Employee Transfer
-
నాన్నొక చోట.. అమ్మొక చోట!
దివ్యాంగులైన నగేశ్ (బ్లైండ్) నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కె.మంజుల (బ్లైండ్) కూడా దివ్యాంగురాలే. ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. సెలవుల్లో మాత్రమే వీరికి పిల్లల్ని కలుసుకునే వీలు కలుగుతోంది. మిగతా రోజుల్లో తండ్రి దగ్గరో.. తల్లి దగ్గరో పిల్లలు ఉండాల్సిందే. మహేశ్ అనే మరో టీచర్దీ ఇదే పరిస్థితి. ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలోని నుసానూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తుండగా.. ఆయన భార్య మంచిర్యాల జిల్లా చెన్నూరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఒకేచోట నివాసముంటూ రోజూ విధులకు హాజరవడం వీలుపడదు. దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల సాధారణ బదిలీలను ఎట్టకేలకు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా బదిలీలను మాత్రం అటకెక్కించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత జూన్ నెలాఖరులో సాధారణ బదిలీల ప్రక్రియకు తెరలేపిన ప్రభుత్వం.. జూలై మూడో వారంతో ముగించింది. ఈ క్రమంలో సాగానికిపైగా ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. కానీ ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంతర్ జిల్లా ఉద్యోగుల బదిలీలను ఎటూ తేల్చకుండానే సాధారణ బదిలీలపై నిషేధం విధించింది. దీంతో వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు తీవ్ర నిరాశే మిగిలింది. దీంతో వారి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన సందర్భంలో వారు ఒకేచోట నివాసముండే అవకాశం కల్పించేలా నిర్ణీత దూరంలో పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఇటీవల జరిగిన బదిలీల్లో అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలకు మోక్షం దక్కలేదు. ప్రస్తుతం ఇలా ఇబ్బందులు పడుతున్న వారిలో ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. చివరగా 2012లో.. అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలు చివరగా 2012లో జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియ నిర్వహించినప్పటికీ.. సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంతో చాలామంది ఉద్యోగులకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత రెండు సార్లు సాధారణ బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తున్న ఆయా కేటగిరీలోని ఉద్యోగులకు బదిలీ అనివార్యమైంది. కొందరు ఉద్యోగులు మరింత దూరప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీంతో అంతర్ జిల్లా బదిలీలు కోరుకునే వారికి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఇటీవల సాధారణ బదిలీల సమయంలో అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తర్వాత ఆ ఊసెత్తలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం 21 కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో పనిచేసే ఉద్యోగులనే అర్డర్ టు సర్వ్ పద్ధతిలో కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో మూడేళ్లపాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకే బదిలీ అవకాశం కల్పించడంతో చాలా మందికి అవకాశం దక్కలేదు. అర్డర్ టు సర్వ్ పద్ధతిలో పంపించడంతో పాత పోస్టింగ్‌నే పరిగణిస్తారని ఉద్యోగులంతా భావించినప్పటికీ.. పనిచేస్తున్న చోటునే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం షాకిచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ పేరిట ప్రభుత్వం చేసిన బదిలీలతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లారు. భార్య, భర్తలు వేర్వేరు చోటకు బదిలీ కావడంతో నివాసాన్ని సైతం మార్చుకున్నారు. అలాంటి వారికి అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీల ప్రక్రియ ఊరట ఇస్తుందని భావించినా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. -
రెవెన్యూ బదిలీలకు బ్రేక్?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రి య ముగింపు దశలో ఉన్నందున ఆ శాఖ పరిధిలో బదిలీలను నిలిపేయాలని ఉన్నతాధికారులు యోచి స్తున్నట్లు సమాచారం. బదిలీల ప్రక్రియ ఈ నెల 15 లోగా ముగియాల్సి ఉన్నా ఇంతవరకు ఎలాంటి కస రత్తు జరగకపోవడంతో పాటు బదిలీలు చేపట్టవద్దని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం ఆ శాఖ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 20 లోగా పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయ్యాక బదిలీలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గజిబిజి.. గందరగోళం రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వాటి ఆధా రంగా పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ కొనసాగు తోంది. ఇప్పటివరకు సుమారు 42 లక్షల పాస్పుస్త కాల పంపిణీ పూర్తయింది. మరో 7 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. పంపిణీ చేసిన పుస్తకాల్లో భారీగా తప్పులు దొర్లడం తో వాటిని సరిచేయాల్సి ఉంది. ఈ తరుణంలో సాధారణ బదిలీలు చేస్తే అంతా గందరగోళంగా మారుతుందన్నది ఉన్నతాధికారుల వాదన. గ్రామం పై అవగాహన ఉన్న సిబ్బంది చేస్తేనే కొన్ని ఇబ్బం దులు వచ్చాయని, ఇప్పుడు కొత్త సిబ్బందిని పంపితే పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ కష్టమవుతుందని వారంటున్నారు. దీంతో పాస్‌పుస్తకాల పంపిణీ పూర్త య్యే దాకా బదిలీలు చేయొద్దని భావిస్తున్నారు. బదిలీలు లేకుంటే మళ్లీ కష్టాలే... రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజ యవంతం చేయడం తమ బాధ్యతే కానీ, నాలుగైదేళ్ల తర్వాత సాధారణ బదిలీలకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతే మళ్లీ బదిలీలు ఎప్పుడు జరుగుతాయోననే ఆందోళన రెవెన్యూ సిబ్బందిలో వ్యక్తమవుతోంది. బదిలీలు తమ హక్కని, ఏదో కార్యక్రమం పేరు చెప్పి తమ హక్కులకు భంగం కలిగించడం భావ్యం కాదం టున్నారు. ముఖ్యంగా జిల్లాల విభజన సమయంలో ఆర్డర్ టు సర్వ్ పేరుతో ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ బదిలీలు ఎప్పుడు ఉంటాయోనని ఎదురుచూస్తున్నామని, ఇప్పుడు తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. బదిలీలకు అనుమతివ్వకపోతే కనీసం మరో 2–3 ఏళ్లు తాము అవే కష్టాలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. మధ్యేమార్గంగా.. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా మరో ప్రతిపాదనను రెవెన్యూ సంఘాలు తెరపైకి తెస్తున్నాయి. అన్ని శాఖ ల ఉద్యోగులతోపాటు తమకూ సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించాలని, పాస్‌పుస్తకాల పంపిణీ అయ్యాకే బదిలీ అయిన సిబ్బందిని కొత్త స్థానాలకు పంపాలని, అప్పటి వరకు రిలీవ్ చేయకుండా పాత స్థానాల్లో పనిచేయించుకోవాలని వారు కోరుతున్నా రు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిగణిస్తా మని ఉన్నతాధికారులు చెబుతున్నా పాస్‌పుస్తకాల పంపిణీ తర్వాతే బదిలీలు చేయాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ నెల 20 తర్వాతే రెవెన్యూశాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు సచివాలయ స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బదిలీలపై నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. -
బదిలీ సరే.. విధుల మాటేంటి?
