ఆ ర్యాంకుల్లో మతలబు ఏంటి?
ఎంసెట్–2 లీకేజీపై సీఐడీ ముమ్మర దర్యాప్తు
60 మంది విద్యార్థుల ర్యాంకుల పరిశీలన
విద్యార్థుల స్టేట్మెంట్ను రికార్డు చేయాలని నిర్ణయం
అదుపులో ఇద్దరు బ్రోకర్లు, జాడలేని మరో వ్యక్తి
బ్రోకర్లు, విద్యార్థులను కలిపి విచారించే యోచన
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2 పేపర్ లీకేజీపై దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన అంశాలపై లోతుగా ఆరా తీస్తోంది. జేఎన్టీయూ ఇచ్చిన 60 మంది విద్యార్థుల ర్యాంకుల జాబితాను పూర్తిగా పరిశీలించింది. వారి నుంచి సేకరించే వివరాలను అధికారికంగా నమోదు చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను విచారించేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు వరంగల్, భూపాలపల్లి, పరకాల, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లాయి.
వారు చెప్పే విషయాలన్నింటినీ అధికారులు పక్కాగా రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు బ్రోకర్లుగా చెలామణి అయిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరిని పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వెంకట్రావ్, ఖమ్మంకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీఐడీ ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నాయి. అలాగే కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న మరో బ్రోకర్ రమేశ్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు మరొక బృందం ప్రత్యేకంగా పని చేస్తోంది. విద్యార్థులను, బ్రోకర్లను విడివిడిగా విచారించిన తర్వాత మళ్లీ కలిపి విచారించాలని కూడా సీఐడీ భావిస్తోంది.
విద్యార్థుల ట్రాక్ రికార్డు పరిశీలన
ఎంసెట్–2లో అనూహ్యంగా ర్యాంకులు సాధించిన 60 మంది విద్యార్థుల ట్రాక్ రికార్డును సీఐడీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎంసెట్–1లో తక్కువ మార్కులు వచ్చి ఎంసెట్–2లో అనూహ్యంగా మార్కులు పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేస్తోంది. కాలేజీల్లో జరిగిన పరీక్షల్లో వారు చూపిన ప్రతిభనూ పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొంత మంది విద్యార్థులకు సంబంధించి తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ బాధ్యుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అనుమానిత ర్యాంకులు గల వారు ఎంసెట్–2లో ఇంచుమించు ఒకే విధంగా మార్కులు స్కోర్ చేశారు. వీరికి ఇంటర్ మార్కుల ఆధారంగా మాత్రమే ర్యాంకుల్లో తేడా వచ్చింది. అందరూ 130 నుంచి 140కి మధ్యలోనే మార్కులు సాధించారు. అదెలా సాధ్యమైందనే అంశంపై సీఐడీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
సీఐడీ అదుపులో ఫ్యాకల్టీ సిబ్బంది
ప్రశ్నపత్రాల తయారీ విధానంపై సీఐడీ ప్రధానంగా దృష్టి సారించింది. దళారులు ప్రముఖ విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకునే కొంత మందిని మాత్రమే ఎంపిక చేసుకొని పదేపదే ‘మెడికల్ సీటు గ్యారెంటీ’ అని చెప్పడంలో గల ధీమాపై ఆరా తీస్తోంది. అంతేకాదు కొంతమంది ఫ్యాకల్టీలతో బ్రోకర్లు ఎందుకు సంభాషించారనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కొంత మంది ఫ్యాకల్టీ సిబ్బందిని మంగళవారం రహస్య ప్రాంతంలో విచారించినట్లు సమాచారం.