ఎమ్, ఆమె భర్త, వారి పిల్లలు
కొత్త బంగారం
మహీమ్(ముంబయి)లో ఒక పడగ్గదీ, వంటిల్లూ, హాలూ ఉన్న అపార్టుమెంట్లో గోవా నుంచి వచ్చిన రోమన్ కాథలిక్కులయిన మెండాస్ కుటుంబం నివసిస్తుంది. ఎమెల్డా, ఆగస్టీన్ దంపతులూ, కూతురైన సూసన్, పేరులేని కథకుడైన కొడుకూ. పిల్లలు ముద్దుగా పిలిచే ఎమ్ అన్న తల్లి ఎమెల్డా, కొడుకు పుట్టిన తరువాత, ‘బైపొలార్’ వ్యాధికి గురవడంతో నవల మొదలవుతుంది. తరచూ హాస్పిటల్ పాలవుతూ ఉంటుంది. బిగ్ హుమ్ అనబడే భర్త ఆగస్టీన్ ప్రభుత్వ ఉద్యోగి. ‘ఎమ్ అండ్ ద బిగ్ హుమ్’ నవల, ఆ చిన్న ఇంట్లో పెరిగి పెద్దవుతున్న కొడుకు గొంతుతో వినిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యనున్న దుఃఖం, హాస్యం, ఒకరినొకరు పూర్తిగా అంగీకరించడం, ఎమ్ వల్ల ఆ కుటుంబమే తిరిగి ఛిన్నాభిన్నం అవడాన్నీ సహజంగా చిత్రీకరిస్తారు జెరీ పింటో. నిగ్రహవంతుడైన తండ్రి కుటుంబాన్ని కలిపి ఉంచి– వంటలూ, ఇంటి పనులూ చేస్తుంటాడు.
దంపతుల మధ్య కనపరిచే ప్రేమ మనసును తాకుతుంది. మానసిక రోగం గురించి రచయిత రాసిన మాటలు కవితాత్మకంగా ఉంటాయి. విషాదం కనిపించదు. ఎమ్– టీలు కాస్తూ, బీడీలు పీలుస్తూ, తన శృంగారపు జీవితం గురించి పిల్లలకి చెప్తూ, ఎవరూ అడక్కపోయినప్పటికీ తెలివైన సలహాలిస్తూ ఉంటుంది. తన పిచ్చితనపు దశలో ఉన్నప్పుడు ఆమె సంభాషణ విచిత్రంగా, అసభ్యంగా ఉంటుంది. ఆ సంభాషణలు గుండెని మెలిపెడతాయి. ఆత్మహత్యా ప్రయత్నాలూ చాలానే చేస్తుంది. పాదరసంలా మారే ఎమ్ మనఃస్థితిని అర్థం చేసుకునేటందుకు పూర్తి కుటుంబం నిస్వార్థంగా ప్రయత్నిస్తుంది.
మానసిక రోగానికి గురయ్యే ముందు, తండ్రి హుమ్ ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుని– దుఃఖంలో, విషాదంలో తనకి ఊతగా నిలిచిన ఎమ్ అనే ఈ తన తల్లి ఎవరా? అని కొడుకు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. అతను తల్లి జీవితపు బాటని అనుసరిస్తున్నప్పుడు పాఠకులకి కూడా ఆమె గురించిన వైవిధ్యమైన, అస్పష్ట భావాలు కలుగుతాయి. నవల వర్తమానానికీ, గతానికీ మధ్య చాలా సులభంగా మారుతూ– మానసిక స్థితి సరిగ్గాలేని తల్లితో పాటు ఉండి, పెరిగిపెద్దవుతున్న ఒక కుర్రాడి స్వాభావిక నొప్పిని వర్ణిస్తుంది. ఆ నొప్పికింద సున్నితమైన హాస్యం ఉంది. ఎమ్కి ప్రతీదాన్నీ ఒక భిన్నమైన దృష్టికోణంతో, ఒక వ్యంగ్య ధోరణితో చూసే సామర్థ్యమూ ఉంది.
నవల– ఎమ్ మెదడులో ఉన్న చీకటి భాగాల ద్వారా ప్రయాణిస్తూ, ఇబ్బందికరమైన ప్రశ్నలని సంధిస్తుంది. వాటివల్ల మనం ‘పిచ్చి’ వాళ్ళనబడేవాళ్ళని కొత్త దృష్టికోణంతో చూడగలుగుతాం. పుస్తకం సామాజిక నిబంధనలని ప్రశ్నిస్తుంది. నాటకీయత తక్కువ మోతాదులో ఉన్నది. నవలకున్న బలం దానిలో ఉన్న సూక్ష్మభేదానిది. కథ ఎమ్ వ్యాధి ప్రాధాన్యతను వక్కాణించి చెప్పదు. ఆమెకోసం పిల్లలు చేసే త్యాగాలనీ వర్ణించదు. కథనం సరళంగా, స్ఫుటంగా, హాస్యంగా ఉంటుంది. జర్నలిస్టూ, రచయితా అయిన పింటో రాసిన ఈ నవలకి సాహిత్య అకాడెమీ బహుమతి వచ్చింది. 2012లో అచ్చయిన ఈ పుస్తకానికి ఆయన విండెన్ కేంబెల్ బహుమతి కూడా పొందారు.
- క్రిష్ణవేణి