బెర్లిన్ గోడను కూల్చింది ఈ రోజే..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లకుండా, రాకుండా నిర్మించిన 96 మైళ్ల బెర్లిన్ గోడ్ను కూల్చేందుకు పూనుకున్నది నేడే. అంటే 1989, నవంబర్ 9వ తేదీ నాడు. ఆ గోడను కూలగొట్టడానికి మూడు రోజులు పట్టింది. అది కూలిన మరుక్షణం నుంచే తూర్పు జర్మనీ ప్రజలు తండోపతండాలుగా దాదాపు 30 లక్షల మంది పశ్చిమ జర్మనీ వెళ్లారు. మరో మూడు రోజుల్లోనే వారిలో ఎక్కువ మంది వెనక్కి తిరిగి వచ్చారు.
తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు ప్రభుత్వం, పశ్చిమ జర్మనీలో మితవాద ప్రభుత్వం ఉండడంతో ఇరు దేశాల మధ్య అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొని ఉండేవి. ఆర్థికంగా వెనకబడిన తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు పాలకులు కఠిన చట్టాలను అమలు చేస్తుండడంతో అక్కడి ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందిన పశ్చిమ జర్మనీకి వలసలు పోయేవారు. రానురాను ఈ వలసలు మరీ ఎక్కువవడంతో జర్మనీ డెమోక్రటిక్ రిపబ్లిక్గా పిలిచే తూర్పు జర్మనీ ప్రభుత్వం రెండు దేశాల సరిహద్దులో గోడను కట్టాల్సిందిగా తన సైనికులను ఆదేశించింది.
దాంతో వారు 1961, ఆగస్టు 13న గోడ నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య 200 రోడ్లను బ్లాక్ చేశారు. బారికేట్లు, తీగలతో మొదలైన 96 మైళ్ల ఈ గోడ ఆ తర్వాత కాంక్రీటు రూపం సంతరించుకుంది. రానురాను తూర్పు జర్మనీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 1989 నాటికి పశ్చిమ జర్మనీతో పోలిస్తే దేశీయ దిగుబడి 40 శాతానికి పడిపోయింది. అదే ఏడాది అక్టోబర్లో అప్పటి రష్యా అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచ్చేవ్, తూర్పు జర్మనీలో పర్యటించగా, ‘గోర్బీ హెల్ప్ అస్, గోర్బీ హెల్ప్ అస్’ జీడీర్ ప్రజలు నినాదాలు చేశారు. ఆ మరుసటి నెలలోనే ప్రజలు బెర్లిన్ గోడను కూల్చేందుకు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ప్రజాగ్రహాన్ని గమనించిన జీడీఆర్ ప్రభుత్వం దేశ పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.