eletricity supply
-
స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో తలపెట్టిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఎటువంటి రుణాలు తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘సాక్షి’కి స్పష్టంచేశాయి. రూ.1,850 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయనడంలో ఎలాంటి నిజంలేదని అవి తేల్చిచెప్పాయి. ‘స్మార్ట్‌గా భారం’ శీర్షికన ‘ఈనాడు’ గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె. సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి గురువారం ఖండించారు. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద అన్ని రాష్ట్రాల్లోనూ మీటర్లను అమర్చుతున్నారని.. అందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు 23 శాతం మీటర్లకు మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లు (స్మార్ట్ మీటర్లు) అమర్చేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేశాయని వారు వివరించారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు అమలుకోసం కొత్తగా ఎలాంటి రుణాలు చేయడంలేదని.. అదే విధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంతవరకూ ఎటువంటి విమర్శలు విద్యుత్ సంస్థల వరకూ రాలేదని వారు తెలిపారు. మీటర్ల నాణ్యతలో రాజీపడకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎండీలు వెల్లడించారు. పారదర్శకంగా టెండర్లు ఇక రాష్ట్రంలో మొత్తం 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు దశల వారీగా స్మార్ట్‌మీటర్లను అమర్చనున్నట్లు సీఎండీలు తెలిపారు. తొలిదశకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలైందని.. ఈ టెండర్ల ప్రక్రియలో కేంద్ర ఇంధన శాఖ రూపొందించిన నిబంధనలను పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలన్నీ అవే నిబంధనల్ని అనుసరిస్తున్నాయని.. దీని ప్రకారం టెండర్లలో పాల్గొనే సంస్థలు కేంద్ర ఇంధన శాఖ ఆమోదం పొందాలన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో నమోదు ప్రక్రియను పూర్తిచేసి ఆమోదం పొందిన 29 సంస్థల వివరాలను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) వెబ్సైట్లో ఉంచారని వారు చెప్పారు. టెండరు నిబంధనలను ఇష్టానుసారం మార్చేందుకు వీల్లేదని వివరించారు. నెలనెలా చెల్లింపులు.. మరోవైపు.. మీటర్ ధర, దాని నిర్వహణకయ్యే ఖర్చును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరంలేదని వారన్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు ఆ మొత్తాన్నీ పదేళ్లపాటు ప్రతినెలా డిస్కంలు చెల్లిస్తాయన్నారు. తొలి విడత మీటర్ల ఏర్పాటుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,658 కోట్లకు, పశ్చిమ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.947 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,508 కోట్లు వ్యయ అంచనాలను రూపొందించి సాంకేతిక, పరిపాలన, డీఆర్సీ, మంత్రిమండలి అనుమతి పొందాయని వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన పత్రాలను న్యాయ సమీక్షకు పంపగా జ్యూడీషియల్ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో టెండర్ ప్రక్రియను ప్రారంభించాయని.. ఈ మొత్తం వ్యయంలో ఎటువంటి భారం వినియోగదారులపై పడదని వారు స్పష్టంచేశారు. కేంద్ర నిబంధనల మేరకే.. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) గతేడాది జూలై 20న ప్రారంభమైంది. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ, వాణిజ్య నష్టాలు 12–15 శాతం తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయడం.. విద్యుత్ పంపిణీ ఫీడర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలనే నిబంధనలు విధించారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పనులు చేపట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు డిస్కంలు ప్రీ పెయిడ్ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ప్రణాళికలను పంపి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాయి. ఈ పథకం కింద డిసెంబర్ 2023లోగా ఏర్పాటుచేసిన ఒక్కో ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్‌కు రూ.900లు గ్రాంట్ రూపంలోనూ, అదనంగా రూ.450లు ఇన్సెటివ్ రూపంలోనూ కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి.. అని సీఎండీలు వివరించారు. డిస్కంలకు, వినియోగదారులకు మేలు నిజానికి.. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిస్కంలకు, వినియోగదారులకు పలు ప్రయోజనాలున్నాయి. ► ముఖ్యంగా ఈ మీటర్ల ద్వారా వినియోగదారుని బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ► విద్యుత్ ఏ సమయాల్లో సరఫరా అవుతోంది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందా లేదా.. అనే సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► ఇక విద్యుత్ బిల్లు కట్టలేదని లైన్మెన్ కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు. ► డిస్కంల పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఆస్కారం దొరుకుతుంది. -
ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వరం ప్రకటించింది. ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. విద్యుత్‌శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నిరుపేద షెడ్యూల్డ్ కులాలకు అండగా నిలవాలని భావించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ వర్గాల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం తాజాగా 101యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీవీలు, ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వినియోగం ఎక్కువైందని భావించిన సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. 101 యూనిట్లకయ్యే విద్యుత్‌చార్జీలను డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఉమ్మడి సర్కిల్ పరిధిలో 26,069 సర్వీసులకు ప్రయోజనం చేకూరనుండగా.. ఇందుకయ్యే నెలకయ్యే రూ.50,60,101 విద్యుత్ చార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది. 26,069 సర్వీసులకు ప్రయోజనం కరీంనగర్ ఉమ్మడి సర్కిల్ పరిధిలోని 26,069 విద్యుత్ సర్వీసులకు ప్రయోజనం చేకూరుతుండగా.. ఇందుకు సంబంధించిన రూ.50,60,101 విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భరించనుంది. ఎస్సీ 24,778 సర్వీసులకు గాను రూ.47,88,299లు, ఎస్టీ 1291 సర్వీసులకు గాను రూ.2,71,802ల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనుంది. ఆదేశాలు రాగానే అమలు: కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను టీఎస్ ఎన్పీడీసీఎల్ నుంచి ఆర్డర్ రాగానే అమలు చేస్తాం. ఇంకా పేర్లు నమోదు చేసుకోని వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధిత ఏఈలకు దరఖాస్తు చేసుకోవాలి. -
24 గంటల విద్యుత్ పట్టణాలకే!
-
24 గంటల విద్యుత్ పట్టణాలకే!
* తొలుత జిల్లా కేంద్రాలు, పట్టణాలకే పరిమితం: మంత్రి రఘునాథ్‌రెడ్డి * వ్యవసాయానికి 7 గంటల విద్యుత్.. మలి దశలో 9 గంటలు చేస్తాం * 2016 మార్చి నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్ సరఫరా * ఐదేళ్లలో 19,055 మెగావాట్ల విద్యుత్‌తో ‘లోటు’ లేని ఏపీయే లక్ష్యం * ‘ఉత్పత్తి’ పెంపులో సహకరించాలని కేంద్ర విద్యుత్మంత్రిని కోరాం * బొగ్గు, గ్యాస్ సరఫరాలు పెంపునకు సానుకూలంగా స్పందించారు * విద్యుత్‌శాఖ మంత్రుల సదస్సు అనంతరం ఏపీ ఐటీ మంత్రి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో గృహావసరాలకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరంత ర విద్యుత్ సరఫరా చేస్తామన్న రాష్ట్ర సర్కారు హామీలు, ప్రకటనలతో.. ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పేర్కొన్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి.. మొదటి విడతలో భాగంగా కేవలం జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలకు మాత్రమే నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత రెండేళ్లలో దశల వారీగా రాష్ట్రంలోని పల్లెలకు నిరంతర విద్యుత్ సరఫరాను విస్తరిస్తామని చెప్పారు. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మలి దశలో సాగుకు విద్యుత్ సరఫరాను 9 గంటలకు పెంచుతామన్నారు. అలాగే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ 2016 మార్చి నాటికి విద్యుత్ సరఫరా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు, నిరంతర విద్యుత్ సరఫరాకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల విద్యుత్‌శాఖల మంత్రుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరఫున రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాదిలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం... ‘‘రాష్ట్రంలో అక్టోబర్ 2 నుంచి గృహాలకు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం అవుతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తాం. సాగు రంగానికి మలి దశలో 9 గంటల విద్యుత్ ఇస్తాం. విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టి వచ్చే ఏడాదిలో దేశంలోనే విద్యుత్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటం, ఐదేళ్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లటం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం’’ అని పల్లె పేర్కొన్నారు. ‘అందరికీ విద్యుత్’ అనే కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, రాజస్థాన్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఏపీలో విద్యుత్ సంస్కరణలతో పాటు, విద్యుత్ లోటును పూడ్చేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ అభినందించినట్లు చెప్పారు. 3 నెలల్లోనే విద్యుత్ లోటు లేకుండా చేశాం.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, మూడు నెలల్లోనే విద్యుత్ ఉత్పాదన పెంచి విద్యుత్ లోటు లేకుండా చేశామని పల్లె చెప్పారు. ఇందుకు రాష్ర్టేతర విద్యుత్ సంస్థల నుంచి 400 మెగావాట్లు, కృష్ణపట్నం పవర్ప్రాజెక్టు నుంచి 800 మెగావాట్లు కలిపి మొత్తం 1,200 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చగల్గినట్టు తెలిపారు. వచ్చే ఏడాది లోగా 2,000 మెగావాట్ల విద్యుత్ కోసం ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికోసం బిడ్డింగ్‌లు పిలిచామన్నారు. అదేవిధంగా రానున్న ఐదేళ్లలో 5,000 మెగావాట్ల సౌర విద్యుత్, 4,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో త్వరలో 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో అనంతపురంలో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయని చెప్పారు. ఎన్టీపీసీ సహకారంతో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాజెక్టునకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకునేందుకు కేంద్ర విద్యుత్శాాఖ మంత్రి రానున్నట్టు వెల్లడించారు. 2016 మార్చి నాటికి అన్ని గ్రామాలకు విద్యుత్... రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేని 2,551 గ్రామాలకు 2016 మార్చి నాటికి విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే 2017 మార్చి నాటికి రాష్ట్రంలో ఆరు లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. విద్యుత్, ఇంధన ఆదాలో భాగంగా గృహాల్లో ఎల్ఈడీ బల్బులు, వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ఐఎస్ఐ ప్రమాణాలు ఉండే పంపుసెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటికీ వినియోగదారుల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ప్రభుత్వమే భ ర్తీ చేసేలా చూస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీజెన్కో ద్వారా 3,850 మెగావాట్లు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 1,040 మెగావాట్లు, సోలార్ ద్వారా 5,030 మెగావాట్లు, పవన విద్యుత్ 4,150, ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లు, సెంట్రల్ పవర్ స్టేషన్ల నుంచి 985 మెగావాట్లతో కలిపి మొత్తం 19,055 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనతో విద్యుత్ లోటు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. మిగులు విద్యుత్ ఉంటే గతంలో చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తామన్నారు. కాగా,రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ సానుకూలంగా స్పందించినట్టు రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, జెన్కో కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు.