూడిన పెద్ద పెద్ద పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టుగా ఉంటున్నాయి. అపురూపమైన వన్యప్రాణి సంపద కూడా ఈ ప్రాంతాల సొత్తు. ఫలితంగా ఏటా లక్షలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి వస్తుంటారు. ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందేకొద్దీ కొత్త కొత్త ప్రాంతాలకు నిర్మాణాలు విస్తరించాయి. అడవులను, పల్లపుప్రాంతాలను చదును చేసి రిసార్టులు, భవనాలు తదితరాలను నిర్మిస్తూ వచ్చారు. ఒకప్పుడు అడవులు, పొదలతో కూడిన ప్రాంతాలు ఇప్పుడు జనావాసాలుగా మారాయి. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో మట్టి చరియలు కూలినప్పుడల్లా అది ప్రాణ ఆస్తి నష్టానికి దారితీస్తూ సంచలనాత్మకమవుతోంది. ఇక్కడ ఎక్కువగా కుండపోత వర్షాలు కురవడం, మట్టితో కూడిన పర్వతాలు, బలహీనమైన నేల స్వభావం, మానవుల చర్యలు వంటివి కూడా దోహదం చేస్తున్నాయి. నిపుణుల అధ్యయనాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ, పర్యావరణ ఉన్నతాధికారులతో పాటు ఇస్రో, ఐఐఎస్సీకి చెందిన నిపుణులు ఉన్నారు. కొడగు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎందుకు చరియలు కూలుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఇటీవలే ఈ సమితి సీఎం యడియూరప్పకు నివేదికను అందజేసినప్పటికీ మళ్లీ వర్షాకాలం రావడం, కరోనా లాక్డౌన్ వల్ల అమలు అనేది ఆలస్యమవుతోంది. తరచూ ప్రమాదాలు రాష్ట్ర అటవీ– పర్యావరణ, జీవ వైవిధ్య మండలి ఈ సమస్యపై అధ్యయనం చేసినప్పటికీ, కారణాలను, పరిష్కారాలను కనుగొనడం దుర్లభంగా మారింది. ఐదురోజుల కిందట మంగళూరు వద్ద మట్టి చరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రెండేళ్ల కిందట కొడగు జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తినప్పుడు పదుల సంఖ్యలో మట్టిచరియలు కూలిన దుర్ఘటనలు జరిగాయి. ఒక సంఘటనలో ఏడుగురికిపైగా మృత్యువాత పడగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద భవనాలు సైతం మట్టి చరియల తాకిడికి తలకిందులయ్యాయి. -
ఎక్కడో బద్దలైతే ఇక్కడ కంపిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: వేల మైళ్ల దూరంలో అగ్నిపర్వతం బద్దలైతే మన దగ్గర భూమి కంపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూప్రకంపనలకు అదే కారణమన్న విషయాన్ని కొట్టిపారేయలేమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఆ ప్రభావం కారణంగా కంపనాలు చోటుచేసుకోవచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగం విశ్రాంత అధిపతి ప్రొఫెసర్ జి.రాందాస్ అభిప్రాయపడుతున్నారు. ‘కచ్చితంగా అదే కారణం అని చెప్పలేకున్నా.. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూఅంతర్భాగంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమై భూ పొరల్లో చలనం ఏర్పడుతుంది. దీంతో భూ ఫలకాలు కదిలి పరస్పరం ఢీకొని ప్రకంపనలు జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించిన ప్రకంపనలకు అది కారణం కాదని కూడా చెప్పలేం’అని పేర్కొన్నారు. క్వారీ పేలుళ్ల వల్ల మాత్రం ఈ ప్రకంపనలు ఏర్పడలేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రమాదమేమీ కాదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు భూకంప ప్రభావిత ప్రాంత పరిధిలో ఉన్నాయి. కానీ, ప్రమాదకర జోన్లో మాత్రం లేవు. ప్రస్తుతం భూమి కంపించిన ప్రధాన ప్రాంతమైన సూర్యాపేట పరిసరాలు సహా తెలంగాణ పరిధి భూకంప ప్రభావం అంతగా లేని రెండో జోన్ పరిధిలో ఉండగా, ఏపీ ప్రాంతం రెండో జోన్లో, విజయవాడ పరిసరాలు లాంటి కొన్ని ప్రాంతాలు మూడో జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ, ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు కావటం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇంత తీవ్రతతో భూమి కంపించలేదు. జోన్ పరిధి మారనుందా.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రమాదం కాని జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ తాజా ప్రకంపనలు కొంత శక్తిమంతమైనవే. అంత తీవ్రతతో మళ్లీ కొన్నిసార్లు ప్రకంపనలు వస్తే మాత్రం కచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గుర్తించాల్సి ఉంటుంది. ప్రమాదం తరచూ సంభవించదు. కానీ ఉన్నట్టుండి భారీ ప్రకంపనలు చోటు చేసుకుంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అలా అని భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. మళ్లీ ఆ స్థాయి ప్రకంపనలు తక్కువ సమయంలో పలుసార్లు ఏర్పడితేనే ఆందోళన చెందాలి. అమరావతి వైపు వస్తే భారీ నష్టమే.. ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా వెల్లటూరు కేంద్రంగా ఏర్పడ్డ భూ ప్రకంపనలు తెలంగాణ వైపు ప్రభావం చూపాయి. కానీ, ప్రకంపనల దిశ అమరావతి వైపు ఉండి ఉంటే అక్కడ కచ్చితంగా నష్టం జరిగి ఉండేది. ఇక్కడ నమోదైన 4.7 ప్రభావం అమరావతి పరిసరాల్లో ఏర్పడితే భవనాలు కూలి ఉండేవి. తెలంగాణ వైపు గట్టి నేల ఉండటంతో పాటు, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తుతో భూమి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఏర్పడి ఉంది. భూమి పొరల్లో కలిగిన మార్పులే దీనికి కారణం. అవి భూకంప తరంగాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రకృతిసిద్ధ ఏర్పాటు అమరావతివైపు లేదు. ఫలితంగా ప్రకంపనల ప్రభావం తగ్గదు. సాధారణంగా రిక్టర్‌స్కేల్‌పై 4 నమోదైతే భారీ నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీ ప్రమాదకర 4వ జోన్ పరిధిలో ఉన్నా, అక్కడి నేల గట్టిది. ఫలితంగా ఢిల్లీ కంటే విజయవాడ పరిసరాలే ప్రమాదకరంగా మారతాయి. అప్పుడే హెచ్చరించారు ఎన్జీఆర్ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త చడ్డా గతంలోనే విజయవాడ పరిసరాలపై భూకంప ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చని హెచ్చరించారు. గరిష్టంగా రిక్టర్‌స్కేల్‌పై 6.5 వరకు నమోదయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. కానీ అది ఎప్పుడోతప్ప నమోదయ్యే అవకాశం లేదన్నారు. నదీ సంగమాల ప్రభావం కూడా ప్రకంపనాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుందని, మూసీ–కృష్ణా సంగమం ఉండే సూర్యాపేట జిల్లా పరిధిలో భూగర్భంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కృష్ణాతీరం కూడా దీనికి మినహాయింపు కాదు. మేం వజ్రాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పరిశోధన జరిపినప్పుడు, భూమి పొరల్లో భారీ పగుళ్లున్న విషయాన్ని గుర్తించాం. భూగర్భంలోని కోర్ ప్రాంతంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమైనప్పుడు అది ఈ పగుళ్ల నుంచే వెలుపలికి వస్తుంది. అది ప్రకంపనలకు అవకాశం ఇస్తుంది. విజయవాడ చుట్టు ఇలాంటి భారీ పగుళ్లు దాదాపు 22 వరకు ఉన్నట్టు గతంలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడవైపు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన బోరు తవ్వకాలు మంచిది కాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల కోసం 1,200 నుంచి 2 వేల అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. అలాగే నీటి ప్రవాహానికి ఉన్న సహజసిద్ధ మార్గాలను మూసేస్తున్నారు. ఈ రెండు చర్యలు భూమి పొరల్లో మార్పులకు కారణమవుతాయి. అవి కూడా భూకంపాలకు అవకాశం కలిగించొచ్చు. ఈ తీరును నిరోధించే చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఎప్పటికైనా ప్రమాదాలు తప్పవు. -
భూమి కంపించింది
సాక్షి నెట్వర్క్: అంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. పడుకున్న తమను ఎవరో కదిపినట్లుగా అనిపించింది. దీంతో ఏం జరుగుతుందోనని తెలియక జనం ఇళ్ల నుంచి పరుగు పరుగున బయటకు వచ్చారు. అనంతరం ఇది భూకంపం అని తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రకంపనలకు సంబంధించి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాతవెల్లటూరును భూకంప కేంద్రంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లవారుజామున సరిగ్గా 2.37 గంటల నుంచి 6 సెకన్లపాటు భూమి కంపించినట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్‌లో నమోదైందని తెలిపారు. భూమి పొరల్లో జరిగిన సర్దుబాట్ల ఫలితంగా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. 7 కిలోమీటర్ల లోతులో కంపన కేంద్రం.. వెల్లటూరు వద్ద (పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం) ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్‌లో తెల్లవారుజామున 2.37 గంటల తర్వాత 6 సెకన్లపాటు భూమి కంపించినట్లు రికార్డయ్యింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. భూమి పొరల్లో 7 కిలోమీటర్ల లోతులో ఉన్న భూకంప నాభి కేంద్రం నుంచి తరంగాలు వచ్చాయి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న గుడిమల్కాపురం, దొండపాడు, అడ్లూరు, శోభనాద్రిగూడెం, మల్లారెడ్డిగూడెం గ్రామంలో కంపన తరంగాలు భీకర శబ్ధంతో వచ్చాయి. తరంగాల ప్రభావం సుమారు 150 కిలోమీటర్లకు పైగా వెళ్లింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం, ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూమి కంపించింది. అయితే కంపన కేంద్రం వద్ద తరంగాల తీవ్రత ఎక్కువ ఉండటంతో వెల్లటూరు, నార్లబోడులోని ఇళ్లకు బీటలు పడ్డాయి. అంతటా కలకలం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా భూకంపం కలకలం రేపింది. ఏదో జరుగుతుందని ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు తెల్లవారే వరకు ఇళ్లలోకి వెళ్లలేదు. గతంలో కన్నా భీకర శబ్ధాలు ఎక్కువగా రావడంతో చింతలపాలెం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లోని ప్రజలకు కునుకు పట్టలేదు. సమాచారం తెలుసుకున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ తన బృందంతో చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెంలో సమావేశం ఏర్పాటు చేసి భూకంపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భూ కంపాలు వచ్చినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు. ఆయన వెంట ఎన్జీఆర్ఐ సాంకేతిక బృందంతోపాటు కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్ ఉన్నారు. నెల రోజుల్లో 300 సార్లు.. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెలరోజులుగా భూమి కంపిస్తోంది. భూకంపనాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇది భూకంప మా..? లేక ఇక్కడ ఉన్న మైనింగ్ తవ్వకాల వల్ల ఇలా జరుగుతుందా..? అనే విషయం చర్చించుకుంటున్నారు. అయితే ఒక్కోరోజు పదుల సంఖ్యలో కంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనతో ఈ నెల 12న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు కృష్ణానదికి అవతల ఉన్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈ నెల 12 నాటి నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ కంపనాల తీవ్రత 2.5 దాటలేదు. రాష్ట్రంలో 1969 జూలై 13న భద్రాచలం సమీపంలో వచ్చిన భూకంప తీవ్రత వెల్లటూరు కన్నా తక్కువగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాను తాకిన కంపనాలు భూ ప్రకంపనలు ఖమ్మం జిల్లాలోని 3 మండలాలను తాకాయి. జిల్లాలోని చింతకాని, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 2.37 గంటలకు సమయంలో ఒక్కసారిగా భూమి 3 సెకన్ల పాటు కంపించింది. భూ ప్రకంపనల సమయంలో శబ్ధంతో ఇళ్లలో ఉన్న వస్తువులు కదులుతూ ఉండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా ఐదేళ్ల కిందట జనవరి 26న రాత్రి చింతకాని మండలంలో ఇలాగే స్వల్పం గా భూ ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. చింతకాని మండలంలోని నాగులవంచ, మత్కేపల్లి, చినమండవ, పాతర్లపాడు, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, చింతకాని, జగన్నాథపురం, గాంధీనగర్‌కాలనీ, రామకృష్ణాపురం, కొదుమూరు, లచ్చగూడెం గ్రామాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ముదిగొండ మండలంలోని గంధశిరి, బాణాపురం, వల్లబి, మాధాపురం గ్రామాల్లో భూమి కంపించినట్లు చెప్పారు. అలాగే కూసుమంచి మండలంలోని కేశ్వాపురం, అగ్రమారం, నేలపట్ల, జీళ్లచెరువు, కూసుమంచి, గట్టుసింగారం, గోరీలపాడుతండా తదితర గ్రామాల్లో భూమి కంపిచినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఓరుగల్లులో కంపించిన భూమి.. ఉమ్మడి వరంగల్ పరిధి ధర్మసాగర్ మండల కేంద్రం, దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంతోపాటు పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు నుంచి మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గ్రామంలోని పలు ఇళ్లలో కొన్ని వస్తువులు కదిలినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే పరకాల పట్టణంలోని గండ్రవాడ, హరితనగర్ ప్రాంతాల్లో భూమి కంపించిందని కాలనీవాసులు తెలిపారు. ఏపీలోను ప్రకంపనలు ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. నగరంలోనూ భూప్రకంపనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే నమోదైంది. బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి ప్రజలు ఆందోళన చెందొద్దు రాతిపొరల్లో ఒత్తిడి వల్ల భూకంపాలు వస్తున్నాయి. ఇలా నిత్యం రావచ్చు.. రాకపోవచ్చు. ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల నుంచి బయటకు రావాలి. వెల్లటూరు వద్ద భూకంపన కేంద్రంగా గుర్తించాం. ఇక్కడ దీని తీవ్రత 4.6గా ఉంది. ఈ తరంగాలు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు వెళ్లాయి. ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. – నగేశ్, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త హైదరాబాద్‌కు ప్రమాదం లేదు హైదరాబాద్‌కు 150 నుంచి 200 కి.మీల దూరంలో చోటుచేసుకున్న భూప్రకంపనలు వల్ల నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రదీప్ రామన్‌చర్ల తెలిపారు. అయితే ఆయా ప్రాంతాలతోపాటు అన్ని చోట్లా ఇళ్ల నిర్మాణానికి ఫౌండేషన్ వేసేప్పుడు విధిగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేసుకొని నిర్మాణం చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని సూచించారు. అదేవిధంగా ఇంటి నిర్మాణం చేసిన తర్వాత గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్ ఇచ్చేప్పుడు విధిగా షేర్వాల్ నిర్మాణం చేసుకోవడం తప్పనిసరని ఇళ్ల నిర్మాణదారులు గుర్తించాలన్నారు. ఇలాంటి సూచనలన్నీ నేషనల్ బిల్డింగ్ కోడ్‌లో స్పష్టంగా పేర్కొన్నారని, వాటిని విధిగా పాటించి ఇళ్ల నిర్మాణం చేయాలన్నారు. ఇక్కడ కూడా చాలావరకు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారని, వాటిల్లో కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్‌కు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలన్నారు. – ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ రిజిస్ట్రార్, ప్రదీప్ రామన్‌చర్ల -
భూకంప ముప్పులో బెజవాడ!
