షేక్‌పేట్ తేజ కాలనీలో కూలీ ప్రాణాన్ని బలిగొన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
గోల్కొండ: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కల సాకారం కావాలంటే మాత్రం నరకం చూడాల్సిందే.. ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు.. నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులకు లంచాలు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అడుగడుగునా ఇబ్బందులు తప్పవు.. అడిగినంతా ఇచ్చుకుంటే ఇక ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది అన్ని శాఖల అధికారుల తీరు.
దీంతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఏ అధికారికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన బిల్డర్లు లంచాలు వారికి అందించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు.
♦ అక్రమ నిర్మాణానికి డ్రైనేజీ లైన్ వేయాలన్నా.. తాగునీటి పైప్‌లైన్ అయినా.. ట్రాన్స్‌ఫార్మర్, మీటర్లు ఇలా ఏది కావాలన్నా బిల్డర్లు అధికారుల జేబుల్లో డబ్బులు కుక్కి.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ లైన్ నుంచి ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు ఇస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
♦ నిర్మాణాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు అడ్డుగా ఉండే వాటిని ప్రైవేటు వ్యక్తులు పక్కకు తరలించే అవకాశం కల్పిస్తున్నారు. డబ్బులిచ్చుకో.. పనులు చేసుకో.. అంటూ బిల్డర్లకు, భవన యజమానులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు సైతం సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
♦ 10 రోజుల క్రితం తేజ కాలనీలో ఓ బిల్డర్లు తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మరో ప్రదేశానికి తరలిస్తుండగా విద్యుదాఘాతానికి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నిర్లక్ష్యంలో విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
♦ పెద్దపెద్ద ప్రమాదకరమైన పనులను దినసరి కూలీలతో చేయిస్తున్నా.. అధికారులు మొద్దు నిద్ర వదలకపోవడంపై స్థానిక కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ముడితే చాలు ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? అని ప్రశి్నస్తున్నారు.
♦ నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచాలు ఇవ్వకపోతే ఒక్క అధికారి కూడా పని చేయడం లేదు. డబ్బులు ఇచ్చే వరకు ఫైల్ పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇంకా కొందరు అధికారులు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారు.
♦ అయ్యా.. సారూ.. అంటూ వారి చుట్టూ తిరుగుతున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. మీటింగులు, విజిట్ అంటూ సొంత పనుల కోసం తిరుగుతున్నారు. కొంత మంది బిల్డర్లు, గుత్తేదారులు ఫోన్లోనే మాట్లాడుకొని ముడుపులు వారి వద్దకే పంపడంతో పనులు చకచకా సాగిపోతున్నాయి.
♦ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయి చాలామంది బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు.
♦ అన్ని శాఖల్లో ఇదే విధానం కొనసాగుతోంది. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ లైన్ కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సిందే.. విద్యుత్ మీటర్ కోసం క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇస్తే ఎలాంటి అక్రమాలైనా.. సక్రమాలవుతున్నాయి.
♦ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, మినీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ తీగలు మార్చడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాలనీల్లో బిల్డర్లు వీటిని పాటించడం లేదు. దీని వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
♦ పలుమార్లు విద్యుత్ స్తంభాలు వేయడానికి, మార్చడానికి బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా దినసరి కూలీలను పెట్టుకుని పనులు కానిస్తున్నారు. తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే ప్రాంతానికి మార్చడానికి ఓ వ్యక్తి పది రోజుల క్రితం ఓ కూలీలను నియమించుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు కొనసాగించాడు. దీంతో ఆ కూలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment