బాహుబలితోనే పోటీ! | Compete with the Baahubali in Employee Transfers | Sakshi
Sakshi News home page

బాహుబలితోనే పోటీ!

Published Mon, May 8 2017 1:09 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

బాహుబలితోనే పోటీ! - Sakshi

బాహుబలితోనే పోటీ!

ఉద్యోగుల బదిలీల్లో కలెక్షన్ల లూటీ
అమాత్యుల అండతో వసూళ్ల దందా!
- పైరవీలకు గేట్లు తెరచిన ‘పేషీలు’ ∙ రంగంలోకి దిగిన దళారులు
- పోస్టు ప్రాధాన్యతను బట్టి రేట్లు ∙ సీఎంఓలో ఓ ప్రముఖుడి పైరవీలు


సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల్లో వసూళ్ల దందా పతాకస్థాయికి చేరుకుంది. బాహుబలిని తలదన్నే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పైరవీలు, వసూళ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. శాఖ ఏదైనా పోస్టును బట్టి, ప్రాధాన్యతను బట్టి, డిమాండ్‌ను బట్టి రేట్లు ఫిక్స్‌ చేసేశారు. ప్రతి బదిలీకీ ఒక రేటు ఖరారు చేసి మరీ వసూలు చేస్తున్నారు. గత నెల 24వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకూ బదిలీలపై నిషేధాన్ని రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెల్సిందే. దీంతో పలువురు మంత్రుల పేషీలు వసూళ్లకు తలుపులు బార్లా తెరిచాయి. బదిలీలను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు స్టార్‌ హోటళ్లలో మకాం వేసి మంత్రుల పేర్లు చెప్పి ముందుగానే ధరలు ఖరారు చేసి మరీ వసూళ్లు సాగిస్తున్నారు. కోరిన చోటుకు బదిలీ చేయిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో పోస్టింగుల కోసం భారీ మొత్తం డిమాండ్‌ చేస్తున్నారు.

సొమ్ములిస్తే అన్నీ ఒకసారే చేసేద్దాం..
కొందరు మంత్రులైతే తమకు నమ్మకస్తులైన ఉన్నతాధికారులను, ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని ఎక్కువ బదిలీలకు గంపగుత్తగా బేరాలు మాట్లాడుతున్నారు. ఒక సీనియర్‌ మంత్రి రెండు రోజుల కిందట తనకు నమ్మకస్తులైన కొందరు అధికారులను పిలిపించుకుని బదిలీలపై మంతనాలు సాగించారు. ‘ఎన్నికలకు ఇక రెండేళ్లే సమయముంది. ఖర్చులు పెరిగిపోతు న్నాయి. ఎన్నికల ఖర్చులకు కావాలి కదా.. మీరు మాట్లాడుకుని ఒక మొత్తం ఇవ్వండి. నేను వేలుపెట్టను. మీకు నచ్చినట్లు బదిలీలు చేసుకోండి...’ అని ప్రతిపాదించారు. 2014 బదిలీల సందర్భంగా గంపగుత్తగా రూ. 7 కోట్లు తీసుకున్న సదరు మంత్రి ప్రస్తుతం ఎన్నికల ఖర్చు పేరుతో రూ.14 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.  

అవినీతికి గేట్లు ఎత్తివేత..
ప్రతి శాఖలో 20 శాతానికి మించి బదిలీలు చేయరాదనే నిబంధనకు చరమగీతం పాడి.. నూటికి నూరుశాతం బదిలీలు చేయడం ద్వారా సర్కారు పెద్దలు అవినీతికి పూర్తిగా గేట్లు ఎత్తివేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక భారీ గూడుపుఠాణి దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఒకే స్థానంలో మూడేళ్లు పని చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయిదేళ్లు ఒకే స్థానంలో ఉన్న వారిని కచ్చితంగా మార్చాల్సిందే’ అని ఆర్థిక శాఖ గత నెల 21న జారీ చేసిన జీవోలో స్పష్టంగా ఉంది. ఆదాయ ఆర్జన శాఖలో వాస్త వానికి అయిదేళ్లు సీలింగ్‌ ఉన్నా దానికి భిన్నం గా పరిస్థితి తయారైంది. ‘20 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలన్న నిబంధన ఉంటే 20 శాతం మంది నుంచి మాత్రమే దండుకునే అవకాశం ఉంటుంది. అదే అందరినీ బదిలీ  చేస్తే ఎక్కువ వసూలు చేసుకోవచ్చు. ఈ స్వార్థంతోనే ప్రభుత్వం ఈ నిబంధన తెరపైకి తెచ్చింది. ఇది దారుణం’ అని  ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఆ ఉత్తర్వుల వెనుక భారీ లాలూచీ!
 వైద్య విద్యా శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఒకే చోట అయిదేళ్లకు మించి పని చేస్తున్నా వారు కోరితే తప్ప బదిలీ చేయరాదని శనివారం వైద్య ఆరోగ్య శాఖ 318 జీవో జారీ చేసింది. ఇది ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని, దీని వెనుక భారీ మతలబు దాగి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. కాగా, టీచర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకా లు ఇంకా జారీ కాకముందే కొందరు కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు.

ప్రతి బదిలీకీ ఫిక్స్‌డ్‌ రేట్లు
► రెవెన్యూ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్లు (ఎస్‌ఓ)గా పని చేస్తున్న వారు తహసీల్దా ర్లుగా ఫోకల్‌ పోస్టు వేయించుకునేందుకు రూ.ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకూ ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సూపరింటెండెంట్లుగా పని చేస్తున్న వారు సబ్‌ రిజిస్ట్రార్లుగా ఫోకల్‌ పోస్టుకు వెళ్లేందుకు రూ.పది లక్షలకు పైగా ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు.
► అసిస్టెంట్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (సహాయ అటవీ సంరక్షణ అధికారి)గా పని చేస్తున్న వారు డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీస ర్‌(డీఎఫ్‌ఓ) ఫోకల్‌ పోస్టు కోసం రూ.10 నుంచి 15 లక్షల వరకూ ఇచ్చి పైరవీలు చేయించుకుంటున్నారు.
► ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీటీ) బదిలీకి రూ.25 నుంచి రూ.30 లక్షల బేరం సాగుతోంది. విజయ వాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో డీటీ పోస్టింగ్‌ రూ.40 లక్షల వరకూ పలుకు తోంది.
► ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టరు బదిలీ ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.5 నుంచి రూ.10 లక్షలు పలుకుతోంది.
► వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) బదిలీ ప్రాంతాన్ని బట్టి రూ. 5 నుంచి 15 లక్షల వరకూ బేరసా రాలు సాగుతున్నాయి.
► విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లో సబ్‌ రిజిస్ట్రారు పోస్టులు రూ.20 నుంచి రూ. 25 లక్షల వరకూ పలుకుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement