విన్‌సల్ట్
అవమానం... దారుణాతి దారుణ మానసిక గాయం. ఎంతటి అరివీర భయంకరులకైనా, ఘన విజ్ఞాన సుసంపన్నులకైనా కాలం కలసిరాని సందర్భాలలో అవమానాలు అనివార్యంగా ఎదురవుతుంటాయి. కించపడ్డ వాళ్లు కొంచెమైపోరు గానీ, అవమానం ఎదురైనప్పుడు ఆ భారాన్ని భరించడం సాంత్వన వచనాలు పలికినంత తేలికేమీ కాదు. మానావమానాలకు ఒకేరీతిలో స్పందించే లక్షణాన్ని స్థితప్రజ్ఞ అంటారు. ఇలాంటి స్థితప్రజ్ఞత యోగిపుంగవులు ఏ కొందరికో తప్ప సామాన్య మానవులకు సాధ్యం కాదు. సమ్మానాలకు పొంగిపోవడం, అవమానాలకు కుంగిపోవడం మానవ సహజ లక్షణం.
ఎంతటి వారికైనా జీవితమంతా రాజపూజ్యంగానే గడిచిపోదు. అప్పుడప్పుడు అనుకోని అవమానాలూ ఎదురవుతుంటాయి. తమకు ఎదురైన అవమానాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ప్రతిస్పందిస్తారు. కొందరు మౌనంగా తమలో తామే కుమిలిపోతూ, మానసికంగా కుంగిపోతారు. ఇంకొందరు తమను అవమానించిన వారిపై పగ పెంచుకుని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. చాలా కొద్దిమంది మాత్రమే అవమానాలను సవాలుగా స్వీకరించి, జీవితంలో తమను తాము నిరూపించుకుంటారు. చరిత్రలో ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. వాటిలో మచ్చుకు కొన్ని...
1893 మే... దక్షిణాఫ్రికా
ట్రైన్‌లోని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రిటోరియా వెళుతున్నారు గాంధీజీ. కాసేపటికి అదే బోగీలోకి ఎక్కిన ఒక తెల్లదొర గాంధీజీని చూసి అసహనంతో మొహం చిట్లించాడు. ‘ఛీ... నల్లవాడివి నువ్వు ఫస్ట్‌క్లాస్ బోగీలోకి ఎక్కడమేంటి? వెంటనే దిగేసి జనరల్ బోగీలోకి వెళ్లు’ అంటూ ఈసడించుకున్నాడు. ‘ఫస్ట్‌క్లాస్ టికెట్ కొన్నాకే ఈ బోగీలోకి ఎక్కాను. నేనెందుకు దిగాలి?’.. స్థిరంగా ప్రశ్నించారు గాంధీజీ. ‘మీలాంటి నల్లవాళ్లకు మా తెల్లదొరలతో కలసి ప్రయాణించే అర్హత లేదు... దిగు’ అంటూ గాంధీజీ లగేజీని విసిరేసి, ఆయననూ తోసేశాడు ఆ తెల్లదొర. ఒకవైపు అవమానభారం, మరోవైపు వణికించే చలి... రాత్రంతా అలానే గడిపారు గాంధీజీ.
ఆ అవమానం ఆయనలో ఆలోచన రేపింది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం పోరాడేందుకు ప్రేరణనిచ్చింది. అదే స్ఫూర్తితో భారతదేశానికి తిరిగి వచ్చాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరశంఖాన్ని పూరించేలా చేసింది. జరిగిన అవమానానికి తనలో తానే కుమిలిపోయినా, లేకుంటే తనను ఫస్ట్‌క్లాస్ బోగీలోంచి తోసేసిన తెల్లదొరపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నా గాంధీజీ మహాత్ముడయ్యేవాడు కాదు. పీటర్మెరిట్స్బర్గ్ నడిబొడ్డున ఆయన కాంస్య విగ్రహమూ వెలిసేది కాదు. అవమానాన్ని సవాలుగా తీసుకుని, జాతి ఆత్మగౌరవం కోసం పోరాడటం వల్లనే ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నాం. గాంధీజీ స్ఫూర్తితోనే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ నల్లవాళ్ల పట్ల జరుగుతున్న అవమానాలకు వ్యతిరేకంగా పోరాడాడు.
చరిత్రలోని ఉదాహరణలు సరే, ఇటీవలి ఉదంతాలను పరిశీలిస్తే, శాంతా బయోటెక్ ఒక సజీవ ఉదాహరణగా కనిపిస్తుంది. 1990వ దశకం... జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ సదస్సుకు భారత ప్రతినిధిగా వరప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. ఆ సదస్సులో వ్యాక్సిన్లకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. సదస్సుకు హాజరైన వారిలో ఒక జాత్యహంకారి ‘యూ ఇండియన్స్ ఆర్ ది బెగ్గర్స్... ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడమే మీకు తెలుసు’ అంటూ అవమానించాడు. వరప్రసాద్‌రెడ్డి దీనిని వ్యక్తిగత అవమానంగా భావించలేదు. తన దేశానికి, తన జాతికి జరిగిన అవమానంగా భావించారు.
నిమ్మళంగా ఆత్మావలోకనం చేసుకున్నారు. ఈ అవమానానికి మాటలతో కాదు, చేతలతో బదులివ్వాలని కృతనిశ్చయానికి వచ్చారు. డబ్ల్యూహెచ్‌వోలో జరిగిన అవమానానికి సమాధానంగా శాంతా బయోటెక్‌ను స్థాపించారు. వ్యాక్సిన్ల తయారీలో తమదే రాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల సరసన భారత్‌ను సగర్వంగా నిలబెట్టారు. అవమానం పొందిన చోటే అతి తక్కువ ధరలకు వ్యాక్సిన్లను ఇతర దేశాలకూ సరఫరా చేసి, ‘డోనర్’గా ఘనత సాధించారు. అందుకే.. ‘అవమానాన్ని ఆత్మపరిశీలనకు సాధనంగా ఉపయోగించుకుంటే విజయం సాధించగలం. అయితే, ఎంతో పరిణతి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. విజయం నుంచి విజయానికి అవకాశాలు తక్కువ. అపజయం నుంచి విజయానికి ఉన్నవన్నీ అవకాశాలే. అందువల్ల అవమానం నుంచి గెలుపు సాధించాలంటే చాలా సంయమనం అవసరం’ అంటారాయన.
పరాభవ పురాణం...
పురాణాలలోనూ పరాభవాల ఉదంతాలు తక్కువేమీ కాదు. త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగానికొస్తే... నిండుసభలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడి దురహంకారం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది.
సినిమాలకు ముడిసరుకు...
చాలా మాస్ మసాలా సినిమాలకు అవమానమే ముడి సరుకు. నిరుపేద హీరోను డబ్బున్న విలన్ అవమానిస్తాడు. కసితో రగిలిపోయిన హీరో, క్లైమాక్స్‌లో ఆ విలన్ భరతం పడతాడు. ఆత్మగౌరవానికి మారుపేరులాంటి హీరోయిన్ని విలన్ పరాభవిస్తాడు... తోకతొక్కిన తాచులా పగబట్టిన ఆమె విలన్ అంతు చూస్తుంది... ఒక్కోసారి సింగిల్‌గానే... కొన్నిసార్లు హీరో సహకారంతో... ఉదాహరణకు ‘ప్రతిఘటన’ సినిమాలో హీరోయిన్ను నడిబజారులో వలువలూడదీసి అవమానిస్తాడు విలన్. ఆమె తనలో తానే కుమిలిపోకుండా, నిండుసభలోనే విలన్‌ను చంపి ప్రతీకారం తీర్చుకుంటుంది.
విజయ సోపానాలు
అవమానాలను సహించడం కష్టమే అయినా, స్థిమితం కోల్పోకుండా స్పందిస్తే అవి మన పురోగతికి పనికొస్తాయి. మనలోని శక్తియుక్తులను వెలికితీసేవి, మన కర్తవ్యాన్ని గుర్తుచేసేవి, మనల్ని కార్యోన్ముఖులను చేసేవి చాలా సందర్భాల్లో అవమానాలే. అవమానాలను ఓటమిగా భావించి, కుంగిపోకుండా, సవాలుగా స్వీకరించి అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడితే, అవే మన విజయ సోపానాలవుతాయి.
- సరస్వతి రమ