చెరకు సాగు ఇక సులువు!
కణుపులు కత్తిరించి, నాటేసే పరికరాలు అందుబాటులోకి..
వ్యవసాయంతో నేరుగా తమకు సంబంధం లేకపోయినా.. సరైన పరికరాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో సహానుభూతి చెంది పరికరాలు తయారు చేస్తున్న సృజనశీలురు అరుదు. అటువంటి వారిలో మధ్యప్రదేశ్ నర్సింగ్‌పూర్‌కు చెందిన రోషన్‌లాల్ విశ్వకర్మ(47) ఒకరు. చెరకు కణుపులు నరకడానికి ఉపయోగపడే పరికరాన్ని, ట్రాక్టర్ సహాయంతో కణుపులను నాటే పరికరాన్ని ఆయన రూపొందించారు. ఉన్నత పాఠశాలలో ఉద్యోగి అయిన రోషన్‌లాల్ తన వర్క్‌షాప్‌లో వ్యవసాయ పరికరాలకు మరమ్మతు చేస్తూ, పరిశోధన చేస్తుంటాడు. ఇంజనీర్ ఒకరు.. చేతనైతే చెరకు కణుపులను ఒడుపుగా కత్తిరించే పరికరం తయారుచెయ్యి చూద్దాం అని సవాలు విసిరాడు. పట్టుదలతో కృషి చేసిన రోషన్‌లాల్ చెరకు రైతుల సమయాన్ని, డబ్బును, విత్తనాన్ని ఆదా చేసేందుకు ఉపయోగపడే సుగర్కేన్ బడ్ చిప్పర్ను రూపొం దించాడు. ఈ పరికరంలో చెరకు గడను ఉంచి హ్యాండిల్‌తో ఒత్తగానే.. అది చెరకు కణుపులను చెదిరిపోకుండా సున్నితంగా కత్తిరిస్తుంది. తక్కువ సమయంలో విత్తనాన్ని సిద్ధం చేసుకొని నాటుకునేందుకు రైతుకు తోడ్పడుతుంది. చెరకు విత్తనం 70-80 శాతం వరకు ఆదా అవుతుంది. దీనితోపాటు.. ట్రాక్టర్‌కు అమర్చి చెరకు విత్తనం నాటుకునే పరికరాన్ని కూడా రోషన్‌లాల్ ఇటీవల తయారు చేశాడు. ఎకరంలో చెరకు కణుపులను నాటేందుకయ్యే ఖర్చు రూ.6 వేల నుంచి రూ.800కు తగ్గించుకోవడానికి ఈ పరికరం ఉపకరిస్తుంది. వరుసల మధ్య దూరాన్ని మార్చుకోవడానికి వెసులుబాటు ఉండడం విశేషం. సృజనాత్మక పరికరాల రూపకర్తలను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్.) రోషన్‌లాల్ కృషిని గుర్తించింది. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయడంతోపాటు.. మైక్రో వెంచర్ ఇన్నోవేషన్ ఫండ్ కింద సహాయం అందించింది. ‘పల్లెసృజన’ స్వచ్ఛంద సంస్ధ ఈ పరికరాలను మన రైతులకు అందుబాటులో ఉంచింది.
సంప్రదించాల్సిన చిరునామా:
పల్లెసృజన, 67, వాయుపురి, సైనిక్‌పురి పోస్ట్,
సికింద్రాబాద్- 500094
ఫోన్: 040-27111959.
పోగుల గణేశం: 98660 01678