ఊళ్లలోకి వస్తున్న గజరాజులు, చిరుతలు... ఎక్కడంటే ?
సాక్షి, తిరుపతి: శేషాచలం అడవుల్లో చిరుతపులులు.. కౌండిన్య అడవుల్లో ఏనుగుల సంతతి పెరిగింది. మరోవైపు వలస వచ్చే ఏనుగుల గుంపులు అధికమయ్యాయి. దారితెలియక కొన్ని, ఆహారం కోసం మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి ఉచ్చులు, కరెంటు తీగలకు బలవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో శేషాచలం, కౌండిన్య అడవులు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ఈ అడవుల్లో చిరుతపులులు, ఏనుగులతోపాటు వివిధ రకాల వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. వాతావరణం అనుకూలించటం, ఆహారం సమృద్ధిగా దొరుకుతుండటంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అడవుల్లో నుంచి చిత్తూరు జిల్లాలోని అడవుల్లోకి వస్తున్నాయి. దీంతో చిరుతపులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రెండేళ్ల కిందట 20 నుంచి 30 లోపున్న చిరుతపులులు ఇప్పుడు 50కి చేరినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. శేషాచలంలో జింక, దుప్పి, కణుజు, కొండగొర్రెల సంతతి భాగా పెరిగింది. వీటికోసం చిరుతపులులు నల్లమల నుంచి శేషాచలం బాట పట్టాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు.
చిరుతల సంచారం
ఆహార అన్వేషణలో భాగంగా శేషాచలం వచ్చిన కొన్ని చిరుతపులులు దారితెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముఖ్యంగా ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి మంగళం ప్రాంతాల్లో అనేకసార్లు చిరుతపులులు కనిపించాయి. వారం కిందట ఎర్రావారిపాలెం మండలం కోటకాడపల్లిలో స్థానికులు వేసిన ఉచ్చులో చిక్కి ఒక చిరుతపులి మృతిచెందింది. ఏడాది కిందట ఎర్రావారిపాలెంలోకి ఓ చిరుతపులి వచ్చివెళ్లింది.
వలస ఏనుగులతో బెంబేలు
జిల్లాలోని పడమటి ప్రాంతంలో విస్తరించి ఉన్న కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటికే ఏనుగుల సంతతి అనూహ్యంగా పెరిగింది. గతంలో 30 నుంచి 40 మధ్యలో ఉన్న ఏనుగుల సంఖ్య ప్రస్తుతం 60కి చేరింది. వీటితోపాటు తమిళనాడులోని క్రిష్ణగిరి, కర్ణాటక ప్రాంతంలోని 26 ఏనుగులతో కూడిన గుంపు మైసూరు అటవీ ప్రాంతాల నుంచి కావేరిపట్నం మీదుగా వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో సేదతీరి, అక్కడినుంచి గుడుపల్లి, పలమనేరు ప్రాంతాల్లో జనావాసాల్లోకి వస్తున్నాయి. విడివిడిగా వచ్చిన ఏనుగులు ఒక్కటయ్యాయి. వీటిలో ఒక ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. గున్న ఏనుగు నడచి తిరిగే వరకు ఈ ఏనుగుల గుంపు తిరిగి వెళ్లదని అటవీ అధికారులు చెబుతున్నారు.
తరిమినా ....
ఏనుగుల గుంపు జనావాసాల్లోకి వచ్చి భయాందోళనలకు గురిచేస్తుండటంతో ఇటీవల ఆ గుంపును పక్క రాష్ట్రం సరిహద్దులోని మొర్దన అడవుల్లోకి తరిమారు. కానీ , ఆ గుంపు గున్న ఏనుగు కోసం మళ్లీ కౌండిన్య అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వలస వచ్చిన 26 ఏనుగుల గుంపు వల్లే సరిహద్దు ప్రాంతంలో అలజడి నెలకొందన్నారు. కాగా కౌండిన్య అభయారణ్యంలో గతంలో 6 మగ ఏనుగులు ఉండేవని, విద్యుత్ షాక్‌కుగురై వాటిలో 4 ఏనుగులు మృతి చెందాయని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.
దారితెలియక జనారణ్యంలోకి – మదన్‌మోహన్‌రెడ్డి, ఎఫ్ఆర్వో, కుప్పం
తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతంలోని ఏనుగుల గుంపు కౌండిన్య అభయారణ్యంలోకి వలస వచ్చింది. వాటికి దారి తెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. వీటిని గతంలో మొర్దన ఫారెస్ట్‌లోకి తరిమేశాం. అయితే అవి గున్న ఏనుగు కోసం తిరిగి కౌండిన్యలోకి చొరబడ్డాయి. కౌండిన్య అభయారణ్యంలోనే ఉండే ఏనుగుల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు.
చిరుతపులుల సంతతి రెట్టింపైంది – సుబ్బరాయుడు, ఎఫ్ఆర్వో, తిరుపతి
శేషాచలం అభయారణ్యంలో చిరుతపులల సంతతి రెట్టింపు అయింది. అడవిలో వాటికి అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటమే సంతతి పెరుగుదలకు కారణం. శేషాచలంలో ఆహారం లభ్యం అవుతుండటంతో నల్లమల నుంచి కూడా కొన్ని చిరుతపులులు వచ్చినట్లు ఆనవాళ్లున్నాయి. ఆ పులులే జనారణ్యంలోకి వస్తున్నాయి.