విశాఖ, తిరుపతి, బెంగళూరు సమీపంలో ఏర్పాటు కానున్న ఐటీ కాన్సెప్ట్ సిటీల్లో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి కాన్సెప్ట్ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఆర్కిటెక్చర్ యునిక్‌గా నిర్మాణం కొనసాగించాలి. ఐటీ రంగం అభివృద్ధి చెందేలా వీటిని తీర్చిదిద్దాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలోని ఏపీకి చెందిన ప్రాంతంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు చోట్ల కనీసం 2 వేల ఎకరాల చొప్పున ఇవి ఏర్పాటయ్యేలా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం చాలా ముఖ్యమని, ఆ లక్ష్య సాధనతో పని చేయాలన్నారు. ఇదంతా ఐటీ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి, ఈ రంగాల పాలసీ ఎలా ఉండాలనే అంశంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలో ఉండాల్సిన అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అన్ని సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలతో కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నెట్ నెట్‌వర్క్ బలంగా లేకపోతే, అనుకున్న లక్ష్యాలు సాధించలేమని వివరించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు
వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి
– కోవిడ్ లాంటి మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పెరిగింది. ఇకపై కూడా దీనిని ప్రోత్సహించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఏరకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలించి, దాన్ని పాలసీలో పెట్టాలి.
– గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలి. దీంతో పాటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి.
– వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ పార్కులోకి వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలి. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టాలి.
రాయితీలు ఉద్యోగాల కల్పనకూ దోహద పడాలి
– ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనకు దోహదపడాలి. రాయితీల దుర్వినియోగానికి అసలు ఆస్కారం ఉండరాదు.
– ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి. ఇది ఐటీ ప్రగతికి దోహదపడాలి. రాష్ట్రాభివృద్ధికి సహాయ పడాలి. అన్ని అంశాలపై ఆలోచించి మంచి పాలసీ తీసుకు రావాలి.
– ఈ సమీక్షలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్, ఎమర్జింగ్ టెక్నాలజీ వర్సిటీ
– విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కుతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
– ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కులో హై ఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ, ఇన్‌క్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్ ఆఫీసు, స్టేట్ డేటా సెంటర్, ఐటీ టవర్స్.. తదితరాలు ఉండాలని స్పష్టం చేశారు.
– దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ఈ యూనివర్సిటీ ఉపయోగ పడాలని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని సూచించారు.
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఇందు కోసం భవనం కూడా నిర్మించాలి. గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా వసతులు కల్పించాలి. తద్వారా ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్ ఫ్రం హోం) సదుపాయం మెరుగవుతుంది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
రోబోటిక్స్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్ ఎల్రక్టానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్ష్యంగా విశాఖపట్నంలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment