ఉద్యోగులను తీసేస్తున్న ట్విట్టర్
భారతదేశంలో తమ అభివృద్ధి కార్యకలాపాలు ఇక చాలించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిర్ణయించుకుంది. దాంతో బెంగళూరులోని ట్విట్టర్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్లు ఉద్యోగాలు హరీమనే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్నదీ ఇంకా ట్విట్టర్ ప్రకటించలేదు. తమ వ్యాపార సమీక్షలో భాగంగా, బెంగళూరు డెవలప్మెంట్ సెంటర్లో ఇంజనీరింగ్ కార్యక్రమాలను ఆపేయాలని తాము నిర్ణయించుకున్నామని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకాలం తమకు విలువైన సేవలు అందించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారిని గౌరవప్రదంగా తమ కంపెనీ నుంచి పంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది. అయితే భారత దేశాన్ని మాత్రం ట్విట్టర్ యూజర్లు, భాగస్వాములు, ప్రకటనకర్తలకు మంచి వ్యూహాత్మక మార్కెట్‌గా కంపెనీ ఇప్పటికీ భావిస్తోందని అంటోంది.
ప్రపంచంలో శరవేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటని, అందువల్ల ఇక్కడ తమ ఆడియన్స్‌ను విస్తృతం చేసుకోడానికి, యూజర్ల ఎంగేజ్మెంట్ పెంచడానికి, ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోడానికి కావల్సిన కీలక చర్యలలో పెట్టుబడులు పెడుతూనే ఉంటామని కంపెనీ చెప్పింది. బెంగళూరుకు చెందిన జిప్‌డయల్ మొబైల్ సొల్యూషన్స్ అనే మొబైల్ మార్కెటింగ్, ఎనలిటిక్స్ కంపెనీని గత సంవత్సరం ట్విట్టర్ కొనుగోలు చేసింది. దాంతో ఇక్కడ ఇంజనీరింగ్ కేంద్రాన్ని నెలకొల్పింది. అయితే ఫేస్బుక్ లాంటి ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం, ఆ విషయంలో పెద్దగా పురోగతి కనబర్చలేకపోవడంతో ట్విట్టర్ ఆర్థిక ఫలితాలు కూడా దారుణంగా పడిపోయాయి.