the election notification
-
దేశం అనాసక్తి!
గిరాకీలేని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పది రోజుల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ సీటు ఆశించే వారి సంఖ్య ఆ పార్టీలో పరిమితంగా ఉంది. ఎక్కువ మంది నాయకులు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనేక కారణాలు వినపడుతున్నాయి. యూటీఎఫ్ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి కావడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కంటే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఉండటంతో ఈ సీటు కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల సమయానికి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో మొత్తం 12,850 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. గుంటూరులో 6,800 మంది, కృష్ణా జిల్లాలో 6,050 ఉన్నారు. మార్చిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటీవల దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 15,16 తేదీల్లో విడుదల చేయనుంది. 20 తరువాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే ప్రస్తుత ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మళ్లీ పోటీ చేసేం దుకు సమాయత్తం అవుతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తాను చేసిన సేవలను వివరిస్తున్నారు. యూటీఎఫ్ మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన లక్ష్మణరావు మూడోసారి ఇతర వర్గాలను కలుపుకునే యత్నంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే అభిప్రాయం కూడా వినపడుతోంది. ఈ నేపథ్యంలోనే పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, ఆర్‌యూపీపీ, హెచ్ఎంఏ, పీఈటీ తదితర ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓ అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ సీట్లను ఆశించే నాయకుల సంఖ్యకు కొదవ లేదు. గత ఎన్నికల్లో సీటు ఆశించినవారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న సీనియర్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తూ ఈ సీటు కోసం ప్రయత్నించడంలేదు. ఇద్దరు ముగ్గురు నాయకులు తమకే సీటు అని చెప్పుకుంటున్నా, జిల్లా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అభ్యర్థిని ఖరారు చేయలేదని, అధినేత చంద్రబాబు వద్ద ఇంకా చర్చ జరగలేదంటున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో పోటీచేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం గుంటూరులో ఉపాధ్యాయులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి తాను టీడీపీ మద్దతుతో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, పార్టీలోని ముఖ్యుల మద్దతు కూడా తనకు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేసుకుని టీడీపీలోని ముఖ్యులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. సీటు వచ్చినా బరిలో బలమైన అభ్యర్థులు ఉండే అవకాశాలు కనపడటం, ఎన్నికల ఖర్చు కూడా రూ.3 కోట్ల వరకు అయ్యే అవకాశాలు ఉండటం, గెలిచినా ఆ పదవి వల్ల రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే భావన టీడీపీ నేతల్లో ఉండటంతో సీటుకోసం పోటీపడే నేతల సంఖ్య పరిమితమైంది. -
జర సూడరాదె..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘భాయ్ సాబ్... ఎన్నికలు దగ్గర పడ్డాయి. నేను సిట్టింగ్గా ఉన్నందున ఎక్కువ అవసరం ఉంది. మావోన్ని పంపిస్తా. వీలైనంతగా సహకరించు. ఈ ఒక్కసారి సూడాలె...’ - జిల్లాలోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌కు సిట్టింగ్ ఎంపీ విజ్ఞప్తి. ‘అన్నా... జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. ఖర్చు మొత్తం నామీదే పడతాంది. తర్వాత చూసుకుందాం. ఏదైనా పని ఉంటే నేనున్నాగా. వీలైనంత సర్దాలన్నా....’ - నగరంలోని బడా రియల్టర్‌కు ఎమ్మెల్యే ఫోన్ ...రెండు మూడు రోజులుగా జిల్లాలోని బడా కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, రైస్ మిల్లర్లకు ఇలాంటి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజాప్రతినిధుల నుంచి ‘పెద్దలకు’ ఫోన్లు వెల్లు వెత్తుతున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇది సహజమే అయినా.. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఇది త్వరగా మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీకి దిగుతున్న నేతలు నిధుల వేటలో పడ్డారు. సాధారణ ఎన్నికల కోసం పోటీ చేసేవారు ఖర్చుల కోసం ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు ఒకేసారి రావడంతో వీరి ప్రణాళికలు తారుమారయ్యాయి. అదనంగా వచ్చిన ఎన్నికల భారం ఇప్పుడు నియోజకవర్గ నేతలపైనే పడుతోంది. దీంతో వీరు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఎంతో కొంత ఇస్తామని ఒప్పుకున్న వారికి ఫోన్లు చేసి ఇచ్చే మొత్తం పెంచాలని కోరుతున్నారు. గతంలో నిధులు సర్దుబాటు చేసేందుకు నిరాకరించిన వారికి మరోమారు ఫోన్ చేసి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి అస్త్రంగా సర్దుబాటు చేయాల్సిందే అని హెచ్చరికగా చెబుతున్నారు. ఇలాంటి హెచ్చరిక.. డిమాండ్లు ఎక్కువగా అధికార పార్టీ వారి నుంచే వెళ్తున్నాయి. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను, నీటి పారుదల శాఖలో పనులు చేస్తున్న వారికి ఫోన్లు చేస్తున్నారు. స్వయంగా పిలుపించుకుని మాట్లాడుతున్నారు. బేరసారాలు.. హెచ్చరికలు కడిపికొండ రోడ్డు టెండర్లు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రూ.14 కోట్లతో ఓ కాంట్రాక్టర్ టెండరు దక్కించుకున్నారు. అగ్రిమెంట్‌కు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో తాత్కాలికంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార, విపక్ష పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పనిలో కమీషన్ వెతుక్కుంటున్నారు. జిల్లాలోని ఓ ఎంపీ స్వయంగా ఫోన్ చేసి ‘ముందైతే ఓ పది లక్షలు ఇవ్వాలి. ఎన్నికల ఖర్చు ఉంది. రోడ్డు పనులు మొదలయ్యాక తర్వాత చూసుకుందాం’ అంటూ... బేరసారాలకు దిగారు. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పా ర్టీల నేతలు ఎన్నికల నిధుల వేటలో పడ్డారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, భూముల వ్యాపారం చేస్తున్న రియల్టర్లు... వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ఖర్చులు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరగా డబ్బులు ఇవ్వకుంటే... పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని కటువుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఇదే ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నారు. జిల్లాలోని ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల చేతుల్లో గతంలో లేని విధంగా ఇప్పుడు నిత్యం కాగితాలు, ఫైళ్లు ఉంటున్నాయి. ఇవన్నీ రోడ్డు పనులకు సంబంధించి ఫిర్యాదుల కాగితాలేనని వారి సన్నిహితులు చెబుతుండడం గమనార్హం. ఎంతో కొంత ఇస్తున్నాం.. కాంట్రాక్ట్ దక్కించుకుని... పనులు మొదలుపెట్టే ముందే పది శాతం ముట్టజెప్పాల్సి వస్తోందని... అదనంగా ఇప్పుడు ఎన్నికల ఖర్చు వచ్చిపడిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఇచ్చామని, అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలకు పార్టీ ఫండ్ పేరిట మళ్లీ ఏడాదిలోనే పెద్ద డిమాండ్లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా... ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరు ఉన్నా... తమకు పనులు కావాలి కాబట్టి అడిగింత కాకుండా ఎంతోకొంత ఇచ్చి బయటపడుతున్నామని కాంట్రాక్టర్లు, రియల్టర్లు చెబుతున్నారు.