సగం సొమ్ము ఉద్యోగులదే
నగదు రహిత వైద్యంపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన నగదు రహిత వైద్యానికి అయ్యే ఖర్చులో 50 శాతం ఉద్యోగులనుంచే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించాయని పేర్కొంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. నగదు రహిత వైద్యానికి ఏడాదికి రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అందులో 50 శాతం ఉద్యోగుల నుంచి వసూలు చేస్తామని ఆమె అన్నారు. 2016 జనవరి 13న జరిగిన సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వినతులను పరిశీలించామని, ఏడాదికి ఉద్యోగులు రూ.200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని, ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ప్రతినిధులతో, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ కూడా చర్చలు జరపగా, కొన్ని సవరించిన ప్యాకేజీలకు ఒప్పుకున్నారని, ఈ కసరత్తు మొత్తం 6 వారాల్లో పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ సలహాదారుతో పాటు నిపుణులు సూచించారని మాలకొండయ్య తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మార్చి 31 వరకూ రీయింబర్స్ గడువు: 2015 డిసెంబర్ 31తో ఉద్యోగులు, పెన్షనర్ల రీయింబర్స్ చెల్లింపుల గడువు ముగిసింది. అయితే నగదు రహిత వైద్యం సరిగా అమలు కాకపోవడం, రీయింబర్స్‌మెంట్ లేకపోవడం వల్ల ఉద్యోగ సంఘాల కోరిక మేరకు గడువు మార్చి 31 వరకూ పొడిగించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 31 వరకూ నగదు రహిత వైద్యంతో పాటు రీయింబర్స్‌మెంట్ కూడా వర్తిస్తుంది.