Electronic Policies
-
ఏసీల తయారీ హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పాలసీ సత్ఫలితాలిస్తోంది. ఈ పాలసీ ఆధారంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన డైకిన్ సంస్థ రాష్ట్రంలోని శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు కోసం 75 ఎకరాలు కొనుగోలు చేసింది. తాజాగా బ్లూస్టార్ సంస్థ శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేసింది. ఈ కార్యక్రమంలో బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్, బ్లూస్టార్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీపీ ముకుంద మీనన్, వైస్ ప్రెసిడెంట్ వి.కసటేకర్, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పాలసీతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని, త్వరలోనే రాష్ట్రం దేశానికి ఏసీ తయారీ హబ్‌గా ఎదగనుందని చెప్పారు. స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణం, చక్కని పారిశ్రామిక విధానంతో పెట్టుబడిదారులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే డైకిన్, బ్లూస్టార్ కంపెనీలు ముందుకురాగా మరో రెండు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపుతున్నట్లు తెలిపారు. ఏసీలు, రిఫ్రిజరేటర్లు వంటి వైట్ గూడ్స్ రంగం ద్వారా రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రముఖ స్వదేశీ బ్లూస్టార్ సంస్థకు దేశంలో ఇది 6వ ఉత్పాదక యూనిట్‌కాగా.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిదని చెప్పారు. శ్రీసిటీ దేశీయ టారిఫ్ జోన్ (డీటీజడ్)లోని 20 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ను దశల వారీగా రూ.540 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ యూనిట్లకు దగ్గరగా ఉంటుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 1,500 మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ఉత్పత్తి బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహక పథకం కింద రాష్ట్రంలో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4 టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా దక్షిణ భారతదేశ అవసరాలను తీర్చనున్నామన్నారు. శ్రీసిటీని తొలిసారి సందర్శించినప్పుడే ఇక్కడి సౌకర్యాలను చూసి యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. -
వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి: సీఎం జగన్
విశాఖ, తిరుపతి, బెంగళూరు సమీపంలో ఏర్పాటు కానున్న ఐటీ కాన్సెప్ట్ సిటీల్లో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి కాన్సెప్ట్ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఆర్కిటెక్చర్ యునిక్‌గా నిర్మాణం కొనసాగించాలి. ఐటీ రంగం అభివృద్ధి చెందేలా వీటిని తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలోని ఏపీకి చెందిన ప్రాంతంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు చోట్ల కనీసం 2 వేల ఎకరాల చొప్పున ఇవి ఏర్పాటయ్యేలా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం చాలా ముఖ్యమని, ఆ లక్ష్య సాధనతో పని చేయాలన్నారు. ఇదంతా ఐటీ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి, ఈ రంగాల పాలసీ ఎలా ఉండాలనే అంశంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలో ఉండాల్సిన అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అన్ని సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలతో కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నెట్ నెట్వర్క్ బలంగా లేకపోతే, అనుకున్న లక్ష్యాలు సాధించలేమని వివరించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నెట్వర్క్ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి – కోవిడ్ లాంటి మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పెరిగింది. ఇకపై కూడా దీనిని ప్రోత్సహించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఏరకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలించి, దాన్ని పాలసీలో పెట్టాలి. – గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ ఇంటర్నెట్తో అనుసంధానం కావాలి. దీంతో పాటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. – వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ పార్కులోకి వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలి. