బాక్సైట్‌పై సర్కారు వెనుకడుగు | Government back on the bauxite | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌పై సర్కారు వెనుకడుగు

Published Tue, Nov 17 2015 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

బాక్సైట్‌పై సర్కారు వెనుకడుగు - Sakshi

బాక్సైట్‌పై సర్కారు వెనుకడుగు

సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తడంతో దీనిపై ఇచ్చిన జీఓను ఉపసంహరించుకుని యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ  జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. దీంతోపాటు తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్ రాత్రి 11 గంటలకు మీడియాకు వివరించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..

► గిరిజనులు, ఇతరుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత విస్తృత స్థాయిలో చర్చించి బాక్సైట్ తవ్వకాలపై ముందుకెళ్లాలని నిర్ణయం. అప్పటివరకూ తవ్వకాలపై ఇచ్చిన జీఓ నిలిపివేత. అటవీ శాఖ జారీ చేసిన జీఓ 97ను వెనక్కుతీసుకుని అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
► వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు అమలు చేయాలి. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే కాంట్రాక్టును మెడాల్ కంపెనీకివ్వాలి. సంవత్సరానికి ఇందుకు రూ.130 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా ఎక్స్‌రే సేవలందించే కాంట్రాక్టును కృష్ణా డయాగ్నోస్టిక్స్‌కు అప్పగించాలి. ఇందుకు సంవత్సరానికి రూ.1.35 కోట్లు ఖర్చు చేయాలి. జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో సిటీ స్కాన్ సేవలను ఉచితంగా అందించే కాంట్రాక్టునూ కృష్ణా డయాగ్నోస్టిక్స్‌కే ఇవ్వాలి.
► ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన మహిళలను ఆస్పత్రి నుంచి ఇంటికి ప్రభుత్వమే తీసుకెళ్లే ఏర్పాటు. మెడికల్ పరికరాలను సొంతంగా తయారు చేసేందుకు రాష్ట్రంలో మెడికల్ డివెజైస్ తయారీ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయం.
► 25,567 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు.  జనవరిలో జరిగే జన్మభూమి సభల్లో చెక్కుల రూపంలో ఈ నగదు పంపిణీ. ఏపీ ఇన్‌ఫ్రాస్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ చట్టం 2001 ప్రకారం ప్రభుత్వ భూములను 33 సంవత్సరాలకు లీజు పరిమితిని సవరించి పారిశ్రామిక విధానంలో భాగంగా 99 సంవత్సరాలు, ఫ్రీ హోల్డింగ్, అమ్మకం జరిపేలా చట్టాన్ని సవరించాలి.
► వ్యవసాయ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై విధించే విద్యుత్ డ్యూటీ ఆరు పైసలుపై కేటగిరీల వారీగా మార్పులు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చేలా చట్టంలో మార్పు తేవాలి.
► అనంతపురంలో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్లోస్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 4,500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవాలి. యూనిట్ విలువ రూ.28 వేల కోట్లు, మాన్యుఫ్యాక్చరింగ్ విలువ రూ.5 వేల కోట్లు మొత్తం రూ.33 వేల కోట్లు ప్రాజెక్టు అంచనా. ఇందుకోసం అవసరమయ్యే సుమారు 5 వేల ఎకరాలను ప్రభుత్వం సమకూర్చాలి. దీనివల్ల 8 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
► నూతనంగా రాష్ట్రంలో పోర్టు విధానానికి రూపకల్పన. గుజరాత్, మహారాష్ట్రలో అమలవుతున్న పోర్టు పాలసీని అధ్యయనం చేసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మించే పోర్టులను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై విధివిధానాలు రూపొందించేందుకు ఏపీ మారిటైడ్ బోర్డు ఏర్పాటుకు అనుమతి.  
► కొత్తగా వచ్చిన 11.37 లక్షల రేషన్‌కార్డు దరఖాస్తులను జన్మభూమి కమిటీలు పరిశీలించిన తర్వాత మంజూరు చేయాలని నిర్ణయం. దీంతో కార్డుదారుల సంఖ్య 3.86 కోట్లకు చేరిక.  కొత్తగా 20 లక్షల మందికి మార్చి 31లోపు గ్యాస్ కనెక్షన్ల మంజూరు. సంక్రాంతి కానుకను గత ఏడాది మాదిరిగానే తెల్లకార్డుదారులకు ముందుగా  పంపిణీ.
► విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయం.
► ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల్లో ఈ సంవత్సరం కొత్తగా 50 వేల వ్యవసాయ బోర్లకు అనుమతి. వీటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం.   
 
 మమ్మల్ని మన్యంలో తిరగనివ్వరు
 ఉత్తరాంధ్ర మంత్రుల ఆందోళన
 సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం బాక్సైట్ తవ్వకాలపై మంత్రివర్గ సమావేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు మంత్రులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి తవ్వకాలు జరిపితే గిరిజనులు తమను మన్యంలో తిరిగనివ్వరని, మావోయిస్టులు బతకనివ్వరని వాపోయినట్లు సమాచారం.      మంత్రుల ఒత్తిడితో చంద్రబాబు తవ్వకాల జీఓను నిలుపుదల చేద్దామని చెప్పినట్లు తెలిసింది. మొదట ఇప్పటివరకూ జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ తర్వాత జీఓ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత తగ్గకపోతే తవ్వకాలపై పునరాలోచన చేద్దామని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలోని తెల్లకార్డులన్నింటినీ పసుపు రంగులోకి మార్చాలని సమావేశంలో నిర్ణయించారు.

 దేవినేని ఉమ, చినరాజప్పపై ఆగ్రహం
 వర్షాకాలం వచ్చిందని తెలిసినా చెరువులు పటిష్టానికి చర్యలు తీసుకోకపోవడంపై ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, దేవినేని ఉమపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చెరువులు తెగుతాయని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించినట్లు సమాచారం. మంత్రుల మధ్య సమన్వయం లేదని ఇకపై ఇలా చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ కమిషనర్ ఢిల్లీ వెళ్లడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement