జోన్లపైనే జంఝాటం... | No transfers from three years | Sakshi
Sakshi News home page

జోన్లపైనే జంఝాటం...

Published Mon, May 8 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

జోన్లపైనే జంఝాటం...

జోన్లపైనే జంఝాటం...

- కొత్త జిల్లాలతో మరో చిక్కుముడి
- ముఖ్యమంత్రి వద్ద ఆగిపోయిన ఫైలు
- బదిలీలు ఉండకపోవచ్చని పరోక్ష సంకేతాలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆటంకం ఏంటి.. కొత్త జిల్లాలతో బదిలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. బదిలీలు చేస్తే కొత్త జిల్లాల్లో నిజంగానే ఇబ్బందులు తలెత్తుతాయా.. అయితే బదిలీలకు బ్రేకులు పడ్డట్లేనా..? అంటే అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. నెల రోజులుగా బదిలీలు కావాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిత్యం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా.. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. స్పష్టమైన హామీ ఇవ్వకుండా వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తోంది. బదిలీల తరువాతి పర్యవసానాలపై ఆలోచనలు చేస్తోంది. బదిలీలు చేయకపోతే ఉద్యోగులకు ఎలా నచ్చజెప్పాలని ఆలోచిçస్తున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్లుగా లేని బదిలీలు...
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల బదిలీలు జరగలేదు. దీంతో బదిలీలు చేయాలని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరిగింది. గత నెలలో సీఎస్‌ను కలసి బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు బదిలీల ఫైల్‌ సిద్ధం చేసి ముఖ్యమంత్రి వద్దకు పంపారు. ఫైలు సీఎం వద్దకు చేరినా.. బదిలీలకు అనేక చిక్కు ముళ్లు ఉండటంతో ప్రభుత్వం తేల్చలేకపోతోంది. ఈ విషయంలో ఏం చేయాలా అని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ముఖ్యంగా జోనల్‌ వ్యవస్థ అంశం ప్రధాన ఆటంకంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో దీనిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.

కొత్త జిల్లాల అంశం కూడా మరో ఆటంకంగా మారింది. అప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను బదిలీ చేశారు. కొత్తగా ఏర్పడ్డ కొన్ని జిల్లాలు రెండు జోన్ల పరిధిలో ఉన్నాయి. ఇలాంటి చోట బదిలీలు చేస్తే జోన్ల సమస్యలు తలెత్తుతాయి. జోన్లు రద్దు చేయకుండా బదిలీ చేస్తే జోన్ల ఉల్లంఘన జరిగిందని ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీనిని కోర్టులు కొట్టి వేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం బదిలీల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సరైన కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టేస్తుండటంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతోంది. అందుకే బదిలీలు ఉండక పోవచ్చు అని తెలుస్తోంది. ఆ దిశగానే ప్రభుత్వం పరోక్ష సంకేతాలు ఇస్తోంది. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీచర్ల బదిలీలు లేవని ప్రకటించారు. దీంతో బదిలీలకు బ్రేకులు పడినట్టేనని తెలుస్తోంది. అందుకే ముందుగా టీచర్ల బదిలీలపై క్లారిటీ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మారుమూల జిల్లాలకు తిప్పలే..
కీలకమైన సాధారణ బదిలీల విషయంలో సాంకేతిక సమస్యలతోపాటు ఖాళీల సమస్య కూడా తప్పేలా లేదు. బదిలీలకు అవకాశం కల్పిస్తే కొత్తగా ఏర్పడిన ఆసిఫా బాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌ వంటి మారు మూల జిల్లాల కలెక్టరేట్లలో పనిచేస్తున్న అరకొర సిబ్బంది కూడా పట్టణాలకు సమీపంలోని జిల్లాలను కోరుకుంటారని, అపుడు మారుమూల జిల్లాల్లో పాలన దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉద్యోగులతోపాటు ఉపాధ్యా యుల బదిలీల విషయంలో కొత్త జిల్లాల ప్రకారం చేయాలా? పాత జిల్లాల ప్రకారం చేయాలా? అన్నది ముందుగా నిర్ణయించాల్సి ఉంటుందని సీఎస్‌ పేర్కొన్నట్లు సమాచారం.

పాత జిల్లాల ప్రకారం చేస్తే కొత్త జిల్లాల్లో, మూరుమూల ప్రాంతాల్లో ఉండకుండా, పట్టణ ప్రాంతాలకు వచ్చేందుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, దీంతో క్షేత్ర స్థాయిలో, కొత్త జిల్లాల్లో పాలనాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కొత్త జిల్లాల ప్రకారం చేయాలంటే ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న వారికి శాశ్వత కేటాయింపులు జరిపి, ఆ తరువాత బదిలీలు చేయాల్సి ఉంటుదన్న అభిప్రాయం నెలకొంది. దీంతో ఇçప్పటికిప్పుడు సాధారణ బదిలీలు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తిరిగి వచ్చాక దీనిపై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement