employees devision
-
విద్యుత్ సౌధలో టెన్షన్.. టెన్షన్..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన అంశం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏపీ సంస్థల్లో పని చేస్తున్న స్థానిక ఉద్యోగులను అక్కడి యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ చేసి, తెలంగాణ విద్యుత్ సంస్థలకు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఆయా ఉద్యోగులు సోమవారం రిలీవ్ ఆర్డర్లు తీసుకుని తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల వద్దకు చేరుకున్నారు.అప్పటికే అక్కడ భారీగా మోహరించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యుత్ సౌధ సహా మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఎన్.శివాజీ, పి.అంజయ్య, రామేశ్వర్‌శెట్టి, షరీఫ్, వి నోద్, గణేష్, రవికుమార్, వీరస్వామి, పరమేశ్, తిరుపతయ్య, అనిల్ సహా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం ఆయా కార్యాలయాల ముందు బైఠాయించారు. ఏపీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయా కార్యాలయాల ప్రధాన గేట్ల ముందు పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఏపీ ఉద్యోగులు లోనికి వెళ్తే..తెలంగాణ ఉద్యోగులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించి, ఆ మేరకు అక్కడికి చేరుకున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోనికి అనుమతించారు.కనీసం ఉద్యోగుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా వారినెలా రిలీవ్ చేస్తారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలను ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అం శంలో జస్టిస్ ధర్మాధికారి ఏపీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగే విధంగా కేటాయింపులు చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వారిని రిలీవ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. -
చంద్రబాబుతో ఆర్టీసీ ఎండీ సమావేశం
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణ 6కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణను హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జూలై 6కు వాయిదా పడింది. ఈ అప్పీళ్ల విచారణార్హతపైనే వాదనలు వినిపించాలని హైకోర్టు ఈ సందర్భంగా జెన్కో, పంపిణీ సంస్థల తరఫు న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీ ట్రాన్స్‌కో, జెన్కో, పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఈ అప్పీళ్ల విచారణార్హతపై ఉద్యోగుల తరఫు సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, వేదుల వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీనర్సింహలు అభ్యంతరం తెలిపారు. సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల్లో టీ ట్రాన్స్‌కో తదితరులు కౌంటర్లు దాఖలు చేయలేదని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్లు దాఖలు చేయకుండా అప్పీళ్లు దాఖలు చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. రిలీవ్ చేసిన ఉద్యోగులకు కేవలం పది రోజులకు మాత్రమే జీతాలు చెల్లించారని వేదుల వెంకటరమణ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం, తదుపరి విచారణ సమయంలో ఈ అప్పీళ్ల విచారణార్హతపై వాదనలు వినిపించాలని టీ ట్రాన్స్‌కో, ఇతర పంపిణీ సంస్థల అప్పీళ్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, జి.విద్యాసాగర్, ఎస్.నిరంజన్‌రెడ్డిలకు స్పష్టం చేస్తూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది.