పోస్టుల అమ్మకం!
►అనుభవం, అర్హత లేకున్నా...
►గుట్టుగా నాలుగో తరగతి ఉద్యోగుల నియామకం
►ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగుతున్న దందా
►తాజాగా నిలోఫర్ హెల్త్ ఇన్స్పెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు
సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని నాలుగో తరగతి ఉద్యోగాలు కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయాలు, స్వీపర్లు, డ్రైవర్లు, వార్డుబాయ్‌లు, టెక్నికల్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి ఉద్యోగ ఖాళీలను ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలతో పాటు ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రూ. 50 వేల వరకూ....
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొలువులు కావడంతో నిరుద్యోగుల నుంచి వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేకుండానే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఆయా ఆస్పత్రుల్లోని కార్మిక సంఘాల నాయకులు, అధికారులు... ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన వారితో ఈ పోస్టులను భర్తీ చేసుకున్నారు. ఇందు కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిలోఫర్‌లో బహిర్గతం...
నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పని చేసేందుకు కొత్తగా వంద పోస్టుల (నర్సులు, ఆయాలు, వార్డు బాయ్‌లు, డ్రైవర్)ను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. కానీ అప్పుడే వసూళ్ల పర్వం మొదలైంది. ఇప్పటికే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కింద పని చేస్తున్న వారితో బేరసారాలు మొదలయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై ఇటీవల నిలోఫర్ ఆస్పత్రికి చెందిన ఓ హెల్త్ ఇన్స్పెక్టర్పై పారిశుద్ధ కార్మికులు నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
అభివృద్ధి కమిటీలు.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు
మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సహాయంగా ఉండేందుకు పేషంట్ కేర్ ప్రొవైడర్స్ (క్లాస్ 4 ఉద్యోగాలు) పేరుతో రాష్ట్రంలోని 11 ఆస్పత్రుల్లో 1001 ఫోస్టులను (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఇప్పటికే ఆయా ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు 475 మందిని ఎంపిక చేసుకోగా, మిగిలిన 526 వాటిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించింది. ఉస్మానియాలో 416 పోస్టులకు గాను ఇప్పటికే 199 మంది ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కింద పని చేస్తున్నారు. మిగిలిన 217 పోస్టులను ఇటీవల భర్తీ చేశారు.
ఇక గాంధీలో 27 పోస్టులు ఉండగా, వీటిలో ఇప్పటికే 20 మంది పని చేస్తుండగా, మిగిలిన ఏడు ఖాళీల భర్తీకి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా వైద్య కళా శాలలో 162 ఖాళీలకు, 79 మంది ఇప్పటికే పని చేస్తుండగా, మరో 83 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇక సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో 72 ఖాళీల్లో ఇప్పటికే 16 మంది పని చేస్తుండగా , మిగిలిన 56 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫీవర్ ఆస్పత్రిలో 55 ఖాళీలకు 35 మంది పని చేస్తుండగా, మిగిలిన 20 ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ అయ్యాయి.