Employment associations
-
సగం సొమ్ము ఉద్యోగులదే
నగదు రహిత వైద్యంపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన నగదు రహిత వైద్యానికి అయ్యే ఖర్చులో 50 శాతం ఉద్యోగులనుంచే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించాయని పేర్కొంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. నగదు రహిత వైద్యానికి ఏడాదికి రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అందులో 50 శాతం ఉద్యోగుల నుంచి వసూలు చేస్తామని ఆమె అన్నారు. 2016 జనవరి 13న జరిగిన సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వినతులను పరిశీలించామని, ఏడాదికి ఉద్యోగులు రూ.200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని, ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ప్రతినిధులతో, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ కూడా చర్చలు జరపగా, కొన్ని సవరించిన ప్యాకేజీలకు ఒప్పుకున్నారని, ఈ కసరత్తు మొత్తం 6 వారాల్లో పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ సలహాదారుతో పాటు నిపుణులు సూచించారని మాలకొండయ్య తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 31 వరకూ రీయింబర్స్ గడువు: 2015 డిసెంబర్ 31తో ఉద్యోగులు, పెన్షనర్ల రీయింబర్స్ చెల్లింపుల గడువు ముగిసింది. అయితే నగదు రహిత వైద్యం సరిగా అమలు కాకపోవడం, రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఉద్యోగ సంఘాల కోరిక మేరకు గడువు మార్చి 31 వరకూ పొడిగించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 31 వరకూ నగదు రహిత వైద్యంతో పాటు రీయింబర్స్మెంట్ కూడా వర్తిస్తుంది. -
తరలింపులో.. స్థానికతే అసలు సమస్య
హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి తరలింపుపై ఉద్యోగుల డిమాండ్లు సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికతపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తరలింపులో ఇదే పెద్ద సమస్యగా పేర్కొన్నాయి. రాజ్యాంగ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఉంటే.. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి వర్తించేలా తాత్కాలిక ఉత్తర్వులైనా ఇప్పించాలని కోరాయి. హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపుపై చర్చించడానికి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో పురపాలకశాఖ మంత్రి నారాయణ గురువారమిక్కడ సచివాలయంలో సమావేశమయ్యారు. భేటీ ముగిశాక మంత్రి నారాయణ, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూసంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. వివరాలు సేకరించాలని నిర్ణయం యూనిఫాం సర్వీసు సిబ్బందితో కలపి 14,800 మంది హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి తరలివెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం లెక్కలు తేల్చింది. పిల్లల చదువులు, దంపతుల్లో ఒకరి ఉద్యోగం తెలంగాణలో ఉండటం, ఆరోగ్య సమస్యలు.. తదితర కారణాలతో తప్పనిసరిగా హైదరాబాద్‌లోనే నివాసం ఉండాల్సిన ఉద్యోగులు ఎంతమంది ఉంటారో తేల్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల వివరాలు సేకరించాలని, వాటి ఆధారంగా విశ్లేషించి.. కొంతమందిని హైదరాబాద్‌లో ఉంచే అవకాశమిచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయిం చారు. తరలింపు తథ్యం: మంత్రి నారాయణ కొత్త రాజధానిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం జూన్ 15కు పూర్తవుతుందని, ఉద్యోగుల తరలింపు తథ్యమని మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయం, అసెంబ్లీలను ఒకేదశలో తరలిస్తామని చెప్పారు. శాఖాధిపతుల కార్యాలయాల్ని అవసరాల్నిబట్టి దశలవారీగా తరలిస్తామన్నారు. స్థానికత అంశాన్ని పరిష్కరించడానికి జీఏడీ అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపించాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగులు ప్రస్తావించిన డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని, సీఎంతో మాట్లాడాక వచ్చేనెల 9, 10 తేదీల్లో మరోసారి ఉద్యోగసంఘాలతో భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజధానిలో పదివేల ఇళ్లు: అశోక్‌బాబు రాజధానిలో ఉద్యోగుల వసతికోసం పదివేల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. ఇవన్నీ ప్రభుత్వ క్వార్టర్లుగా ఉంటాయన్నారు. రెండోదశలో ‘రెంట్ టు ఓన్’ పథకాన్ని ప్రవేశపెట్టాలనే తమ డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. -
ఇదేనా కార్యాచరణ?
