ఎడ్వర్డ్ చెరువులో మృతదేహం
భీమవరం టౌన్ : స్థానిక ఎడ్వర్డు చెరువులో ఒక వ్యక్తి మృత దేహాన్ని వన్‌టౌన్ పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఉబ్బిపోయిన మృత దేహాన్ని చెరువులో నుంచి పోలీసులు వెలికితీశారు. మృతుని జేబులో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు, కుటుంబ సభ్యుల ఫొటో, ఇతర పత్రాల ఆధారంగా అతను ఎవరనేది గుర్తిం చారు. వన్‌టౌన్ ఎస్సై కె.సుధాకరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరపల్లి రామకృష్ణ (45) భీమవరం సత్యవతి నగర్లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గతంలో గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం అతని భార్య కువైట్ వెళుతుంటే వద్దని గొడవపడి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం వెళ్లిపోగా రామకృష్ణ మాత్రం భీమవరంలోనే ఉంటున్నాడు. ఇతను కామెర్ల బారిన పడినా మద్యం మానలేదు. అతను పొరపాటున ఎడ్వర్డు చెరువులో పడడం వల్ల మృతి చెందాడా? వేరే కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నామని ఎస్సై చెప్పారు. చెరువులో మృత దేహం రెండు రోజులుగా ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. అతని భార్యకు సమాచారం అందించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.