Electronic cigarette
-
ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడకం, దిగుమతి, అమ్మకం తదితరాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారం ఆర్డినెన్స్ జారీ చేసింది. వీటిని వినియోగిస్తున్న వారిలో 70 శాతం యువతే ఉండటం, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని తక్షణం అమలులోకి తీసుకువస్తూ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా, దాడులు ముమ్మరం చేశారు. ఫలితంగా మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు తొలి ఈ–సిగరెట్స్ కేసును పట్టుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం అతడిని అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. దీంతో ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు నమోదు చేసిన ఠాణాగా అబిడ్స్ రికార్డులకు ఎక్కనుంది. పాతబస్తీలోని శాలిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ నూర్ ఆరిఫ్ అలీ ఎంజే మార్కెట్లో గుల్నార్స్ పర్ఫూమ్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ–సిగరెట్లను కేంద్రం నిషేధించినా... సుగంధ ద్రవ్యాల ముసుగులో ఈ–సిగరెట్లు, అందులో వినియోగించే ఫ్లేవర్లు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్ దాడి చేశారు. ఆరిఫ్ అలీని అదుపులోకి తీసుకున్న అతడి నుంచి 35 ఈ–సిగరెట్ మిషన్లు, అందులో వాడే ఫ్లేవర్స్ బాటిల్స్ 68 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. ఇక పై నగరంలో ఈ–సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ఆ సిగరెట్టూ వద్దు... e-సిగరెట్టూ వద్దు!
పరిపరి శోధన పొగతాగే దురలవాటు మానేయడానికి కొంతమంది ఎలక్ట్రానిక్ సిగరెట్ (్ఛ-సిగరెట్)ను ఆశ్రయిస్తుంటారు. ఈ-సిగరెట్‌తో అంత ప్రమాదం ఉండదని వారు నమ్ముతుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమేననీ... ఈ-సిగరెట్స్లోనూ ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు, క్యాన్సర్ కారకాలు ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ-సిగరెట్లో ఆరోగ్యాన్ని ధ్వంసం చేయగల 31 రకాల రసాయనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఇందులోని ప్రతి దమ్ములోనూ ప్రొపిలీన్ ఆక్సైడ్, గ్లైసిడాల్ అనే హానికర పదార్థాలు ఒంట్లోకి చేరుతాయి. అంతేకాదు... ఈ-సిగరెట్ పరికరం పాతదవుతున్న కొద్దీ దాంట్లోంచి వెలువడే హానికర పదార్థాలు మరింతగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఒంట్లోకి చేరే ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్, యాక్రోలిన్ అనే హానికారక పదార్థాల మోతాదు పెరుగుతుంటుంది. పైగా బ్యాటరీ ఓల్టేజ్ పెరిగి... పరికరం వేడెక్కుతున్న కొద్దీ హానికారక పదార్థాల తీవ్రత కూడా పెరుగుతూ పోతుంటుంది. ‘‘సాధారణ సిగరెట్ కంటే ఈ-సిగరెట్లో ఊపిరితిత్తులనూ, కళ్లను దెబ్బతీసే ఆక్రోలిన్ అనే పదార్థం ఆరు రెట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ-సిగరెట్లు సురక్షితమైనవని ఈ ఒక్క దాఖలా సరిపోదు. మామూలు సిగరెట్లు పరమ అనారోగ్యకారకాలు అని అనుకుంటే ఈ-సిగరెట్లు అనారోగ్య కారకాలు... అంతేగానీ రెండూ అనారోగ్యానికి దారితీసేవే. అయినా అనారోగ్యం కలిగించే ఒక అలవాటును మానుకోవాలంటే ఇంకో అనారోగ్యపు అలవాటును ఆశ్రయించడం తప్పు కదా’’ అంటున్నారు ఈ-సిగరెట్లపై అధ్యయనం నిర్వహించిన లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీకి చెందిన అధ్యయనాల్లో పాలుపంచుకున్న హ్యూగో డెస్టాయిలేటస్. ఈ పరిశోధన సంస్థ యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తన అధ్యయనాలు నిర్వహిస్తోంది. పొగతాగే దురలవాటుకు దూరం అయి, పొందాల్సిన సంపూర్ణ ఫలితాల కోసం స్మోకింగ్‌ను పూర్తిగా వదిలేయడమే మేలు అంటున్నారు అధ్యయనవేత్తలు.