- ఒక్క ఉత్తర్వుతో 200 మంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల బదిలీ - పని అప్పగించని ప్రభుత్వం.. ఖాళీగా 200 మంది.. సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలు నేపథ్యంలో తమ శాఖను పునర్వ్యవస్థీకరించాలని వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది డిమాండ్ చేస్తుంటే.. ఉన్న సిబ్బందికి కూడా పని లేకుం డా చేశారు ఆ శాఖ ఉన్నతాధికారులు. దేశ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమీకృత, సరిహద్దు చెక్‌పోస్టుల్లో పని చేస్తున్న 200 మందికిపైగా సిబ్బందిని బదిలీ చేసిన ప్రభుత్వం.. వారికి పని బాధ్యతలు అప్పగించడాన్ని మర్చిపోయింది. దీంతో మూసివేసిన చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఏం చేయాలన్నది ప్రశార్థకంగా మారింది. ఏడు రోజుల క్రితమే నిర్ణయం చెక్‌పోస్టులను మూసివేయాలని గత నెల 23న వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయిం చారు. కానీ ఏడు రోజుల తర్వాత కూడా ఆ సిబ్బందికి విధులు అప్పగించడం చేయలేదు. దీంతో శనివారం రిపోర్టు చేయడానికి హైదరాబాద్ రూరల్, వరంగల్ నోడల్ డివి జన్ కార్యాలయాలకు వచ్చిన చెక్‌పోస్టు సిబ్బందికి విధులు అప్పగించలేదు. ఇందులో 10 మందికి పైగా ఉప వాణిజ్య పన్నుల అధి కారులు (డీసీటీవో), 40 మందికి పైగా సహా య వాణిజ్య పన్నుల అధికారులు (ఏసీటీవో) ఉండటం గమనార్హం. కుర్చీల్లేవ్.. ఖాళీల్లేవ్..! రాష్ట్రవ్యాప్తంగా 90 సర్కిళ్లలో చాలాచోట్ల సరిపడా సిబ్బంది లేకపోగా, సిబ్బంది ఉన్న చోట కూడా పని ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో క్లర్కులు, అటెండర్లను మినహాయించి డీసీటీవో, ఏసీటీవోలకైనా బాధ్యతలు అప్ప గిస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు బదిలీపై వచ్చిన సిబ్బంది కూర్చునేందుకు కుర్చీలు, ఆయా కార్యాలయాల్లో ఖాళీలు లేకపోవడం గమనార్హం. ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల చెక్‌పోస్టుల వద్ద రూ. లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, అక్కడి చెక్‌పోస్టుల్లో ఉన్న కంప్యూటర్లు, కుర్చీలు, బల్లలను తెప్పించుకోవడంలో కూడా ఉన్నతాధికారులు విఫలమయ్యారు. -
అమరావతి వచ్చిన వారికి మినహాయింపు
ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలకు సవరణలు సాక్షి, అమరావతి: రాజధాని మార్పిడిలో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు 2017 సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలను మార్చుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనగా సచివాలయ ఉద్యోగులెవరికీ ఈ ఏడాది సాధారణ బదిలీలు ఉండవు. అలాగే హైదరాబాద్ నుంచి విభాగాధిపతుల కార్యాలయాలకు వచ్చిన వారిని కూడా ఈ ఏడాది బదిలీ చేయరు. ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
బాహుబలితోనే పోటీ!
-
జోన్లపైనే జంఝాటం...
- కొత్త జిల్లాలతో మరో చిక్కుముడి - ముఖ్యమంత్రి వద్ద ఆగిపోయిన ఫైలు - బదిలీలు ఉండకపోవచ్చని పరోక్ష సంకేతాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆటంకం ఏంటి.. కొత్త జిల్లాలతో బదిలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. బదిలీలు చేస్తే కొత్త జిల్లాల్లో నిజంగానే ఇబ్బందులు తలెత్తుతాయా.. అయితే బదిలీలకు బ్రేకులు పడ్డట్లేనా..? అంటే అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. నెల రోజులుగా బదిలీలు కావాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిత్యం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా.. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. స్పష్టమైన హామీ ఇవ్వకుండా వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తోంది. బదిలీల తరువాతి పర్యవసానాలపై ఆలోచనలు చేస్తోంది. బదిలీలు చేయకపోతే ఉద్యోగులకు ఎలా నచ్చజెప్పాలని ఆలోచిçస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా లేని బదిలీలు... తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల బదిలీలు జరగలేదు. దీంతో బదిలీలు చేయాలని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరిగింది. గత నెలలో సీఎస్‌ను కలసి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు బదిలీల ఫైల్ సిద్ధం చేసి ముఖ్యమంత్రి వద్దకు పంపారు. ఫైలు సీఎం వద్దకు చేరినా.. బదిలీలకు అనేక చిక్కు ముళ్లు ఉండటంతో ప్రభుత్వం తేల్చలేకపోతోంది. ఈ విషయంలో ఏం చేయాలా అని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ముఖ్యంగా జోనల్ వ్యవస్థ అంశం ప్రధాన ఆటంకంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో దీనిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. కొత్త జిల్లాల అంశం కూడా మరో ఆటంకంగా మారింది. అప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను బదిలీ చేశారు. కొత్తగా ఏర్పడ్డ కొన్ని జిల్లాలు రెండు జోన్ల పరిధిలో ఉన్నాయి. ఇలాంటి చోట బదిలీలు చేస్తే జోన్ల సమస్యలు తలెత్తుతాయి. జోన్లు రద్దు చేయకుండా బదిలీ చేస్తే జోన్ల ఉల్లంఘన జరిగిందని ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీనిని కోర్టులు కొట్టి వేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం బదిలీల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సరైన కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టేస్తుండటంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతోంది. అందుకే బదిలీలు ఉండక పోవచ్చు అని తెలుస్తోంది. ఆ దిశగానే ప్రభుత్వం పరోక్ష సంకేతాలు ఇస్తోంది. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీచర్ల బదిలీలు లేవని ప్రకటించారు. దీంతో బదిలీలకు బ్రేకులు పడినట్టేనని తెలుస్తోంది. అందుకే ముందుగా టీచర్ల బదిలీలపై క్లారిటీ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారుమూల జిల్లాలకు తిప్పలే.. కీలకమైన సాధారణ బదిలీల విషయంలో సాంకేతిక సమస్యలతోపాటు ఖాళీల సమస్య కూడా తప్పేలా లేదు. బదిలీలకు అవకాశం కల్పిస్తే కొత్తగా ఏర్పడిన ఆసిఫా బాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూల్ వంటి మారు మూల జిల్లాల కలెక్టరేట్లలో పనిచేస్తున్న అరకొర సిబ్బంది కూడా పట్టణాలకు సమీపంలోని జిల్లాలను కోరుకుంటారని, అపుడు మారుమూల జిల్లాల్లో పాలన దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉద్యోగులతోపాటు ఉపాధ్యా యుల బదిలీల విషయంలో కొత్త జిల్లాల ప్రకారం చేయాలా? పాత జిల్లాల ప్రకారం చేయాలా? అన్నది ముందుగా నిర్ణయించాల్సి ఉంటుందని సీఎస్ పేర్కొన్నట్లు సమాచారం. పాత జిల్లాల ప్రకారం చేస్తే కొత్త జిల్లాల్లో, మూరుమూల ప్రాంతాల్లో ఉండకుండా, పట్టణ ప్రాంతాలకు వచ్చేందుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, దీంతో క్షేత్ర స్థాయిలో, కొత్త జిల్లాల్లో పాలనాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కొత్త జిల్లాల ప్రకారం చేయాలంటే ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న వారికి శాశ్వత కేటాయింపులు జరిపి, ఆ తరువాత బదిలీలు చేయాల్సి ఉంటుదన్న అభిప్రాయం నెలకొంది. దీంతో ఇçప్పటికిప్పుడు సాధారణ బదిలీలు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తిరిగి వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
బాహుబలితోనే పోటీ!
ఉద్యోగుల బదిలీల్లో కలెక్షన్ల లూటీ అమాత్యుల అండతో వసూళ్ల దందా! - పైరవీలకు గేట్లు తెరచిన ‘పేషీలు’ ∙ రంగంలోకి దిగిన దళారులు - పోస్టు ప్రాధాన్యతను బట్టి రేట్లు ∙ సీఎంఓలో ఓ ప్రముఖుడి పైరవీలు సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల్లో వసూళ్ల దందా పతాకస్థాయికి చేరుకుంది. బాహుబలిని తలదన్నే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పైరవీలు, వసూళ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. శాఖ ఏదైనా పోస్టును బట్టి, ప్రాధాన్యతను బట్టి, డిమాండ్‌ను బట్టి రేట్లు ఫిక్స్ చేసేశారు. ప్రతి బదిలీకీ ఒక రేటు ఖరారు చేసి మరీ వసూలు చేస్తున్నారు. గత నెల 24వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకూ బదిలీలపై నిషేధాన్ని రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెల్సిందే. దీంతో పలువురు మంత్రుల పేషీలు వసూళ్లకు తలుపులు బార్లా తెరిచాయి. బదిలీలను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు స్టార్ హోటళ్లలో మకాం వేసి మంత్రుల పేర్లు చెప్పి ముందుగానే ధరలు ఖరారు చేసి మరీ వసూళ్లు సాగిస్తున్నారు. కోరిన చోటుకు బదిలీ చేయిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో పోస్టింగుల కోసం భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. సొమ్ములిస్తే అన్నీ ఒకసారే చేసేద్దాం.. కొందరు మంత్రులైతే తమకు నమ్మకస్తులైన ఉన్నతాధికారులను, ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని ఎక్కువ బదిలీలకు గంపగుత్తగా బేరాలు మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ మంత్రి రెండు రోజుల కిందట తనకు నమ్మకస్తులైన కొందరు అధికారులను పిలిపించుకుని బదిలీలపై మంతనాలు సాగించారు. ‘ఎన్నికలకు ఇక రెండేళ్లే సమయముంది. ఖర్చులు పెరిగిపోతు న్నాయి. ఎన్నికల ఖర్చులకు కావాలి కదా.. మీరు మాట్లాడుకుని ఒక మొత్తం ఇవ్వండి. నేను వేలుపెట్టను. మీకు నచ్చినట్లు బదిలీలు చేసుకోండి...’ అని ప్రతిపాదించారు. 2014 బదిలీల సందర్భంగా గంపగుత్తగా రూ. 7 కోట్లు తీసుకున్న సదరు మంత్రి ప్రస్తుతం ఎన్నికల ఖర్చు పేరుతో రూ.14 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అవినీతికి గేట్లు ఎత్తివేత.. ప్రతి శాఖలో 20 శాతానికి మించి బదిలీలు చేయరాదనే నిబంధనకు చరమగీతం పాడి.. నూటికి నూరుశాతం బదిలీలు చేయడం ద్వారా సర్కారు పెద్దలు అవినీతికి పూర్తిగా గేట్లు ఎత్తివేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక భారీ గూడుపుఠాణి దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఒకే స్థానంలో మూడేళ్లు పని చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయిదేళ్లు ఒకే స్థానంలో ఉన్న వారిని కచ్చితంగా మార్చాల్సిందే’ అని ఆర్థిక శాఖ గత నెల 21న జారీ చేసిన జీవోలో స్పష్టంగా ఉంది. ఆదాయ ఆర్జన శాఖలో వాస్త వానికి అయిదేళ్లు సీలింగ్ ఉన్నా దానికి భిన్నం గా పరిస్థితి తయారైంది. ‘20 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలన్న నిబంధన ఉంటే 20 శాతం మంది నుంచి మాత్రమే దండుకునే అవకాశం ఉంటుంది. అదే అందరినీ బదిలీ చేస్తే ఎక్కువ వసూలు చేసుకోవచ్చు. ఈ స్వార్థంతోనే ప్రభుత్వం ఈ నిబంధన తెరపైకి తెచ్చింది. ఇది దారుణం’ అని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఉత్తర్వుల వెనుక భారీ లాలూచీ! వైద్య విద్యా శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఒకే చోట అయిదేళ్లకు మించి పని చేస్తున్నా వారు కోరితే తప్ప బదిలీ చేయరాదని శనివారం వైద్య ఆరోగ్య శాఖ 318 జీవో జారీ చేసింది. ఇది ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని, దీని వెనుక భారీ మతలబు దాగి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. కాగా, టీచర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకా లు ఇంకా జారీ కాకముందే కొందరు కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు. ప్రతి బదిలీకీ ఫిక్స్డ్ రేట్లు ► రెవెన్యూ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు (ఎస్ఓ)గా పని చేస్తున్న వారు తహసీల్దా ర్లుగా ఫోకల్ పోస్టు వేయించుకునేందుకు రూ.ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకూ ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సూపరింటెండెంట్లుగా పని చేస్తున్న వారు సబ్ రిజిస్ట్రార్లుగా ఫోకల్ పోస్టుకు వెళ్లేందుకు రూ.పది లక్షలకు పైగా ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ► అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (సహాయ అటవీ సంరక్షణ అధికారి)గా పని చేస్తున్న వారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస ర్(డీఎఫ్ఓ) ఫోకల్ పోస్టు కోసం రూ.10 నుంచి 15 లక్షల వరకూ ఇచ్చి పైరవీలు చేయించుకుంటున్నారు. ► ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (డీటీ) బదిలీకి రూ.25 నుంచి రూ.30 లక్షల బేరం సాగుతోంది. విజయ వాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో డీటీ పోస్టింగ్ రూ.40 లక్షల వరకూ పలుకు తోంది. ► ఎక్సైజ్ ఇన్స్పెక్టరు బదిలీ ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.5 నుంచి రూ.10 లక్షలు పలుకుతోంది. ► వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) బదిలీ ప్రాంతాన్ని బట్టి రూ. 5 నుంచి 15 లక్షల వరకూ బేరసా రాలు సాగుతున్నాయి. ► విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లో సబ్ రిజిస్ట్రారు పోస్టులు రూ.20 నుంచి రూ. 25 లక్షల వరకూ పలుకుతున్నాయి. -
నాలుగేళ్లయినా బదిలీలేవి?
► ఎక్సైజ్ శాఖలో అధికారుల గగ్గోలు సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలతో సంబంధం లేకుండా ప్రతి రెండేళ్లకోసారి స్థాన మార్పిడి జరిగే ఆబ్కారీ శాఖలో నాలుగేళ్లుగా స్తబ్దత నెలకొంది. ఈ శాఖలో నాలుగేళ్ల నుంచి అధికారులు కదలకుండా పనిచేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన సుమారు 70 ప్రాంతాల్లో ఏడాదికోసారి బదిలీలు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పార్టీలు, సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పనిచేసే వారిని ఏడాదికే బదిలీ చేయాలన్న నిబంధనలు బేఖాతరవడంతో ఆయా ప్రాంతాల్లో పోస్టింగుల్లో ఉన్నవారు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘాలు, ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 500 పోస్టులు ఖాళీ.. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ నుంచి అదనపు కమిషనర్ వరకు మంజూరైన పోస్టులు 3,602 కాగా, మినిస్టీరియల్ స్టాఫ్ 723. మొత్తం 4,325 పోస్టుల్లో ప్రస్తుతం 500 వరకు ఖాళీలున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలంటే పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సి ఉంది. కానీ నాలుగేళ్లుగా ఆ ప్రక్రియ సాగడం లేదు. దీంతో ధూల్‌పేట, నల్లమల, ఆదిలాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు అక్కడే ఉండిపోయారు. ఇక ఆదాయ మార్గాలు అధికంగా ఉండే రంగారెడ్డి జిల్లాలోని 70 శాతానికి పైగా స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు సీఐ, ఏఈఎస్, ఈఎస్ స్థాయి అధికారులు తమను కదిలించకపోవడమే మంచిదన్న ధోరణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల సంఘాలు సీఎంను కలసి బదిలీలకు అనుమతివ్వాల్సిందిగా కోరనున్నాయి. పదోన్నతులకు ఏసీబీ కేసుల అడ్డు! పదోన్నతులు కల్పిస్తేగానీ బదిలీలు జరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పదోన్నతుల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రభుత్వం ఈ పదోన్నతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా జాబితా తయారీలో అవకతవకలు జరిగాయని ఆబ్కారీ భవన్లో గొడవలు జరుగుతున్నాయి. అనర్హులను జాబితాలో చేర్చారని ఒకరిద్దరు అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. కాగా 2012-13లో ఉమ్మడి రాష్ట్రంలో చోటుచేసుకున్న సిండికేట్ల వ్యవహారంలో సీఐ స్థాయి నుంచి ఈఎస్ స్థాయి వరకు గల వారిలో 80 శాతం మందిపై ఏసీబీ కేసులున్న నేపథ్యంలో పదోన్నతులకు గండిపడింది. హైకోర్టులో ఉన్న ఈ కేసు తేలితే గానీ పదోన్నతులు వచ్చే పరిస్థితి లేదు. ప్రమోషన్లు లేకుండా బదిలీలు జరపాలని కోరుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. -
కదలరు.. మెదలరు..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా రెవెన్యూ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడి ఉద్యోగులు బదిలీ అయినా స్థానం మారకుండా కాలం గడిపేస్తారు. బదిలీ ఉత్తర్వులను సైతం ధిక్కరించి తామనుకున్నది జరిగేలా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి చేసి పంతం నెగ్గించుకుంటారు. మూడు నెలల క్రితం జిల్లా రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా 17 మంది ఉప తహసీల్దార్లకు స్థానమార్పిడి కలిగింది. అయితే వీరిలో కొందరు సీటు మారినప్పటికీ.. మరికొందరు మాత్రం అదే సీట్లో తిష్ట వేశారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెంచి కోరిన సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఓ డిప్యూటీ తహసీల్దార్ మూడు నెలల క్రితం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయితే.. ఆ స్థానంలో కాకుండా చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే ఓ డిప్యూటీ తహసీల్దార్ చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఆయన అక్కడ విధుల్లో చేరకుండా రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. అటు ఇటుగా... జిల్లాలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. దీంతో కొత్తగా రెండు ఆర్డీఓ పోస్టులు వచ్చాయి. దీంతో మరో రెండు కీలక పోస్టులు రావడంతో.. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి అప్పట్లో అనివార్య పరిస్థితుల్లో ఇతర కార్యాలయానికి బదిలీ అయ్యారు. తాజాగా జిల్లాలో కొత్త పోస్టు రావడం, పరిస్థితులు అనుకూలంగా మారడంతో కొత్త పోస్టుపై కన్నెశారు. పెద్దఎత్తున పైరవీలు చేసి సీటు దక్కించుకున్నారు. మరో అధికారి ఇక్కడే ఆర్డీఓగా పనిచేస్తున్నప్పకీ.. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్ కీలకం కావడంతో ఆ పోస్టు కోసం పైస్థాయి నుంచి మంత్రాంగం సాగించి సీటు కైవసం చేసుకున్నారు. ఇలా సీట్లు మారుతూ ఇక్కడే తిష్టవేస్తూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయినప్పటికీ.. కార్యాలయాలు మాత్రం వేరేచోట కొనసాగుతున్నాయి. వాస్తవంగా మల్కాజ్గిరి, రాజేంద్రనగర్ డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. మల్కాజ్గిరి డివిజన్‌కు కొత్తగా సిబ్బంది వస్తే గాని కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అలాగే ఇప్పుడున్న చేవెళ్ల డివిజన్ కార్యాలయాన్ని చేవెళ్ల మండల కేంద్రానికి మార్చాల్సి ఉంది. ఇందుకు సబంధించి చేవెళ్లలో ఓ కార్యాలయాన్ని రూ.10లక్షలు ఖర్చు చేసి సిద్ధం చేశారు. అయితే అధికారులు మాత్రం అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున ్న చేవెళ్ల వాసులకు ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటైనప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. మరోవైపు చేవెళ్ల డివిజన్ సిబ్బంది కొందరు రాజేంద్రగనర్ డివిజన్‌కు మారి, కొత్తగా వచ్చే వారిని చేవెళ్ల డివిజన్‌కు పంపేందుకు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.