సాక్షి, అమరావతి : బెజవాడ భూకంప ముప్పు ప్రభావిత ప్రాంతంలో ఉంది. అంతేకాదు.. విజయవాడకు సమీపంలో ఉన్న రాజధాని అమరావతి ప్రాంతంపై కూడా ఈ భూకంప ప్రభావం ఉండనుంది. ఈ విషయం ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చి సెంటర్ (ఈఈఆర్‌సీ), ఎర్త్‌క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్ (ఈడీఆర్‌ఐ)ల సంయుక్త నివేదికలో తాజాగా వెల్లడయింది. దేశంలో అత్యధికంగా భూకంపాలకు గురయ్యే 50 పట్టణాల్లో విజయవాడ కూడా ఉందని పేర్కొంది. విజయవాడ నగరం కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉండడం, భూకంపాలకు ఆస్కారమిచ్చే నేల స్వభావం ఉండడం, బోర్ల వినియోగం అధికం కావడం వంటి కారణాలు భూకంప ముప్పుకు దోహదం చేస్తున్నాయని తేల్చింది. మున్ముందు భారీ కట్టడాలు, ఆకాశ హార్మోమ్యలతో ప్రమాద తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని, అందువల్ల అలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించింది. తాజా నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం విజయవాడ.. భూకంప ప్రభావిత (సెస్మిక్) మండలాల జోన్–3 పరిధిలో ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న బెజవాడ సముద్ర మట్టానికి 39 అడుగుల ఎత్తులో ఉంది. విజయవాడ పరిసరాల్లోని 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున లోపభూయిష్టమైన నియో టెక్టానిక్ ప్లేట్లు విస్తరించి ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఇదివరకే గుర్తించింది. భూకంపాలకు నేల స్వభావం ఎక్కువ కారణమవుతుంది. విజయవాడ ప్రాంతంలో 58 శాతం భూమి నల్ల పత్తి నేలతోపాటు బంకమట్టి, ఇసుక, ఒండ్రుమట్టి కలిగిన తేలికపాటి నేల స్వభావం ఉంది. వీటిలో దక్షిణ ప్రాంతాల్లో బంకమట్టి 2 నుంచి 8 మీటర్లు, తూర్పు ప్రాంతంలో 5 నుంచి 8 మీటర్ల లోతు వరకు ఉంది. భూగర్భంలో నగరానికి ఉత్తర, పశ్చిమాల్లో క్రిస్టల్ లైన్, ఈశాన్యంలో గోండ్వానా, సాండ్ స్టోన్స్, కోస్టల్ అల్లూవియల్ (తీర ఒండ్రు) రకం రాళ్లున్నాయి. నగర పరిధిలో కానూరు, ఎనికేపాడు వంటి ప్రాంతాల్లో బోరుబావులు అవసరానికి మించి (15–20 మీటర్ల దిగువకు) తవ్వారు. ఇవన్నీ వెరసి విజయవాడను భూకంప ప్రభావిత జాబితాలో చేర్చాయి. భూకంపం వస్తే కృష్ణా నదికి దక్షిణాన ఉన్న మంగళగిరి, తూర్పు వైపున ఉన్న పోరంకి వరకు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని గుర్తించారు. పర్యావరణ సమతుల్యత పాటించని పక్షంలో విజయవాడలో భవిష్యత్తులో ఏటా భూకంపాల ఆస్కారం ఉందని హెచ్చరించారు. 6 మ్యాగ్నిట్యూడ్‌లు దాటితే పెనుముప్పు విజయవాడలో తొమ్మిది వేలకు పైగా అపార్ట్మెంట్లున్నాయి. ఇవి మూడు నుంచి తొమ్మిది అంతస్తుల్లో నిర్మించి ఉన్నాయి. భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్‌పై 6 మ్యాగ్నిట్యూడ్‌లకు మించి తీవ్రత నమోదైతే వీటిలో 80 శాతం బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలతోపాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుంది. అయితే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఢిల్లీ, పాట్నా నగరాలకంటే మన బెజవాడ ఒకింత సేఫ్ జోన్లోనే ఉందని ఈఈఆర్‌సీ, ఈడీఆర్‌ఐల నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. బెజవాడలో 170 వరకు భూకంపాలు విజయవాడ పరిసరాల్లో 1861 నుంచి ఇప్పటిదాకా 170 వరకు భూకంపాలు/ ప్రకంపనలు సంభవించినట్టు వివిధ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇందులో రిక్టర్ స్కేల్‌పై 3.7 నుంచి 6 మ్యాగ్నిట్యూడ్‌ల వరకే నమోదైంది. అయితే వీటిలో తేలికపాటి ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం వాటిల్లలేదు. బెజవాడలో వచ్చిన భూకంపాల్లో కొన్ని.. ఎప్పుడు రిక్టర్ స్కేల్ జులై 1861 3.7 జనవరి 1862 3.7 జూన్ 1984 3.0 మే 2009 6.0 మే 2014 6.0 ఏప్రిల్ 2015 5.0 మే 2015 5.0 ఇవీ సూచనలు.. భవిష్యత్‌లో విజయవాడలో భూకంపాలు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఈఈఆర్‌సీ, ఈడీఆర్‌ఐ నిపుణులు సూచించారు. అవి.. ►భూకంప తీవ్రతను తట్టుకునే ఆధునిక సాంకేతికతతో భవన నిర్మాణాలు చేపట్టాలి. ► బహుళ అంతస్తుల నిర్మాణాలను నిలువరించాలి. ► బోర్ల తవ్వకాలను నియంత్రించాలి. ► దీనిపై స్థానిక సంస్థలు, బిల్డర్లు, పరిశోధకులు బాధ్యత తీసుకోవాలి. ► సంబంధికులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అవగాహన పెంచాలి. ► డిజాస్టర్ మేనేజిమెంట్ ప్లాన్‌ను కార్యాచరణలోకి తేవాలి. -
జమ్మూ కశ్మీర్లో భూకంపం..!
జమ్మూ కశ్మీర్లో గురువారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 4.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. మర్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లేటెస్ట్ ‘డెడ్’లైన్ నవంబర్ 19
సాక్షి,న్యూఢిల్లీ: భూమి అంతమవుతుందని కౌంట్‌డౌన్‌లతో బెంబెలెత్తించే కాన్స్పిరెసీ థీరియస్ట్‌లు ఈసారి మహా విపత్తుకు ముహుర్తం నవంబర్ 19 అంటూ బాంబు పేల్చారు. ఆ రోజుతో భూమి అంతమవుతుందని లెక్కలు కట్టారు. గతంలో డేవ్ మీడ్ సెప్టెంబర్ 23న భూమి అంతమవుతుందని జోస్యం చెప్పాడు. బైబిల్ ప్రకారం చూసినా, న్యూమరాజికల్‌గా చెప్పుకున్నా సెప్టెంబర్ 23న మహా విధ్వంసం తప్పదని అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్‌కు చెప్పారు. ఈ జోస్యం పెద్దఎత్తున ప్రచారమైంది. అయితే సెప్టెంబర్ 23న ఎలాంటి సునామీ చోటుచేసుకోలేదు. ఇక ఏడు సంవత్సరాల వరుస ప్రకృతి విపత్తుల తర్వాత అక్టోబర్ 15న ప్రపంచ వినాశనం తప్పదని డేవ్ మీడ్ తదుపరి డెడ్‌లైన్ ఇచ్చాడు.అయితే ఆ రోజు అతిమామూలుగా గడిచిపోయింది. నిబిరు సిద్ధాంతం ఆధారంగా తాము లెక్కగట్టిన తేదీలు తప్పిపోయినా మరోసారి అలాంటిదేమీ ఉండదని నవంబర్ 19న మహా విధ్వంసం తప్పదని, భూమి అంతం తథ్యమని తాజా డెడ్‌లైన్ ప్రకటించేశారు. నవంబర్ 19న ‘నిబిరు’గప్పిన నిప్పులా భారీ భూకంపాలు ప్రపంచాన్ని అంతం చేస్తాయని వాషింగ్టన్ పోస్ట్‌లో డేవ్ మీడ్ చెప్పారు. గత కొద్దినెలలుగా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలు ఈ మహా ప్రకంపనలకు సంకేతాలుగా కాన్స్పిరెసీ థీరియస్టులు చెబుతున్నట్టు పలు వెబ్సైట్లు కథనాలతో హోరెత్తిస్తున్నాయి. సెస్మిక్ కార్యకలాపాలు పెచ్చుమీరి బ్లాక్‌స్టార్ (నిబిరుకు మరోపేరు) చక్రాలు సోలార్ వ్యవస్థలో చురుకుగా కదులుతూ గ్రహాలను తారుమారు చేస్తాయని మరో రచయిత టెరాల్ క్రాఫ్ట్ రాబోయే ప్రళయాన్ని విశ్లేషించారు. -
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దాంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్లనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందులోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు విద్యుత్ లేక అంధకారంలో మునిగిపోయాయి. ఈ సమయంలో హఠాత్తుగా భూమి కంపించడంతో నెల్లూరు జిల్లా వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే వర్షం బీభత్సానికి అల్లాడిపోతున్న ప్రజలకు భూకంపం రావడంతో భయాందోళనలకు గురయ్యారు.