Electricity Corridor
-
విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే...
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చేసే విద్యుత్ చట్టసవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోబోమని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆర్కే సింగ్ తమ వైఖరిని మళ్లీ వెల్లడించారు. విద్యుత్తు సంస్కరణలపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్కే సింగ్, విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటున్నారని, అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో ఉన్న ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్తు చట్టసవరణ బిల్లు ఉపయోగపడు తుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడుతూ గత నెల లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు చట్టసవరణ బిల్లులో పొందుపరి చిన అంశాలన్నీ ప్రజలకు ప్రయోజనం కలి గించేవే అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా విద్యుత్ పంపిణీ విషయంలో పోటీతత్వం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు తక్కువ ధరల్లోనే మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు. అంతేగాక విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలను ఏరకంగానూ అడ్డుకోవడం లేదని ఆర్కే సింగ్ స్పష్టత ఇచ్చారు. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు కేవలం రైతులకు మాత్రమే కాకుండా, తాము ఇవ్వాలని భావించిన ఏ వర్గానికి అయినా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌తోపాటు సబ్సిడీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరంలేదని ఆర్కేసింగ్ వెల్లడించారు. ఇదీ చదవండి: విద్యుత్తు సామర్థ్యం పెంపునకు కమిటీలు ఏర్పాటు చేయాలి -
హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..
Mentally unstable man climbs electricity tower: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు చేసే పనులు చాలా భయానకంగానూ, ఒక్కొసారి వికృతంగా కూడా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి స్వీట్లు, మొబైల్ ఫోన్ కావలంటూ ఏకంగా విద్యుత్ టవర్ పైకి ఎక్కేశాడు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే.....బీహార్‌లో ముజఫర్‌పూర్ జిల్లాలోని బర్మత్పూర్ గ్రామంలో మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హై ట్రాన్స్మిషన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పైగా వ్యక్తి పైనుంచి మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని కోరడం ఆశ్చర్యంగా కల్గించింది. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాదు ఆ వ్యక్తి హై పవర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్‌లో కూర్చొని అంత ఎత్తు నుంచి కింద పడిపోతానేమో అనే భయం లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా టవర్ ఎక్కాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎప్)ని పిలిపించారు. అయితే స్థానికులు మాత్రం ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చేశాడని చెబుతున్నారు. అయితే అతన్ని కిందకు రప్పించేందుకు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!) -
‘ఛత్తీస్’ విద్యుత్ డౌటే!
* తక్కువకే కరెంట్ ఇస్తామంటూ ధర పెంచేసిన ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ * రూ.2.71 నుంచి రూ.3.14కు, తాజాగా రూ.3.90కు పెంపు * సుంకాలు, ఇతర భారాలు కలిపితే యూనిట్ ధర రూ. 5పైనే * రూ. 3.50-రూ. 4కే మార్కెట్లో లభిస్తున్న విద్యుత్ * ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో ఏటా రూ.750 కోట్ల నుంచి 1,000 కోట్ల భారం! * ధర తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం మీమాంసలో పడింది. తక్కువ ధరకే విద్యుత్ విక్రయిస్తామని తొలుత పేర్కొన్న ఛత్తీస్‌గఢ్ తాజాగా అమాంతంగా ధరను పెంచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. యూని ట్‌కు రూ.2.71 చొప్పున ఈ విద్యుత్‌ను విక్రయిస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ డిస్కం 2015-16లో ఆ రాష్ట్ర ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లోనూ ఇదే ధరను ప్రతిపాదించింది. అయితే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ నియంత్రణ మండలి అప్పట్లో ధరను రూ.3.14కు పెంచి టారీఫ్ ఆర్డర్‌ను జారీ చేసింది. తాజాగా 2016-17కు సంబంధించి జారీ చేసిన టారీఫ్ ఆర్డర్లో ఈఆర్సీ మరోసారి ‘మార్వా’ విద్యుత్ ధరను పెంచేసి రూ.3.90గా ఖరారు చేసింది. మరోవైపు మార్వా విద్యుత్ కేంద్రానికి కేటాయించిన బొగ్గు గని ఉత్పత్తికి సిద్ధం కాకపోవడంతో కేంద్రం మూడేళ్ల కోసం తాత్కాలిక బొగ్గు కేటాయింపులు చేసిన విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. స్థిరవ్యయం రూ.2.70, చర వ్యయం రూ.1.20 కలిపి ‘మార్వా’ విద్యుత్ ధర రూ.3.90 ఉంటుం దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ లెక్కగట్టింది. ఇంధన సర్దుబాటు చార్జీ అదనమని స్పష్టం చేసింది. తాత్కాలిక బొగ్గు విని యోగంతో చర వ్యయం రూ.1.20 నుంచి రూ.1.50కు పెరగనుంది. దీంతో యూనిట్ ధర రూ. 3.90 నుంచి 4.20కు పెరగనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ తరలించేందుకు యూనిట్‌పై చెల్లించాల్సిన 70 పైసల ట్రాన్స్మిషన్ చార్జీలు కలిపితే ఈ ధర రూ.4.90కు చేరనుంది. అదనంగా నీటి చార్జీలు, పెన్షన్లు, గ్రాట్యుటీ, స్టార్టప్ చార్జీలు, విద్యుత్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ పేర్కొనడంతో రాష్ట్రానికి విద్యుత్ వచ్చేసరికి ధర రూ.5 నుంచి రూ. 5.50 మధ్య ఉండనుంది. పునరాలోచన లేదు ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఒప్పందం జరిగింది కాబట్టి పునరాలోచన చేయలేం. పన్నులు, సుంకాలతోపాటు కొన్నింటిని ఛత్తీస్గడ్ రాష్ట్రమే భరించాలని చెప్పాం. రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ అవసరం కావడంతోనే ఈ ఒప్పందం చేసుకున్నాం. - డి.ప్రభాకర్‌రావు, టీ ట్రాన్స్‌కో సీఎండీ మార్కెట్లో ఇంకా తక్కువకే... ప్రస్తుతం మార్కెట్లో రూ.3.50 నుంచి రూ.4 కే విద్యుత్ లభిస్తుండగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు ప్రతి యూనిట్‌పై రూ.1 నుంచి రూ. 1.50 వరకు అధికంగా చెల్లించాల్సి రానుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఏటా కనీసం 750 కోట్ల యూనిట్లను కొనుగోలు చేయాల్సిందే. ఈ లెక్కన ప్రతి యూనిట్‌పై రూపాయి చొప్పున 750 కోట్ల యూనిట్లపై ఏటా రూ.750 కోట్ల నుంచి రూ.1000 అదనపు వ్యయం కానుంది. 12 ఏళ్ల ఒప్పంద కాలంలో కనీసం రూ. 10 వేల కోట్ల భారం పడనుందని అంచనా. ఒక్కసారిగా ధరను ఛత్తీస్‌గఢ్ పెంచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ధరపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సుంకం, ఇతరత్రా పన్నులు, వ్యయభారాలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రమే భరించాలని తేల్చి చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయాన్ని తెలపని ఛత్తీస్‌గఢ్ అధికారులు... మళ్లీ సమావేశానికి వస్తామని చెప్పి వెనుతిరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని వదులుకుంటేనే రాష్ట్రానికి మేలని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వార్దా-మహేశ్వరం మధ్య నిర్మిస్తున్న విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తైనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి రానుంది. -
విద్యుత్‌కు కొత్త దారి!
* వరంగల్-నరోరా-కర్నూలు కారిడార్‌కు టెండర్లు పిలిచిన కేంద్రం * 4,500 మెగావాట్ల సరఫరా సామర్థ్యం.. మూడేళ్ల గడువు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొరతతో సతమతమయ్యే దక్షిణాది రాష్ట్రాల సమస్యను తీర్చేలా కొత్త విద్యుత్ కారిడార్ అందుబాటులోకి రానుంది. మహారాష్ట్రలోని నరోరా నుంచి వరంగల్ వరకు, చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ మీదుగా కర్నూలు వరకు 765 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించనున్నారు. 4,500 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకోగలిగే ఈ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా టెండర్లు పిలిచింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉండగా... ఉత్తరాదిన మిగులు విద్యుత్ ఉంది. కానీ ఉత్తర, దక్షిణ విద్యుత్ సరఫరా గ్రిడ్ల మధ్య సరిపడే స్థాయిలో కారిడార్ (విద్యుత్ సరఫరా వ్యవస్థ) లేక ఆ మిగులు విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాలు దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. దక్షిణాది గ్రిడ్ విద్యుత్ దిగుమతి సామర్థ్యం 9 వేల మెగావాట్లే ఉండడంతో... దీని పరిధిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతోంది. దక్షిణాదిన 2014-15లో 3,270 మెగావాట్ల కొరత ఏర్పడింది. దీనికి తోడు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, గ్యాస్ కొరత వల్ల 2018-19 నాటికి దక్షిణ గ్రిడ్ విద్యుత్ దిగుమతి అవసరాలు 16 వేల మెగావాట్లకు పెరగనున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది గ్రిడ్ బలోపేతం కోసం కేంద్ర విద్యుత్ శాఖ వరంగల్-నరోరా-కర్నూలు గ్రిడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నరోరా నుంచి వరంగల్ వరకు, చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ మీదుగా కర్నూలు వరకు 765 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించనున్నారు. మూడేళ్లలో ఈ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే దక్షిణాది గ్రిడ్ మరో 4,500 మెగావాట్లను దిగుమతి చేసుకోగలదు. అయితే సాధారణంగా అంతర్రాష్ట విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం పనులు ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఎల్)’ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. విద్యుత్ సరఫరా రంగంలో ప్రైవేటు పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వరంగల్-నరోరా-కర్నూలు కారిడార్ పనులకు బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో టెండర్లను ఆహ్వానించింది. మూడేళ్లలో మూడింతలు దక్షిణాది గ్రిడ్ విద్యుత్ దిగుమతి సామర్థ్యం 2019 నాటికి ఏకంగా మూడింతలు పెరిగి 33,000 మెగావాట్లకు చేరనుంది. ప్రస్తుతం దక్షిణాది గ్రిడ్ బయటి నుంచి 9 వేల మెగావాట్లకు మించి విద్యుత్‌ను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. షోలాపూర్-రాయచూర్-కర్నూలు కారిడార్ ద్వారా 4,500 మెగావాట్లు, చందాపూర్-రామగుండం-హైదరాబాద్ కారిడార్ ద్వారా 1,000 మెగావాట్లు, జైపూర్-గాజువాక-విజయవాడ-ఖమ్మం కారిడార్ ద్వారా 1,000 మెగావాట్లు, తాల్చేర్-కోలార్ కారిడార్ ద్వారా 2,500 మెగావాట్ల విద్యుత్ దక్షిణాది గ్రిడ్‌కు దిగుమతి అవుతోంది. అయితే నిర్మాణంలో ఉన్న మరో ఐదు లైన్లు పూర్తయితే 24,000 మెగావాట్ల సామర్థ్యమున్న కారిడార్ అందుబాటులోకి వస్తుంది. దీంతో దక్షిణాది గ్రిడ్ విద్యుత్ దిగుమతి సామర్థ్యం 33 వేల మెగావాట్లకు చేరనుంది. నిర్మాణంలో ఉన్న కొల్హాపూర్-బెంగళూరు లైన్ల ద్వారా ఈ ఏడాది చివరిలో 4,500 మెగావాట్ల దిగుమతి సామర్థ్యం పెరగనుంది. ఇటీవల పనులు ప్రారంభమైన వార్దా-హైదరాబాద్ కారిడార్ 2016 డిసెంబర్ చివరిలోగా పూర్తికావాల్సి ఉంది. దీని ద్వారా 4,500 మె.వా., తాజాగా టెండర్లు పిలిచిన నరోరా-కర్నూలు లైన్ల ద్వారా 4,500మె.వా. సామర్థ్యం జతకానుంది. ఈ కారిడార్ 2019 డిసెంబర్‌లోగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక అంగుల్-కడప లైన్ల ద్వారా 4,500 మె.వా. కారిడార్ 2016 డిసెంబర్ చివరిలోగా, రాయగడ్-పుగలూరు లైన్ల ద్వారా 2018 డిసెంబర్‌లోగా 6,000 మె.వా. కొత్త కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాది విద్యుత్‌పై ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న సమయంలో ఉత్తరాది నుంచి 2,000 మె.వా. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఉత్తర-దక్షిణ గ్రిడ్లను అనుసంధానం చేస్తున్న లైన్లను ఇతర రాష్ట్రాలు ముందే బుక్ చేసుకుని పెట్టుకున్నాయి. ప్రస్తుతం తాల్చేరు-కోలారు లైన్ల ద్వారా తెలంగాణకు 260 మెగావాట్ల ఉత్తరాది విద్యుత్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగితే మళ్లీ కారిడార్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,000 మెగావాట్ల రోజువారీ డిమాండ్ ఉండగా... జెన్కో ద్వారా 2వేల మెగావాట్లు, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 2వేల మె.వా. లభ్యమవుతోంది. మిగతా 2వేల మెగావాట్లను దక్షిణ గ్రిడ్ పరిధిలోని ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.5.50 నుంచి 6 వరకు చెల్లిస్తున్నారు. అదే ఉత్తర గ్రిడ్ నుంచి తీసుకునేందుకు కారిడార్ లభిస్తే యూనిట్ విద్యుత్ రూ.4కే లభించనుంది. -
మళ్లీ విద్యుత్ కారి‘డర్’!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సమస్యలు మళ్లీ ముసురుకుంటున్నాయి! నిరంతర విద్యుత్ సరఫరాను నిలుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నా, సమస్యలు మాత్రం చుట్టుముడుతున్నాయి. అవసరాలకు తగ్గట్లు స్థానికంగా విద్యుదుత్పత్తి లేకున్నా, బయటి రాష్ట్రాల నుంచి కొనుగోళ్ల ద్వారా విద్యుత్ సమస్యను ప్రభుత్వం అధిగమించింది. అయితే, మళ్లీ విద్యుత్ కారిడార్ సమస్య పుట్టుకొస్తోంది. ఇంకోవైపు రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తున్న నాలుగు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో గత మూడు రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. తమిళనాడు గుప్పిట్లో ఉత్తర గ్రిడ్ ఆవిర్భావంతోనే రాష్ట్రం భారీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. దక్షిణాది నుంచి రాష్ట్రానికి విద్యుత్ తెచ్చేందుకు సరిపడా లైన్లు వున్నా, విద్యుత్ లభ్యత లేదు. ఉత్తరాదిన తక్కువ ధరకే లభిస్తున్నా, అక్కడి నుంచి తెచ్చుకోడానికి లైన్లు లేవు. ప్రస్తుతం బయటి నుంచి 2,600 మెగావాట్ల విద్యుత్‌ను తాత్కాలిక ఒప్పందాల ద్వారా రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. అందులో ఉత్తరాది రాష్ట్రాల నుంచి 1,450 మెగావాట్లను, దక్షిణాది నుంచి 700 మెగావాట్లను కొంటోంది. అయితే, ఉత్తరాది నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తున్న కారిడార్‌ను తాజాగా తమిళనాడు ఎగరేసుకుపోయింది. నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్.. ఉత్తరాది గ్రిడ్ నుంచి ఆ రాష్ట్రానికి 1,000 మెగావాట్ల కారిడార్‌ను కేటాయిం చింది. దీంతో ఉత్తరాది నుంచి రాష్ట్రానికి కరెంటు సరఫరా చేస్తున్న మార్గానికి గండిపడినట్లయింది. ప్రస్తుతం ఉత్తరగ్రిడ్లో రాష్ట్రానికి 200 మెగావాట్ల కారిడార్ కేటాయింపులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ కేటాయింపులు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చినా, ఇంకా తమిళనాడు ఆ కారిడార్‌ను వినియోగించుకోలేదు. దీంతో ప్రస్తుతానికి ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా యథాతథంగా జరుగుతోంది. ఒకవేళ తమిళనాడు ఈ కారిడార్‌ను వినియోగంలోకి తెచ్చుకుంటే మాత్రం ఉత్తరాది నుంచి వచ్చే 1,000 మెగావాట్లు నిలిచిపోతుంది. ప్రత్యామ్నాయ అవసరాల కోసం దక్షిణాది గ్రిడ్‌లో కారిడార్ ఉన్నా, అక్కడ విద్యుత్ లభ్యత లేదు. కారిడార్ సమస్య పునరావృతమైతే మాత్రం రాష్ట్రం మళ్లీ గడ్డు పరిస్థితులు చూడాల్సివస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూకుమ్మడిగా బ్రేక్డౌన్లు టి.జెన్కోకు చెందిన రామగుండం బి.థర్మల్ విద్యుత్కేంద్రంతో పాటు రామగుండం ఎన్టీపీసీలోని ఓ యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో అక్కడి నుంచి తెలంగాణ, ఏపీలకు 200 మెగావాట్ల సరఫరా ఆగిపోయింది. ఇదే సమయంలో ఏపీ జెన్కోకు సంబంధించి విజయవాడలోని వీటీపీఎస్‌లోని 3వ యూనిట్ సైతం ఆగిపోవడంతో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ మూడు ప్రాజెక్టుల్లో 410 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోగా, అందులో తెలంగాణకు రావాల్సిన 258 మెగావాట్లకు గండిపడింది. అలాగే విజయవాడలోని థర్మల్ టెక్ పవర్ సంస్థ నుంచి తాత్కాలిక ఒప్పందం ద్వారా రాష్ట్రం 500 మెగావాట్లను కొనుగోలు చేస్తుండగా, సాంకేతిక సమస్యలతో ఈ ప్రాజెక్టు సైతం నిలిచిపోయింది. దీంతో గత మూడు రోజులుగా రాష్ట్రానికి రావాల్సిన 750 మెగావాట్లు నిలిచిపోయింది. ఈ లోటును పూడ్చుకోడానికి తాత్కాలికంగా ఓపెన్ యాక్సెస్ విధానంలో బయటి నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నారు.