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. రాయితీలు ఉద్యోగాల కల్పనకూ దోహద పడాలి – ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనకు దోహదపడాలి. రాయితీల దుర్వినియోగానికి అసలు ఆస్కారం ఉండరాదు. – ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి. ఇది ఐటీ ప్రగతికి దోహదపడాలి. రాష్ట్రాభివృద్ధికి సహాయ పడాలి. అన్ని అంశాలపై ఆలోచించి మంచి పాలసీ తీసుకు రావాలి. – ఈ సమీక్షలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్, ఎమర్జింగ్ టెక్నాలజీ వర్సిటీ – విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కుతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. – ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కులో హై ఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ, ఇన్క్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్మెంట్ ఆఫీసు, స్టేట్ డేటా సెంటర్, ఐటీ టవర్స్.. తదితరాలు ఉండాలని స్పష్టం చేశారు. – దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ఈ యూనివర్సిటీ ఉపయోగ పడాలని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఇందు కోసం భవనం కూడా నిర్మించాలి. గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా వసతులు కల్పించాలి. తద్వారా ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్ ఫ్రం హోం) సదుపాయం మెరుగవుతుంది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. రోబోటిక్స్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఎల్రక్టానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్ష్యంగా విశాఖపట్నంలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. -
బీమా మార్కెట్ సెంటిమెంట్‌కు దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ- పాలసీల వల్ల బీమా కంపెనీలకు పాలసీల నిర్వహణ వ్యయం సగానికి సగం తగ్గుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం పాలసీల్లో కనీసం 20 శాతం ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఇండియా ఫస్ట్ లైఫ్ ఎండీ, సీఈవో డాక్టర్ పి.నందగోపాల్ తెలిపారు. ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, లీగల్ అండ్ జనరల్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండియా ఫస్ట్ లైఫ్ ఎండీ నందగోపాల్ హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు....ఈ-పాలసీలపై... ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పాలసీలను అందించడం వల్ల ఇటు బీమా కంపెనీలకూ, అటు పాలసీదారులకూ ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఒక పాలసీ డాక్యుమెంట్‌ను కాగితం రూపంలో భద్రపర్చడానికి ఏటా రూ.150-200 వరకు ఖర్చవుతోంది. అదే ఎలక్ట్రానిక్ రూపంలో అయితే ఈ వ్యయం ప్రారంభంలో రూ.75-100కి తగ్గి, ఆ తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. పాత పథకాలను కూడా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవచ్చు. బీమా పాలసీల కోసం ఎలక్ట్రానిక్ అకౌంట్ ప్రారంభిస్తే ఇక ప్రతి పాలసీకీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పాలసీ డాక్యుమెంట్లు అన్నీ ఆన్లైన్లో పూర్తి భద్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఇండియా ఫస్ట్‌లో 14 లక్షల మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 15 నుంచి 20% ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుత మార్కెట్ గురించి.. వ్యక్తిగత జీవిత బీమాతో పోలిస్తే కార్పొరేట్ బీమా రంగం ఆశాజనకంగా ఉంది. వ్యక్తిగత బీమాలో వ్యాపార అవకాశాలున్నా మార్కెట్ సెంటిమెంట్ బాగా దెబ్బతింది. వృద్ధిరేటు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం వంటి ప్రభావాలు జీవిత బీమా వ్యాపారంపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటును నమోదు చేయగలం. కొత్త నిబంధనలకు రెడీనా... అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న కొత్త జీవిత బీమా మార్గదర్శకాలను అమలు చేయడానికి మేం పూర్తి సిద్ధంగా ఉన్నాం. కాని ఈ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన అన్ని కంపెనీలకు చెందిన 300 పథకాలు అనుమతి కోసం నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పది రోజుల్లో ఇన్ని పథకాలకు అనుమతి మంజూరు చేయడమనేది ఐఆర్డీఏకి సాధ్యమయ్యే పనికాదని అనుకుంటున్నా. మా కంపెనీ విషయానికి వస్తే 15 పథకాలకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. వచ్చే 15 రోజుల్లో వీటికి అనుమతులు వస్తాయని భావిస్తున్నా. మొత్తం మీద చూస్తే అక్టోబర్ నుంచి అమలు చేయాలన్న నిబంధనలను మరికొంత కాలం వాయిదా వేయడం ద్వారా వీటిని అమలు చేయడానికి కంపెనీలు సిద్ధం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది.