Electrical transformer
-
దాగుడుమూతలు ఆడుకుంటుండగా..
సంగెం: పాఠశాల చివరి పిరియడ్‌లో దాగుడు మూతలు ఆడుకుంటుండగా దాక్కోవడానికి వెళ్లిన ఓ విద్యార్థిని కరెంట్ షాక్‌కు గురై మృతిచెందింది. వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా రామ చంద్రాపురానికి చెందిన లింగాల సంతోష్, అనూష భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం సంతోష్ అత్తగారి ఊరైన తిమ్మాపూర్‌కు వచ్చి జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురు రాజేశ్వరి (11) ఆరో తరగతి, చిన్న కూతురు అక్షయ ఒకటో తరగతి చదువుతున్నారు. కొంత కాలం క్రితం సంతోష్ భార్యాపిల్లలను వదిలి వెళ్లిపోయాడు. దీంతో అనూష తల్లిగారి ఇంట్లోనే ఉంటూ పిల్లలిద్దరిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నది. రోజుమాదిరిగానే రాజేశ్వరి పాఠశాలకు వెళ్లింది. చివరి పిరియడ్‌లో రాజేశ్వరి సహా 10 మంది బాలికలు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. స్టాఫ్‌రూం వెనకాల దాక్కోవ డానికి వెళ్లిన రాజేశ్వరి, అక్కడ విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై గిలగి లా కొట్టుకుంటుండగా ఓ విద్యార్థిని చూసి ఉపాధ్యాయులకు చెప్పింది. దీంతో రాజేశ్వరిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే బాలిక మృతిచెందింది. -
నరకం చూస్తున్న సామాన్యుడు.. సచ్చినా.. మారరా..?
గోల్కొండ: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కల సాకారం కావాలంటే మాత్రం నరకం చూడాల్సిందే.. ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు.. నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులకు లంచాలు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అడుగడుగునా ఇబ్బందులు తప్పవు.. అడిగినంతా ఇచ్చుకుంటే ఇక ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది అన్ని శాఖల అధికారుల తీరు. దీంతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఏ అధికారికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన బిల్డర్లు లంచాలు వారికి అందించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. ♦ అక్రమ నిర్మాణానికి డ్రైనేజీ లైన్ వేయాలన్నా.. తాగునీటి పైప్‌లైన్ అయినా.. ట్రాన్స్ఫార్మర్, మీటర్లు ఇలా ఏది కావాలన్నా బిల్డర్లు అధికారుల జేబుల్లో డబ్బులు కుక్కి.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ లైన్ నుంచి ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు ఇస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ♦ నిర్మాణాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉండే వాటిని ప్రైవేటు వ్యక్తులు పక్కకు తరలించే అవకాశం కల్పిస్తున్నారు. డబ్బులిచ్చుకో.. పనులు చేసుకో.. అంటూ బిల్డర్లకు, భవన యజమానులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ♦ 10 రోజుల క్రితం తేజ కాలనీలో ఓ బిల్డర్లు తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రదేశానికి తరలిస్తుండగా విద్యుదాఘాతానికి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నిర్లక్ష్యంలో విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ♦ పెద్దపెద్ద ప్రమాదకరమైన పనులను దినసరి కూలీలతో చేయిస్తున్నా.. అధికారులు మొద్దు నిద్ర వదలకపోవడంపై స్థానిక కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ముడితే చాలు ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? అని ప్రశి్నస్తున్నారు. ♦ నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచాలు ఇవ్వకపోతే ఒక్క అధికారి కూడా పని చేయడం లేదు. డబ్బులు ఇచ్చే వరకు ఫైల్ పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇంకా కొందరు అధికారులు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారు. ♦ అయ్యా.. సారూ.. అంటూ వారి చుట్టూ తిరుగుతున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. మీటింగులు, విజిట్ అంటూ సొంత పనుల కోసం తిరుగుతున్నారు. కొంత మంది బిల్డర్లు, గుత్తేదారులు ఫోన్లోనే మాట్లాడుకొని ముడుపులు వారి వద్దకే పంపడంతో పనులు చకచకా సాగిపోతున్నాయి. ♦ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయి చాలామంది బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ♦ అన్ని శాఖల్లో ఇదే విధానం కొనసాగుతోంది. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ లైన్ కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సిందే.. విద్యుత్ మీటర్ కోసం క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇస్తే ఎలాంటి అక్రమాలైనా.. సక్రమాలవుతున్నాయి. ♦ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు మార్చడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాలనీల్లో బిల్డర్లు వీటిని పాటించడం లేదు. దీని వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ♦ పలుమార్లు విద్యుత్ స్తంభాలు వేయడానికి, మార్చడానికి బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా దినసరి కూలీలను పెట్టుకుని పనులు కానిస్తున్నారు. తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మార్చడానికి ఓ వ్యక్తి పది రోజుల క్రితం ఓ కూలీలను నియమించుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు కొనసాగించాడు. దీంతో ఆ కూలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ఇది ఎలా పనిచేస్తుందంటే
అందానికే అందం చిరునవ్వు. అది ఎల్లప్పుడూ అహ్లాదంగా ఉండాలంటే.. పెదవుల మధ్య తళతళలాడే పలువరుస ఉండాల్సిందే. గార, పిప్పి, పుచ్చు లాంటి పలు సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా ఆ అందాన్ని కమ్మేస్తుందని బాధపడుతున్నారా? పరిష్కారం కోసం పేస్ట్‌లు, బ్రష్‌లు ఎన్ని మార్చినా.. ఫలితం కనిపించడం లేదని నిట్టూరుస్తున్నారా? అయితే చిత్రంలోని సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడాల్సిందే. ప్రత్యేకమైన ఇంటర్ డెంటల్ హెడ్ కలిగిన ఈ డివైజ్.. సుపీరియర్ సోనిక్ టెక్నాలజీతో పళ్లు, దంతాలను చాలా నీట్‌గా క్లీన్ చేస్తుంది. నిమిషానికి 40 వేల స్ట్రోక్‌లను ఉత్పత్తి చేస్తూ.. సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఈ మెషిన్‌తో పాటు ఐదు స్పెషల్ నైలాన్ డ్యుపోంట్ హెడ్స్ లభిస్తాయి. అవి దంతాల ఆకృతికి సరిపోయే విధంగా రూపొందించడంతో.. క్లీనింగ్ చాలా సులభమవుతుంది. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్, మసాజ్ అనే ఆప్షన్స్‌తో ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. రోజుకు రెండు సార్లు దీన్ని ఉపయోగించడానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలు. నాలుగు గంటల పాటు దీనికి చార్జింగ్ పెడితే.. సుమారు 25 రోజుల పాటు పని చేస్తుంది. ఆన్ చేసిన ప్రతి 30 సెకండ్లకు క్లీన్ చెయ్యాల్సిన ప్రదేశాన్ని మార్చమని అలర్ట్ చేస్తుంది. పైగా 2 నిమిషాల తర్వాత ఆపినా ఆపకపోయినా ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. చివరిగా ఉపయోగించిన మోడ్‌ని గుర్తు చేస్తూ.. తిరిగి ఆన్ చేసినప్పుడు అదే మోడ్‌లో పని చేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ టూల్ కావడంతో.. వినియోగించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. దీని ధర రూ. 15 వందలు. -
ప్రాణాలకు తెగించి.. పేసర్ బిగించి..
స్టేషన్‌ఘన్‌పూర్: ఈ ఫొటో చూస్తే ఎలాంటి ఆధారం లేని నిచ్చెనను కింద ముగ్గురు పట్టుకోగా.. పైకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ లైన్‌పై పనిచేస్తుండటం సర్కస్ ఫీట్లా అనిపిస్తోంది కదా! కానీ ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు తమ విధి నిర్వహణలో మామూలేనని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బస్టాండ్ వెనుక వైపు ప్రాంతంలో ఎస్ఎస్ 86 (100 కేవీ) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్లో సోమవారం పేసర్లు బిగించాల్సి వచ్చింది. అయితే, లైన్ వద్దకు వెళ్లి నిలబడి పనిచేసేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో 12 ఫీట్ల నిచ్చెనను నిటారుగా నిలబెట్టి కింద ముగ్గురు సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత కుమార్ అనే విద్యుత్ కార్మికుడు పైకి ఎక్కి పేసర్లు బిగించాడు. -
షాక్ కొడుతుంది జాగ్రత్త..
సీతంపేట: రెండు రోజుల కిందట లోవగూడ గ్రామానికి చెందిన సవర చిన్నారావు తెగిపడిన విద్యుత్ వైరును చూడకుండా ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి మృతి చెందాడు. అలాగే ముత్యాలుకు చెందిన సవర జమ్మడు అనే గిరిజనుడు కొండపోడు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో పడి ఉన్న విద్యుత్ తీగ లపై చూసుకోకుండా కాలు వేయడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఇటీవల దేవనాపురానికి చెందిన కుండంగి మే డపైకి ఎక్కుతుండగా వాలి ఉన్న విద్యుత్ వైరు పొరపాటున పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. ఇలా ఇదే మండలంలో కాకుండా జిల్లాలోని విద్యుత్ ప్రమాదాలు చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించడానికి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైందంటే విద్యుత్ ప్రమాదాలు మొదలైనట్టే. ఎందుకంటే వర్షాలకు, గాలులకు చెట్లు కొమ్మలు విరగడం, విద్యుత్ తీగలు తెగిపడడం జరుగుతుంటాయి. ఈ సమయంలో వీటిని గమనించకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. మ రోవైపు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఇళ్ల మధ్యనే ఉండడం, వాటికి సరైన రక్షణ ఏర్పాటు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలాగే ట్రాన్స్ఫార్మర్ల మధ్య తుప్పలు ఉండడం, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడడం, పొలాల్లో వేసిన విద్యుత్ తీగలు చేతికందేలా ఉండడం, ఇంటికి సమీపం నుంచే విద్యుత్ తీగలు వెళ్లడం, స్తంభాలు విరిగిపోవడం, ఒరిగిపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడుడు లోటు పాట్లు సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణ ఇలా.. •విద్యుత్ స్తంభాలను తాకకూడదు. •స్తంభాలకు తాకుతూ వెళ్లే టెలిఫోన్, టెలివిజన్ కేబుళ్లు తాకరాదు. •నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. •సబ్‌స్టేషన్ చుట్టూ ఉన్న రక్షణ తీగను పట్టుకోకూడదు. •భవన నిర్మాణం పనుల్లో విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి. •తడి బట్టలు, తడి చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోకూడదు. మరమ్మతులు చేయరాదు. వీటిని చేయవద్దు.. ►ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్తవేయడం. ►సబ్‌స్టేషన్ వారి అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలు ఎక్కడం. ►సొంతంగా ఇంటికి వైరింగ్ చేయడం. ►స్తంభం ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయడం ►విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టడం. ఇంట్లో ఈ జాగ్రత్తలు.. •ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడాలి. •వేడి నీరు ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ పరికరాలు ఉంచకూడదు. •చేతులు తడిగా ఉన్నప్పుడు స్విచ్ లు తాకకూడదు. •స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్‌లను తీయకూడదు. •పిల్లలకు అందేంత ఎత్తులో ప్లగ్గులు ఉంచకూడదు. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్ వైర్లు తెగిపడినా, వాలినా లోకల్‌గా ఎలాంటి రిపేర్లు చేయరాదు. మాకు సమాచారం ఇవ్వాలి లేదంటే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. వెంటనే సమస్య పరిష్కారమవుతుంది. వ్యవసాయ బోర్లకు ఏవైనా పాత సరీ్వస్ వైర్లు ఉంటే వాటిని మార్చుకోవాలి. స్విచ్‌లు వంటివి చూసుకోవాలి. పాతకాలానికి ఎలాంటి వైర్లు ఉన్నా తీసివేయాలి. – బి.సాంబశివరావు, ఈఈ, ట్రాన్స్‌కో -
మహీంద్రా సీఐఈ చేతికి ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్
న్యూఢిల్లీ: ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ కంపెనీని(ఏఈఎల్) వాహన విడిభాగాల సంస్థ, మహీంద్రా సీఐఈ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని మహీంద్రా సీఐఈ వెల్లడించింది. ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్‌లో మొత్తం వాటాను రూ.876 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అండెర్ అరెనాజ తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుతో తాము అల్యూమినియం డై కాస్టింగ్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశిస్తామని చెప్పారాయన. వచ్చే నెల 10లోపు ఈ డీల్ పూర్తవ్వగలదని అంచనా. కాగా, ఎమ్‌సీఐఈ, సీఐఈలతో భాగస్వామ్యం తమ కంపెనీకి మంచి జోరునిస్తుందని ఏఈఎల్ సీఎండీ రిషి బగ్లా చెప్పారు. 1985లో ప్రారంభమైన ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ కంపెనీ అల్యూమినియం డై–కాస్టింగ్ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి ఔరంగాబాద్, పుణే, పంత్‌నగర్‌లలో ఐదు ప్లాంట్లున్నాయి. వీటిలో మొత్తం 3,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్షిక విక్రయాలు రూ.850 కోట్ల మేర ఉన్నాయి. ఇక స్పెయిన్‌కు చెందిన సీఐఈ ఆటోమోటివ్‌లో భాగమైన మహీంద్రా సీఐఈలో మహీంద్రా గ్రూప్‌నకు 11.5 శాతం వాటా ఉంది. -
పేదల రుణాలకు ప‘రేషన్’
వీరయ్య రేషన్‌కార్డులో భార్య, ఇద్దరు పిల్లలతోపాటు మరో ఇద్దరు తమ్ముళ్ల పేర్లు కూడా ఉన్నాయి. వీరయ్య ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీరయ్య తమ్ముడు నిరుద్యోగి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ఇదేమిటని జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో విచారించగా విషయం తెలిసి అవాక్కయ్యూడు. తెల్లరేషన్‌కార్డులో ఉన్న సభ్యుల్లో ఒక్కరు మాత్రమే రుణం పొందడానికి అర్హులని అధికారులు తేల్చారు. 101 జీఓ నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది రుణాలు దక్కక ఇబ్బందుల పాలవుతున్నారు. ► రేషన్‌కార్డులో పేరున్న ఒక్కరికే రుణం ►ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం ►నిబంధనలు కఠినతరం ►తప్పని 101 జీవో కష్టాలు ►నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రుణం ఇక గగనమే కడప రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం గుదిబండ లాంటి జీఓ 101ను తీసుకొచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. స్వయం ఉపాధి కోసం రుణం తీసుకుందామన్నా రేషన్ విధించడం (పరిమితం చేయడం) నిరుపేదల పాలిట శాపంగా మారుతోంది. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అంటే సరే అనుకున్నారు. ఇప్పుడు రుణం కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా అందులో ఒక్కరికి మాత్రమే అవకాశం అని పరిమితులు విధించడం హతాశులను చేస్తోంది. 101 జీఓతో అష్టకష్టాలు 2013-14లో నాటి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల రుణాల మంజూరుకు సంబంధించి 101 జీఓను తీసుకొచ్చింది. ఈ జీఓపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయా వర్గాలకు చెందిన వారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వంలో 101 జీఓ పీడ ఉండదని ఆయా వర్గాలకు చెందిన వారు ఆశించారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పాలకులు ఆ జీఓను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యధాతథం చేశారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల ఉరి! ఈ జీఓ ప్రకారం రుణాలు పొందాలనుకుంటే తెల్లరేషన్‌కార్డు తప్పనిసరి, అలాగే ఆధార్‌కార్డు ఉండాలి. ఇటీవల మీ-సేవ కేంద్రాల నుంచి పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలి. ముఖ్యంగా తెల్లరేషన్కార్డుతోనే అసలు చిక్కు ఎదురవుతోంది. కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నా ఒక్కరు మాత్రమే రుణం పొందడానికి అర్హులు. ఒకవేళ ఆ రేషన్‌కార్డులో ఉన్న మరొకరు రుణం పొందాలంటే మరో ఐదు సంవత్సరాల వరకు ఆగాల్సిందే! ఈ నిబంధనల కారణంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. చాలామందికి ఒక్కరికే రేషన్‌కార్డు పెద్ద కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డు ఒక్కటే ఉండడంతో రుణాలు పొందడానికి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదాహరణకు తల్లీదండ్రులు లేని వారు తమ్ముళ్లు, చెల్లెళ్లు, అన్నా లేక అక్క సంరక్షణలోనే ఉంటున్నారు. వివిధ కారణాల వల్ల వారికి వివాహాలు కాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలా జీవిస్తూ ఒకే తెల్లరేషన్‌కార్డులో సభ్యులై ఉంటున్నారు. ఆ రేషన్‌కార్డులో ఉన్న సభ్యులు ఒకరు వ్యవసాయంపై ఆధారపడగా, మరొకరు చదువుకొని ఉద్యోగం రాక నిరుద్యోగిగా ఉంటున్నారు. అలాంటి వారు రుణం పొందాలంటే కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంలో పొరపాటున తెల్లరేషన్కార్డులోగల మరో వ్యక్తి దరఖాస్తు చేసినప్పటికీ ఆ దరఖాస్తును వెబ్సైట్ స్వీకరించడం లేదు. ఎస్సీల పరిస్థితి దారుణం గతంలో రుణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. అర్హులు ఎంతమంది ఉన్నా లక్ష్యాలు, నిబంధనల ప్రకారం వారందరికీ ఆయా కార్పొరేషన్లు రుణాలు మంజూరు చేసేవి. కొత్త నిబంధనల కారణంగా ఎస్సీ వర్గాలకు చెందిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యుత్ సౌకర్యం కింద గతంలో విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకుని అవి మంజూరైనా ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబంలోని మరొక వ్యక్తి రుణం పొందేవారు. ప్రస్తుతం రేషన్కార్డులోగల వ్యక్తి వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటే అతను లేదా అతని కుటుంబంలోని వ్యక్తి ఏ యూనిట్‌కైనా సరే రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్టీ, బీసీల రుణ దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. బడుగు, బలహీన వర్గాల రుణాల విషయంలో ఆంక్షలు సంకెళ్లు విధించడం తగదని నిరుద్యోగులు వాపోతున్నారు. -
పంటలు ఎండుతున్నా పట్టని గోడు
పట్టెన్నపాలెం (జంగారెడ్డిగూడెం), న్యూస్‌లైన్ : జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంలో సాగునీరు అందక పొగాకు పంట వాడిపోతోంది. ఇటీవల వరుస విపత్తులకు నారు, నాట్లు దెబ్బతిన్నాయి. అయినా.. కష్టనష్టాలకోర్చి రైతులు మరోసారి నాట్లు వేశారు. ఈ పరిస్థితుల్లో పట్టెన్నపాలెంలో బెల్ల రాజారావు బ్యారన్ వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వారం క్రితం కాలిపోయింది. దీంతో పొగాకు తోటలకు సాగునీరు అందటం లేదు. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 12 వ్యవసాయ విద్యుత్ మోటార్ సర్వీస్ కనెక్షన్లు ఉండగా వీటి పరిధిలో 30 మంది రైతులు 120 ఎకరాల్లో పొగాకు పంట వేశారు. ‘విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది.. నీరు లేక పంట ఎండిపోతోంది.. వచ్చి చూడండంటూ’ సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ. 25 వేలు ఖర్చుపెట్టామని, సకాలంలో నీరు అందకపోతే నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ పాడవుతూనే ఉందని, కెపాసిటీ పెంచాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు దండాబత్తులు పాపారావు, దండాబత్తుల చంద్రయ్య, బల్లె రాజారావు, ఆకుల నాగేశ్వరరావు, కర్రెడ్ల ఆంజనేయులు, ఆకుల నాగేశ్వరరావు ‘న్యూస్‌లైన్’ వద్ద వాపోయారు.