మా శ్వాస.. ఆశ సమైక్యమే
Published Fri, Feb 14 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
తెలుగుతల్లిపై వేలాడుతున్న విభజన గొడ్డలికి ఎదురెళతామంటూ నాయకులు, ఉద్యోగులు సమర శంఖం పూరించారు. తెలుగు నేలను చీల్చే కుట్రలను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రే శ్వాసగా, ఆశగా ముందుకు వెళతామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గురువారం పలు పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ప్రజల భాగస్వామ్యంతో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్:పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా గురువారం ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్‌లు, సినిమా హాళ్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. వైఎస్‌ఆర్ సీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం రహదారులు దిగ్బంధం చేస్తామని ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా పూసపాటిరేగలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు సమక్షంలో సుమారు 200 బైక్‌లతో ర్యాలీ జరిగింది.
విజయనగరంలో అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భోగాపురంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇమ్మిడిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్.కోటలో నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ గేదెల తిరుపతి, వేచలపు చినరామునాయుడు, వల్లూరి జయప్రకాశ్‌బాబు, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు కోళ్ల గంగాభవాని, యల్లపు దమయంతిదేవి, జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ షేక్ రహ్మాన్, ఎస్సీ సెల్ కన్వీనర్ కె.పాల్‌కుమార్, మండల కన్వీనర్ ఎస్.సత్యంల నేతృత్వంలో చేపట్టిన సమైక్యాంధ్ర బంద్ విజయవంతమైంది.
వీరికి మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ దర్గామదీనా తదితరులు సంఘీభావం తెలిపారు. గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు స్వగృహం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంట్యాడ, బోనంగి, పెదమజ్జిపాలెం, బుడతనాపల్లి గ్రామాల్లోనూ వైఎస్‌ఆర్ సీపీ ఆందోళనలు కొనసాగాయి. అలాగే పార్వతీపురంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్యాంధ్ర బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ బంద్‌లో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో రాస్తారోకో జరిగింది. ఈ బంద్‌కు ఏపీఎన్‌జీఓల సంఘం సంఘీబావం తెలిపింది. అనంతరం సుమారు 50 మోటారు సైకిళ్లతో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ర్యాలీ చేశారు.
కురుపాం నియోజక వర్గంలోని గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అలాగే సాలూరులో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ గరుడపల్లి ప్రశాంత్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు గొర్లె మధు, మాజీ మున్సిపల్ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావులు సమైక్యాంధ్రకు మద్ధతుగా బుధవారం అర్ధరాత్రి సాలూరు ఆర్టీసీ డీపో వద్ద ధర్నా నిర్వహించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చీపురుపల్లిలోనూ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాల నాయకుడు ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
Advertisement