ముగిసిన 8వ దశ నామినేషన్ల పర్వం
న్యూఢిల్లీ: వచ్చే నెల 7న జరగనున్న ఎనిమిదవ విడత పోలింగ్‌కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ దశలో సీమాంధ్రలోని 25 స్థానాలు సహా ఏడు రాష్ట్రాల్లోని 64 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో బీహార్‌లో 7, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జమ్మూ కాశ్మీర్లో 2, ఉత్తరప్రదేశ్‌లో 15, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమబెంగాల్లోని 6 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 21 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 23తో ఆఖరు. హిమాచల్‌ప్రదేశ్‌లో చివరి రోజైన శనివారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 52 నామినేషన్లు దాఖలయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి 18 మంది, లడక్ స్థానం నుంచి 9 మంది పోటీలో ఉన్నారు. పశ్చిమబెంగాల్లోని ఆరు స్థానాలకు 79 మంది నామినేషన్లు వేశారు.
వారణాసిలో మోడీపై హిజ్రా పోటీ
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 12న జరిగే తుది విడత పోలింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి. యూపీలో మోడీ పోటీ చేయనున్న వారణాసి స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వారణాసి నుంచి హిజ్రా కమల నామినేషన్ వేశారు. ఎస్పీ తరపున కైలాశ్ చౌరాసియా కూడా నామినేషన్ వేశారు.