♦ అవినీతిని తగ్గిస్తామని తిరుపతి సదస్సులో సీఎం ప్రకటన ♦ రాజకీయ జోక్యంపై స్పష్టత ఇవ్వకపోవడంపై నిరాశ ♦ సీఎం వైఖరిపై తీవ్ర చర్చనీయాంశం సాక్షి, తిరుపతి : సమస్యల సుడిగుండంలో నలుగుతున్న తమను ప్రభుత్వాధినేత గట్టెక్కించేలా భరోసా ఇస్తారని గంపెడాశలతో తిరుపతికి వచ్చిన ఉద్యోగుల్లో సీఎం తీరుపట్ల మిశ్రమ స్పందన వచ్చింది. రాష్ట్రంలోని 4.5లక్షల ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్ల తరపున భవిష్యత్ కార్యాచరణపై సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. దీనికి రాష్ర్టం నలుమూలల నుంచి 105 ఉద్యోగ సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. ప్రకటించిన 43శాతం ఫిట్మెంట్ అమలులో మరింత స్పష్టత, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయంలో రాజకీయ జోక్యం, దీర్ఘకాలికంగా ఉన్న పదోన్నతి సమస్యలు, అవినీతి, సంస్కరణలు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పెరగాల్సిన వసతి సౌకర్యాలు, నూతన రాజధాని నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర, అక్కడ కల్పించాల్సిన వసతి సౌకర్యాలైపై స్పష్టత వస్తుందని అందరూ ఆశించారు. అయితే, ఇందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు స్పందన చూసి ఉద్యోగులు నివ్వెరపోయారు. ‘‘ఫిట్మెంట్ పెంచాం.. అవినీతిని తగ్గిస్తాం’’ అన్న ధోరణిలో మాత్రమే చంద్రబాబు ప్రసంగం సాగింది. అదే స్థాయిలో అందరికీ ట్యాబ్‌లు, ఐప్యాడ్లు అందిస్తాం.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు పెంచండి అన్న సందేశాలు మాత్రమే సీఎం ప్రసంగంలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, అవినీతిలో వారి పాత్ర విషయంలో సీఎం ఏమాత్రం స్పష్టత ఇవ్వకపోవడంపై కూడా వారికి తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పక తప్పదు. విధి నిర్వహణలో తాము అవినీతికి పాల్పడబోమంటూ ఉద్యోగ సంఘం నేతలు రూ.100 బాండు పత్రాల్లో రాసిస్తామని. అదే స్థాయిలో తమపై రాజకీయ జోక్యం ఉండదని సీఎం హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నిస్తే .. అందుకు సీఎం సమాధానం నవ్వుతో సరిపెట్టి సమాధానాన్ని దాటవేసే ధోరణి కనబడింది. చంద్రబాబు ప్రసంగంలో పదేపదే ‘‘నన్ను నమ్మండి.. మీకు మేలు చేస్తాను’’ అని చెప్పినా ఉద్యోగుల్లో స్పందన మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. -
కేసీఆర్‌కు అభినందనల వెల్లువ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలియజేశారు. పీఆర్టీయూ, టీఆర్టీయూ, తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘాల నేతలు ఆదివారం కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియ జేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని విద్యా పరంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని పీఆర్టీయూ నేతలు పేర్కొన్నారు. అలాగే హరీష్‌రావుకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మా శ్వాస.. ఆశ సమైక్యమే
తెలుగుతల్లిపై వేలాడుతున్న విభజన గొడ్డలికి ఎదురెళతామంటూ నాయకులు, ఉద్యోగులు సమర శంఖం పూరించారు. తెలుగు నేలను చీల్చే కుట్రలను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రే శ్వాసగా, ఆశగా ముందుకు వెళతామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గురువారం పలు పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రజల భాగస్వామ్యంతో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం టౌన్, న్యూస్‌లైన్:పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా గురువారం ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్‌లు, సినిమా హాళ్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. వైఎస్ఆర్ సీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం రహదారులు దిగ్బంధం చేస్తామని ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా పూసపాటిరేగలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు సమక్షంలో సుమారు 200 బైక్‌లతో ర్యాలీ జరిగింది. విజయనగరంలో అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భోగాపురంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇమ్మిడిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్.కోటలో నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ గేదెల తిరుపతి, వేచలపు చినరామునాయుడు, వల్లూరి జయప్రకాశ్‌బాబు, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు కోళ్ల గంగాభవాని, యల్లపు దమయంతిదేవి, జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ షేక్ రహ్మాన్, ఎస్సీ సెల్ కన్వీనర్ కె.పాల్‌కుమార్, మండల కన్వీనర్ ఎస్.సత్యంల నేతృత్వంలో చేపట్టిన సమైక్యాంధ్ర బంద్ విజయవంతమైంది. వీరికి మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ దర్గామదీనా తదితరులు సంఘీభావం తెలిపారు. గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు స్వగృహం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంట్యాడ, బోనంగి, పెదమజ్జిపాలెం, బుడతనాపల్లి గ్రామాల్లోనూ వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు కొనసాగాయి. అలాగే పార్వతీపురంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్యాంధ్ర బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ బంద్‌లో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో రాస్తారోకో జరిగింది. ఈ బంద్‌కు ఏపీఎన్జీఓల సంఘం సంఘీబావం తెలిపింది. అనంతరం సుమారు 50 మోటారు సైకిళ్లతో వైఎస్ఆర్ సీపీ నాయకులు ర్యాలీ చేశారు. కురుపాం నియోజక వర్గంలోని గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అలాగే సాలూరులో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ గరుడపల్లి ప్రశాంత్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు గొర్లె మధు, మాజీ మున్సిపల్ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావులు సమైక్యాంధ్రకు మద్ధతుగా బుధవారం అర్ధరాత్రి సాలూరు ఆర్టీసీ డీపో వద్ద ధర్నా నిర్వహించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చీపురుపల్లిలోనూ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాల నాయకుడు ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.