స్మార్ట్‌ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!? | Not taken Loans For Installation of Smart Meters: Andhra Pradesh Discoms Clarification | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?

Published Fri, Dec 9 2022 5:29 PM | Last Updated on Fri, Dec 9 2022 5:29 PM

Not taken Loans For Installation of Smart Meters: Andhra Pradesh Discoms Clarification - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో తలపెట్టిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఎటువంటి రుణాలు తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘సాక్షి’కి స్పష్టంచేశాయి. రూ.1,850 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయనడంలో ఎలాంటి నిజంలేదని అవి తేల్చిచెప్పాయి. ‘స్మార్ట్‌గా భారం’ శీర్షికన ‘ఈనాడు’ గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె. సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి గురువారం ఖండించారు. 

పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద అన్ని రాష్ట్రాల్లోనూ మీటర్లను అమర్చుతున్నారని.. అందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలు 23 శాతం మీటర్లకు మాత్రమే ప్రీపెయిడ్‌ మీటర్లు (స్మార్ట్‌ మీటర్లు) అమర్చేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేశాయని వారు వివరించారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు అమలుకోసం కొత్తగా ఎలాంటి రుణాలు చేయడంలేదని.. అదే విధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంతవరకూ ఎటువంటి విమర్శలు విద్యుత్‌ సంస్థల వరకూ రాలేదని వారు తెలిపారు. మీటర్ల నాణ్యతలో రాజీపడకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎండీలు వెల్లడించారు.  

పారదర్శకంగా టెండర్లు 
ఇక రాష్ట్రంలో మొత్తం 1.92 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులకు దశల వారీగా స్మార్ట్‌మీటర్లను అమర్చనున్నట్లు సీఎండీలు తెలిపారు. తొలిదశకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలైందని.. ఈ టెండర్ల ప్రక్రియలో కేంద్ర ఇంధన శాఖ రూపొందించిన నిబంధనలను పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంస్థలన్నీ అవే నిబంధనల్ని అనుసరిస్తున్నాయని.. దీని ప్రకారం టెండర్లలో పాల్గొనే సంస్థలు కేంద్ర ఇంధన శాఖ ఆమోదం పొందాలన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో నమోదు ప్రక్రియను పూర్తిచేసి ఆమోదం పొందిన 29 సంస్థల వివరాలను రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) వెబ్‌సైట్‌లో ఉంచారని వారు చెప్పారు. టెండరు నిబంధనలను ఇష్టానుసారం మార్చేందుకు వీల్లేదని వివరించారు.  

నెలనెలా చెల్లింపులు.. 
మరోవైపు.. మీటర్‌ ధర, దాని నిర్వహణకయ్యే ఖర్చును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరంలేదని వారన్నారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థకు ఆ మొత్తాన్నీ పదేళ్లపాటు ప్రతినెలా డిస్కంలు చెల్లిస్తాయన్నారు. తొలి విడత మీటర్ల ఏర్పాటుకు దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.1,658 కోట్లకు, పశ్చిమ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.947 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.1,508 కోట్లు వ్యయ అంచనాలను రూపొందించి సాంకేతిక, పరిపాలన, డీఆర్సీ, మంత్రిమండలి అనుమతి పొందాయని వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన పత్రాలను న్యాయ సమీక్షకు పంపగా జ్యూడీషియల్‌ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో టెండర్‌ ప్రక్రియను ప్రారంభించాయని.. ఈ మొత్తం వ్యయంలో ఎటువంటి భారం వినియోగదారులపై పడదని వారు స్పష్టంచేశారు.

కేంద్ర నిబంధనల మేరకే.. 
పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) గతేడాది జూలై 20న ప్రారంభమైంది. నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ పంపిణీ, వాణిజ్య నష్టాలు 12–15 శాతం తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయడం.. విద్యుత్‌ పంపిణీ ఫీడర్లకు, ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలనే నిబంధనలు విధించారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఈ పనులు చేపట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు డిస్కంలు ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ప్రణాళికలను పంపి కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాయి. ఈ పథకం కింద డిసెంబర్‌ 2023లోగా ఏర్పాటుచేసిన ఒక్కో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్‌కు రూ.900లు గ్రాంట్‌ రూపంలోనూ, అదనంగా రూ.450లు ఇన్సెటివ్‌ రూపంలోనూ కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి.. అని సీఎండీలు వివరించారు. 

డిస్కంలకు, వినియోగదారులకు మేలు 
నిజానికి.. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిస్కంలకు, వినియోగదారులకు పలు ప్రయోజనాలున్నాయి.  
► ముఖ్యంగా ఈ మీటర్ల ద్వారా వినియోగదారుని బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.  
► బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంది.  
► విద్యుత్‌ ఏ సమయాల్లో సరఫరా అవుతోంది.. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతోందా లేదా.. అనే సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.  
► ఇక విద్యుత్‌ బిల్లు కట్టలేదని లైన్‌మెన్‌ కరెంట్‌ స్తంభం ఎక్కి కరెంట్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు.  
► డిస్కంల పరిధిలో విద్యుత్‌ చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఆస్కారం దొరుకుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement